TGSRTC: ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:38 AM
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం మే 7 నుంచి సమ్మె చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.

హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని పలు కార్మిక సంఘాలు ప్రకటించాయి. మే 7 నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో.. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించింది. ఇందులో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని.. సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ల మధ్య భేదాభిప్రాయాలను, భేషజాలను విడనాడాలని కోరారు. కాగా, సమ్మె అనివార్యమైతే దానికి మద్దతుగా నిలుస్తామని స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎ్‌ఫ-సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు తెలిపారు. ఇక అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొనేందుకు ముందుకొస్తే తాము మద్దతిస్తామని స్టాఫ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి తెలిపారు.