Share News

Jubilee Hills By Election Campaign: పెద్దల మధ్యే జూబ్లీ పోటీ!

ABN , Publish Date - Nov 09 , 2025 | 02:54 AM

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే ప్రచారానికి అవకాశం ఉండగా ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు తమ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నారు......

Jubilee Hills By Election Campaign: పెద్దల మధ్యే జూబ్లీ పోటీ!

  • 3 పార్టీల ముఖ్యనేతలకు ప్రతిష్ఠాత్మకంగా ఎన్నిక

  • తామే అభ్యర్థులమన్నట్లుగా ప్రచారం

  • పరస్పర విమర్శలతో ప్రసంగాల్లో మంటలు

  • రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, కేటీఆర్‌దే కీలకపాత్ర

  • నేతలందర్నీ మోహరించిన పార్టీలు

  • బకాయిల పేరుతో డబ్బులడుగుతున్న ఓటర్లు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే ప్రచారానికి అవకాశం ఉండగా ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు తమ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మూడు పార్టీల కీలక నేతలూ తామే అభ్యర్థులమన్నంత పట్టుదలతో తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తున్నారు. కాలికి బలపం కట్టుకుని గల్లీల్లో తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. ప్రసంగాల్లోనూ అవతలిపక్షం ముఖ్యనేతల మీద పరిధులు దాటి తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, సవాళ్లు విసురుతూ ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలను సైతం పక్కన పెట్టి ప్రచారానికి విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారంటే జూబ్లీహిల్స్‌ ఎన్నికకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతోంది. ముఖ్యనేతలు ఈ ఎన్నికను తమ ‘ప్రతిష్ఠకు సవాలు’గా తీసుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌, హరీశ్‌రావు తమ పార్టీల నుంచి ప్రచారరంగంలోకి దిగారు. ఓడితే భవిష్యత్తు సమీకరణాలు మారతాయనే భావనే వారిని ప్రచారంలో తలమునకలయ్యేలా చేస్తోంది.

రేవంత్‌కు గెలుపు అవసరం

సీఎం రేవంత్‌రెడ్డికి ఈ ఉప ఎన్నికలో గెలుపు అత్యవసరంగా కనిపిస్తోంది. తన రెండేళ్ల పాలనకు లిట్మస్‌ టెస్టుగా భావిస్తున్నారు. అందుకే వారం రోజులుగా ప్రచారంలో శ్రమిస్తున్నారు. గెలుపు సాధించడం ద్వారా కాంగ్రెస్‌ పట్టు కొనసాగుతోందని ప్రజలకు చెప్పదల్చుకున్నారు. గెలిస్తే సీఎంకు మరింత దన్ను లభిస్తుంది. పార్టీ, ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలు సద్దుమణుగుతాయి. అందుకే, రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గమంతా కలియదిరిగారు. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ ఖాతాలో చేరితే మరింత అభివృద్ధి చేస్తానని భరోసా ఇస్తున్నారు. గెలవాలన్న పంతంతో ప్రచారాన్ని తన భుజాన వేసుకున్నారు.


సిటింగ్‌ సీటును నిలుపుకోవడం లక్ష్యం

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజకీయాలకు కొత్త కావడంతో ఆ పార్టీ ప్రచారంలో కేటీఆర్‌, హరీశ్‌లే ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో అనివార్యమైన ఉప ఎన్నికలో సిట్టింగ్‌ సీటును నిలుపుకోవడానికి ఈ ఇద్దరు నేతలు ప్రచారంలో తలమునకలయ్యారు. లోక్‌సభలో ఒక్క సీటు గెలుచుకోక పోయినా ‘జూబ్లీ’లో సత్తా చాటి తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ నగరం బీఆర్‌ఎ్‌సకు దన్నుగా నిలిచింది. ఈ సానుకూలతను సొమ్ము చేసుకుంటూ కాంగ్రె్‌సపై కొన్ని విషయాల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తున్నారు. హరీశ్‌ తన తండ్రి చనిపోయిన పది రోజులకే ప్రచారంలోకి దిగారు. ఆ పది రోజులు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అన్నట్లుగా ఇంటి నుంచే క్షేత్ర స్థాయి నేతలకు ఫోన్లు చేసి, ప్రచారంపై సూచనలు, సలహాలు ఇచ్చారు.

