konda surekha: ఆ ఆర్జేసీ పోస్టులెక్కడ
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:04 AM
దేవాదాయ శాఖలో ఏళ్లుగా పోస్టులు, పోస్టింగ్‌ల పంచాయితీ సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత

రాష్ట్ర విభజన తర్వాత దేవాదాయ శాఖకు నాలుగు ఆర్జేసీ పోస్టుల మంజూరు
భర్తీ అయింది ఒక్కటే.. పత్తా లేని మిగతా పోస్టులు
పదోన్నతులతో పోస్టుల భర్తీకి జేఏసీ డిమాండ్
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలో ఏళ్లుగా పోస్టులు, పోస్టింగ్‌ల పంచాయితీ సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ దేవాదాయ శాఖకు ఒక కమిషనర్, మూడు అడిషనల్ కమిషనర్(ఏడీసీ), 4 రీజినల్ జాయింట్ కమిషనర్(ఆర్జేసీ)తోపాటు డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులు అత్యంత కీలకం. అయితే పైస్థాయిలో ఉండే పోస్టుల్లో కమిషనర్/డైరెక్టర్, ఏడీసీలు మినహా... తర్వాతి స్థానంలో ఉండే ఆర్జేసీ పోస్టులకు సంబంధించి దశాబ్దకాలంగా ఎలాంటి స్పష్టత లేకుండాపోయింది. వేములవాడ, భద్రాచలం, యాదగిరి గుట్ట ఆలయాలకు ఈవోలుగా ఆర్జేసీ స్థాయి అధికారులు ఉండాలి. నాలుగు ఆర్జేసీ పోస్టుల్లో ఒక ఆర్జేసీ(పరిపాలన) పోస్టు భర్తీ కాగా ఐదేళ్లుగా ఒక్కరే ఇన్‌చార్జి హోదాలో కొనసాగుతున్నారు. వేములవాడ, భద్రాచలం, యాదగిరి గుట్ట ఆర్జేసీ క్యాడర్ ఆలయాలు. ఇప్పటి వరకు ఈ ఆలయాలకు ఆర్జేసీ స్థాయి అధికారుల నియామకం జరగలేదు. వేములవాడకు మొన్నటి దాకా డీసీ క్యాడర్ అధికారిని ఈవోగా కొనసాగించగా... ఇటీవలే రెవెన్యూ నుంచి ఆర్డీవోను డిప్యుటేషన్‌పై తీసుకుని బాధ్యతలు అప్పగించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి కూడా ఆర్డీవో.. ఈవోగా కొనసాగుతున్నారు. కాగా భద్రాచలం ఈవో మంగళవారం పదోన్నతి పొందారు. యాదగిరిగుట్టకు తొమ్మిదేళ్లు ఈవోగా పనిచేసిన గీతారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవాదాయ శాఖ కమిషనర్/డైరెక్టర్ గుట్ట ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక దేవాదాయ శాఖలోకి ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్ల రద్దు, సీనియార్టీ సమీక్షించి అర్హులందరికీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల జేఏసీ సమావేశంలో చర్చించింది. విషయం దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్‌రావు దృష్టికి వెళ్లగా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెల రోజులైనా సమావేశం ఏర్పాటు చేయకపోవడం, సమస్యల పరిష్కారానికి సమీక్షలు జరపకపోవడాన్ని సిబ్బంది తప్పుబడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News