Share News

VIP Visit: నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్‌

ABN , Publish Date - Nov 23 , 2025 | 07:38 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి వెళ్లనున్నారు.

VIP Visit: నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్‌

  • సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

  • అనంతరం ఫ్యూచర్‌ సిటీకి.. గ్లోబల్‌ సమ్మిట్‌ పనుల పరిశీలన

హైదరాబాద్‌/రంగారెడ్డి/మక్తల్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం ఆయన హైదరాబాద్‌ నుంచి పుట్టపర్తికి చేరుకుంటారు. సాయికుల్వంత్‌ హాల్‌లో నిర్వహించనున్న సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఆయన ఫ్యూచర్‌ సిటీకి రానున్నారు. డిసెంబరు 8 నుంచి 11వ తేదీ వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో సర్కారు గ్లోబల్‌ సమ్మిట్‌-2025 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ సదస్సు పనులను పరిశీలించేందుకు సీఎం రేవంత్‌ మీర్‌ఖాన్‌పేటకు వస్తున్నారు. సీఎం రాక నేపఽఽథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, రాచకొండ కమిషనర్‌ సుధీర్‌బాబుతోపాటు పలువురు ఉన్నతాధికారులు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 1,300 ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరుకానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సు నిర్వహణ కోసం మీర్‌ఖాన్‌ పేట రెవెన్యూ పరిధిలోని దాదాపు 300 ఎకరాలను చదును చేస్తున్నారు. కాగా, జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ డిసెంబరు 1న నారాయణపేట జిల్లా మక్తల్‌కు రానున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజున గోలపల్లి శివారులో హెలిప్యాడ్‌ నుంచి నేరుగా కాట్రేవ్‌పల్లి రోడ్‌ వద్దకు సీఎం చేరుకొని నారాయణపేట, మక్తల్‌, కొడంగల్‌ ఎత్తిపోతల పథకం భూనిర్వాసితులకు చెక్కులు అందజేస్తారని వెల్లడించారు. అనంతరం గోలపల్లి శివారులో రూ.200 కోట్లతో నిర్మించే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలకు శంకుస్థాపన చేస్తారని వివరించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వాకిటి పేర్కొన్నారు.


సీఎం రేవంత్‌ను కలిసిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను ఆయనకు తెలిపారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ, క్రీడా యూనివర్సిటీతోపాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను మోహన్‌ యాదవ్‌కు వివరించారు.

Updated Date - Nov 23 , 2025 | 07:39 AM