MLA Raja Singh-SS Rajamouli: దర్శకుడు రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్.. ఘాటు వ్యాఖ్యలతో వీడియో
ABN , Publish Date - Nov 20 , 2025 | 09:08 PM
ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువులెవరూ రాజమౌళి సినిమాలు చూడొద్దని పిలుపునిచ్చారు. ఇలాంటి దర్శకులపైన ఫిర్యాదు చేయండి! ఇలాంటి వారిని జైల్లో వేస్తేనే ..
హైదరాబాద్, నవంబర్ 20: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిపై హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. హిందువులెవరూ రాజమౌళి సినిమాలు చూడొద్దని రాజాసింగ్ ప్రకటించారు. మూవీ ప్రమోషన్ కోసం హనుమంతుడిపై వ్యాఖ్యలు చేస్తారా? అంటూ రాజాసింగ్ నిలదీశారు. నమ్మకం లేదంటూనే దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజమౌళి నిజంగా నాస్తికుడైతే.. అదే మాట చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
గతంలో కూడా హిందూ దేవుళ్లపై దర్శకుడు రాజమౌళి ఇలాగే మాట్లాడారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ధర్మంపై తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపిస్తాం.. నాస్తిక డైరెక్టర్ల సినిమాలు జనం చూడొద్దు అంటూ రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
'అసలు మీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ‘వారణాసి’ పేరుతో మహేష్‌బాబును పెట్టి మరో సినిమా తీస్తున్నారు.. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హనుమాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా మీరు నిజంగానే నాస్తికుడా? ఏంటన్నది డిక్లేర్ చెయ్యాలి. ఇందులో రాజమౌళి తప్పేమీ లేదు.. అసలు తప్పంతా హిందువులదే. ఇలాంటి డెరెక్టర్‌ను హిందువులు కనుగొనలేక పోతున్నారు. హిందూ దేవుళ్ల పట్ల నమ్మకం లేని రాజమౌళి సినిమాలను హిందువులు ఎందుకు చూడాలి?' అంటూ ప్రశ్నించారు.
'ప్రభాస్‌తో 'బాహుబలి' సినిమా తీశారు.. అతనితో శివలింగాన్ని ఎత్తించారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. మళ్లీ హిందు దేవుళ్లపై నమ్మకం లేదని చెబుతున్నారు. అతను ఇలా కామెంట్ చేయడం ఇది మొదటి సారి కాదు. గతంలో భగవాన్ శ్రీకృష్ణుడికి చెందిన 16 వేల మంది దాసీలను లవర్స్ అంటూ హేళన చేశారు. రాముడు అంటే ఇష్టం లేదనీ, అతని స్టోరీ బోరింగ్ స్టోరీ అని గతంలో ట్వీట్ చేశారు. ఇప్పుడు హనుమంతుడిపైన కామెంట్స్ చేశారు' అంటూ రాజాసింగ్ విమర్శలు చేశారు.
'ఈ సందర్భంగా హిందువులకు ఓ సూచన చేయాలనుకుంటున్నా.. ఇలాంటి దర్శకులపైన ఫిర్యాదు చేయండి! ఇలాంటి వారిని జైల్లో వేస్తేనే హిందూ దేవుళ్లపై కామెంట్స్ చేస్తే ఏం జరుగుతుందో అర్ధమవుతుంది. పనికిరాని డైరెక్టర్ల సినిమాలు చూడొద్దు.. మనం ఇలాంటి వ్యక్తులు తీసిన సినిమాలు చూస్తాం.. దాంతో వాళ్లు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. నాస్తికత్వం పేరుతో మన దేవుళ్లపై కామెంట్ చేసే ఇలాంటి వారిని బ్యాన్ చేద్దాం' అంటూ రాజా సింగ్ వీడియోలో కోరారు.
ఇక దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. రాష్ట్రీయ వానరసేన దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News