Ponguleti: పదేళ్లు పాలించినోళ్లు ఒక్క కార్డూ ఇవ్వలేదు
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:17 AM
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3.54 లక్షల మందికి రేషన్ కార్డులను అందిస్తున్నామని, సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నేడు 3.54 లక్షల రేషన్ కార్డుల పంపిణీ : పొంగులేటి
నేలకొండపల్లి/హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3.54 లక్షల మందికి రేషన్ కార్డులను అందిస్తున్నామని, సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో ఆదివారం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం, నాయకులు మాటలతో కాలయాపన చేశారే తప్ప.. ఒక్క రేషన్ కార్డును కూడా ఇవ్వలేదన్నారు. నాలుగు విడతల్లో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.
పాలేరు సాగర్ యూటీ నుంచి నేడు నీరు విడుదల
ఖమ్మం జిల్లా పాలేరులోని సాగర్ ఎడమ ప్రధాన కాల్వ అండర్ టన్నెల్ (యూటీ) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. సోమవారం నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో జరుగుతున్న పాలేరు సాగర్ కాల్వ పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.