Share News

Siddipet: సిద్దిపేట ‘ప్రజావాణి’లో రైతు ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:36 AM

తన భూ సమస్యను పరిష్కరించడం లేదంటూ సిద్దిపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఓ రైతు డీజిల్‌ ప్యాకెట్‌తో రావడం కలకలం రేపింది.

Siddipet: సిద్దిపేట ‘ప్రజావాణి’లో రైతు ఆత్మహత్యాయత్నం

  • భూ సమస్యను పరిష్కరించడంలేదని ఆరోపణ

సిద్దిపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తన భూ సమస్యను పరిష్కరించడం లేదంటూ సిద్దిపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఓ రైతు డీజిల్‌ ప్యాకెట్‌తో రావడం కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్దనగిరి గ్రామానికి చెందిన రైతు చిలుపూరి ఎల్లారెడ్డి (70)కి 12 ఎకరాల వారసత్వపు భూమితో పాటు సొంతంగా కొనుగోలు చేసిన 18 ఎకరాల భూమి ఉంది. వివాదాల కారణంగా వారసత్వపు భూమిని రెవెన్యూ అధికారులు గతంలో బ్లాకు లిస్టులో పెట్టారు. తర్వాత ఎల్లారెడ్డి కొనుగోలు చేసిన భూమిలో కూడా తమకు వాటా ఉందని అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ భూమిని కూడా అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు.


అప్పుచేసి ఆ భూమిని కొనుగోలు చేశానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ రైతు తహసీల్దార్‌, ఆర్‌డీవో కార్యాలయాలను ఆశ్రయించాడు. సిద్దిపేట కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో ఐదు సార్లు దరఖాస్తులు సమర్పించాడు. తహసీల్దార్‌ తన భూమిని బ్లాక్‌ లిస్టులో నుంచి తొలగిస్తానని చెబుతూ కాలయాపన చేస్తున్నాడని, ఆర్‌డీవో వద్దకు వెళ్తే బ్లాక్‌ లిస్టులో నుంచి తీయడం కుదరదని చెప్పాడని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. భూమిని బ్లాక్‌ లిస్టులో నుంచి తీయకపోగా, పండించిన ధాన్యాన్ని కూడా ఐకేపీ కేంద్రాల్లో కొనలేదని ఆరోపించాడు.

Updated Date - Jul 08 , 2025 | 05:36 AM