Bhatti Vikramarka: మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:43 AM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక ధరలు అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

ఇసుక విక్రయ కేంద్రాలను పెంచాలి:భట్టి
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక ధరలు అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే.. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 20 ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.
కాగా... మార్కెట్ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో మరిన్ని ఇసుక కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది. ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే కార్యక్రమంపై పారిశ్రామిక వాడల వారీగా అధికారులతో మంత్రులు సమీక్షించారు.