కిషన్‌రెడ్డికి సొంత నియోజకవర్గం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కూడా ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. జూబ్లీహిల్స్‌ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఉంది. దాంతో ఆయనకు అక్కడ సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి. అధికారిక విధుల్ని పక్కనబెట్టి జూబ్లీహిల్స్‌లోనే ఉండి ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. రాత్రిళ్లు ప్రచార వ్యూహాన్ని రూపొందించుకోవడం, ఉదయం నుంచి ప్రచారాన్ని రక్తి కట్టించడం దినచర్యగా మారిపోయింది. దీనికోసం కేంద్ర మంత్రివర్గ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. జూబ్లీహిల్స్‌ను గెలిపించుకునే బాధ్యత కిషన్‌రెడ్డిదేనంటూ ఇటీవల బీజేపీ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆత్మరక్షణలో పడిన కిషన్‌రెడ్డి ఉప ఎన్నికల్లో సత్తా చూపాలన్న పట్టుదలను చూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా ప్రచారం రంగంలోకి దిగారు. నగరంలో బీజేపీకి పట్టు ఉందన్నది నిరూపించుకోవడం బీజేపీకి ముఖ్యం.


పోటాపోటీ ప్రచారం

ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ఇప్పటికే నియోజకవర్గం మొత్తాన్ని చుట్టి వచ్చారు. ప్రధాన కులాల వారితో సమావేశాలు నిర్వహించి, భరోసాకల్పిస్తున్నారు. రెండు జాతీయ పార్టీల జాతీయ నేతలు కూడా తమవంతు సాయం చేస్తున్నారు. ఏఐసీసీ రాష్ట్ర, నియోజకవర్గ నేతలకు తగిన సూచనలిస్తూ ప్రోత్సహిస్తోంది. బీజేపీ తరపున కేంద్రమంత్రులే వచ్చి ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్‌ కేడర్‌ అంతా నియోజకవర్గంలోనే ఉంది.

జూబ్లీహిల్స్‌లో అభ్యర్థుల కంటే ఎక్కువగా మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలు చెమటోడ్చుతున్నారు. అపార్ట్‌మెంట్లు ఎక్కలేక, దిగలేక అపసోపాలు పడుతున్నారు. ఓటర్లు కిందకు వస్తే మూకుమ్మడిగా ఓట్లను అభ్యర్థించాలని ఆశించిన నేతలకు నిరాశే ఎదురవుతోంది. మంత్రి స్థాయి నేతలు వచ్చినపుడు దిగుతున్నారు కానీ ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వచ్చినపుడు ఓటర్లు కిందకు దిగడం లేదు. బోరబండ, రహమత్‌నగర్‌, యూస్‌ఫగూడ, ఎర్రగడ్డ, షేక్‌పేట, వెంగళ్‌రావు నగర్‌ డివిజన్లలో బస్తీల్లోనే వ్యక్తిగత ఇళ్లున్నాయి. ఎక్కువగా అపార్ట్‌మెంట్‌ కమ్యూనిటీలే ఉంటున్నాయి. బ్లాక్‌లతో ఉన్న అపార్ట్‌మెంట్లలో 150-200 కుటుంబాలు ఉంటే, ఐదంతస్తుల అపార్ట్‌మెంట్లలో 20-30 కుటుంబాలుంటున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా తలుపుతట్టి ప్రచారం చేయాల్సి వస్తోంది. మధురానగర్‌లో వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి.. అపార్ట్‌మెంట్‌కు వెళ్ళితే ఎవరూ కిందకు దిగలేదు. 40 కుటుంబాలు, వంద ఓట్లు ఉండటంతో వదిలిపెట్టే సాహసం చేయరు. పైగా అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ పాడైంది. దాంతో ఆయన ఐదు అంతస్తులు ఎక్కడానికి, దిగడానికి ఇబ్బందులకు గురయ్యారు. ఇలా అపార్ట్‌మెంట్ల ప్రచారంలో ఎక్కడానికి, దిగడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.కొన్నిచోట్ల అపార్ట్‌మెంట్‌ వాసులు పట్టుబట్టి గొంతెమ్మ కోర్కెలను నెరవేర్చుకుంటున్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లో వెయ్యి ప్లాట్ల కమ్యూనిటీ ఏదో సంస్థకు 18 లక్షల బకాయి ఉంది. దాన్ని చెల్లించాలని ఓట్లు అడగడానికి వచ్చిన పార్టీ నేతల ముందు డిమాండ్‌ పెట్టారు. 12 లక్షలు చెల్లించినా చాలని బేరం పెట్టారు. ఇంతలో మరోపార్టీ 18 లక్షలు చెల్లిస్తామని బేరం కుదుర్చుకుంది.

Updated Date - Nov 09 , 2025 | 02:54 AM