Share News

Aryan Singh: ఫాల్కన్‌ స్కామ్‌లో కంపెనీ సీవోవో అరెస్టు

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:53 AM

ఫాల్కన్‌ గ్రూప్‌ స్కామ్‌ కేసులో సీఐడీ అధికారులు మరొకరిని అరెస్ట్‌ చేశారు. కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో) ఆర్యన్‌ సింగ్‌ చాబ్రాను పంజాబ్‌ రాష్ట్రంలోని భటిండాలో అదుపులోకి తీసుకున్నారు.

Aryan Singh: ఫాల్కన్‌ స్కామ్‌లో కంపెనీ సీవోవో అరెస్టు

  • పంజాబ్‌లోని భటిండాలో పట్టుకున్న సీఐడీ అధికారులు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : ఫాల్కన్‌ గ్రూప్‌ స్కామ్‌ కేసులో సీఐడీ అధికారులు మరొకరిని అరెస్ట్‌ చేశారు. కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో) ఆర్యన్‌ సింగ్‌ చాబ్రాను పంజాబ్‌ రాష్ట్రంలోని భటిండాలో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ.792 కోట్ల మోసానికి సంబంధించిన ఫాల్కన్‌ స్కామ్‌లో ఇప్పటి వరకు ఆర్యన్‌ సింగ్‌తోపాటు 9 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఫాల్కన్‌ ఇన్‌వాయి్‌స డిస్కౌంటింగ్‌ అప్లికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 7056 మంది డిపాజిట్‌దారుల నుంచి రూ.4,215 కోట్లు ఈ గ్రూపు వసూలు చేసింది. ఈ గ్రూపుపై ఆరోపణలు వస్తున్న క్రమంలో కొందరి డిపాజిట్లను కంపెనీ తిరిగి చెల్లించింది. 4,065 మంది డిపాజిట్‌దారులకు సంబంధించిన రూ.792 కోట్లను ఈ కంపెనీ యజమానులు సొంతానికి వాడుకున్నారు.


ఫాల్కన్‌ గ్రూపుపై తెలంగాణలో 3, వివిధ రాష్ట్రాల్లో మరో 8 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కంపెనీ ఎండీ అమర్‌దీప్‌ కుమార్‌, అతని సోదరుడు, తండ్రి, భార్యను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో కేసు నమోదైన వెంటనే ఆర్యన్‌ సింగ్‌ కంపెనీ ఖాతాల నుంచి రూ.1,62,55,619 తన ఖాతాలకు మళ్లించుకున్నాడు. డిపాజిట్‌దారుల నుంచి సీవోవో హోదాలో ఆర్యన్‌ సింగ్‌ రూ.14.35 కోట్లు వసూలు చేశాడు. హైదరాబాద్‌ నుంచి బీదర్‌ పారిపోయిన ఆర్యన్‌ సింగ్‌ అక్కడి నుంచి భటిండా చేరుకుని ఓ గురుద్వారాలో ఆశ్రయం పొందాడు. పక్కా సమాచారంతో సీఐడీ బృందాలు ఆర్యన్‌ను అరెస్టు చేసి ట్రాన్సిట్‌ వారంట్‌పై ఆదివారం హైదరాబాద్‌ కు తీసుకువచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్టు సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jul 07 , 2025 | 01:53 AM