Share News

Father Takes Life: ఏ తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదు.. కూతురి పెళ్లి చేయలేక..

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:44 PM

ఏళ్లు గడుస్తున్నా కూతురి పెళ్లి చేయలేకపోతున్నానన్న బాధలో ఓ తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో తన బాధను చెప్పుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Father Takes Life: ఏ తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదు.. కూతురి పెళ్లి చేయలేక..
Father Takes Life

కూతురు ఉన్న ప్రతీ తండ్రికి కూతురి పెళ్లి ఓ పెద్ద బాధ్యత. అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని ఓ మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతీ తండ్రి అనుకుంటాడు. అప్పు చేసైనా సరే పెళ్లికి పూనుకుంటాడు. అలాంటి ఓ తండ్రికి కూతురి పెళ్లి అసాధ్యంగా మారింది. ‘ఏ తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదు’ అనిపించేలా కామారెడ్డి జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కూతురి పెళ్లి చేసే స్థోమత లేక ఓ వ్యక్తి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. 70 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బాన్సువాడ మండలం నెమ్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల చిట్టె వీరయ్య తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఐదేళ్లుగా కూతురి పెళ్లి కోసం నానా పాట్లు పడుతున్నాడు. కట్నం విషయంలో సంబంధాలు కుదరకుండా పోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా కూతురి పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టలేకపోయాడు. కుటుంబ పోషణకే ఆదాయం సరిపోయేది కాదు. గత కొద్దిరోజుల నుంచి వీరయ్య తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. నెమ్లి శివారు అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


ఆత్మహత్యకు ముందు ఓ సూసైడ్ నోట్ రాశాడు. ఆ నోట్‌లో ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

మొసలిని రౌండప్ చేసిన సింహాలు.. థ్రిల్లింగ్ ఫైట్‌లో చివరకు ఏం జరిగిందో చూడండి..

ఇందిరమ్మ చీరల పంపిణీపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Updated Date - Nov 20 , 2025 | 01:32 PM