Share News

Indiramma Houses: గులాబీ కార్యకర్తలకూ ఇల్లు ఇస్తాం

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:40 AM

ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు, ఏ కులం, ఏ మతం అని చూడలేదు. పేదోడైతే చాలనుకున్నాం. చివరకు గులాబీ తొడుక్కున్న వాళ్లకు కూడా ఇళ్లు ఇస్తాం’’ అని రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

Indiramma Houses: గులాబీ కార్యకర్తలకూ ఇల్లు ఇస్తాం

  • పేదోడైతే చాలు మంజూరు చేస్తాం: పొంగులేటి

  • సన్నబియ్యం రూపంలో ప్రతి కుటుంబానికి నెలకు రూ.2 వేల వరకు ఆదా: శ్రీధర్‌బాబు

పెద్ద్దపల్లి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు, ఏ కులం, ఏ మతం అని చూడలేదు. పేదోడైతే చాలనుకున్నాం. చివరకు గులాబీ తొడుక్కున్న వాళ్లకు కూడా ఇళ్లు ఇస్తాం’’ అని రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు, పెద్దపల్లి రూరల్‌, మహిళా, ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్ల శుక్రవారం ఆయన ప్రారంభించారు. పెద్దపల్లిలో రూ.4.25 కోట్లతో నిర్మించనున్న సమీకృత కూరగాయల మార్కెట్‌కు శంకుస్థాపన చేసి చందపల్లి, రాంపెల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. కల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజలను మోసం చేసి పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. ప్రజలకు వెలగ బెట్టిందేమి లేదని పొంగులేటి విమర్శించారు.


పేదలకు ఇళ్లు ఇవ్వలేని దద్దమ్మ తన కోసం రాజభవనం నిర్మించుకున్నాడని విమర్శించారు. పేద వాడి కలను కలగానే మిగిల్చారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదలకు అండగా ఉండేందుకు ఈ ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు 22,500 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. తల తాకట్టు పెట్టయినా రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు మంజూరు చేసి తీరతామని అన్నారు. మరో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించిందని, వీటి విలువ రూ. 175 కోట్లు అని చెప్పారు. ఎన్నికల సందర్భంగా సన్న బియ్యం ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి సన్న బియ్యం రూపంలో రూ.2 వేల వరకు ఆదా చేస్తున్నామన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 03:40 AM