Duddila Sridharbabu: ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Jun 25 , 2025 | 08:13 AM
భావితరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఇఫ్కీ)’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

ఇండో-ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫ్రెంచ్ సంస్థ సఫ్రాన్ త్వరలో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్
హైదరాబాద్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): భావితరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఇఫ్కీ)’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంగళవారం సచివాలయంలో ఇఫ్కీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ అందిస్తున్న ప్రోత్సాహాకాలను వివరించారు. ‘తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్ రెడ్డి 30 వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ‘ఇది ఒక నగరం కాదు. భవిష్యత్తు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే మా సంకల్పమ’ని తెలిపారు. ఏడాదిన్నర వ్యవధిలోనే తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. గత ఏడాది హైదరాబాద్‌లో 70 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ప్రారంభమయ్యాయని, పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. పరిశ్రమలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కీ తరఫున యోహాన్ సామ్యూల్, ప్రియాంక్ ప్రకాష్, నకుల్ దల్వాలా, మోనిన్, ఓపెల్లా హెల్త్ కేర్, సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా, సనోఫీ ఇండియా, టెలిపెర్ఫార్మెన్స్, వార్ ఎలకో్ట్రకెమ్, జీగ్లర్ ఏరోస్పేస్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఫ్రెంచ్ విమాన ఇంజన్ల తయారీ సంస్థ సఫ్రాన్ ముందుకొచ్చింది.
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సఫ్రాన్ హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ప్రపంచస్థాయి ఉత్పాదక కేంద్రా లు ఏర్పాటు చేసింది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సఫ్రాన్ జనరల్ మేనేజర్ పియరీ ఫెర్నాండెజ్ కొత్త పెట్టుబడులను ప్రతిపాదించారు. కొత్తగా సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ అనే కంపెనీని నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. రాఫెల్, ఎం 88 ఫైటర్ జెట్ ఇంజన్ల నిర్వహణ, ఓవర్‌హాలింగ్ పనులను సఫ్రాన్ చేపడుతుంది. దీంతో వచ్చే ఏడాది చివరి నాటికి 150 కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత దశల్లో మరో 750 ఉద్యోగాలు వస్తాయి. రాఫెల్ యుద్ధ విమానాల ఇంజన్లకు కీలక విడి భాగాలను సఫ్రాన్ తయారు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఫెర్నాండెజ్ కృతజ్ణతలు తెలిపారు.