Bandi Sanjay: బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలుండవు
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:42 AM
బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉం డవని, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుంది
పదవుల కోసం పాకులాడబోం
మంత్రి పదవి నుంచి తప్పించాలని తాను
కోరినట్లు వచ్చిన వార్తలపై బండి సంజయ్
బీసీ రిజర్వేషన్లపై బీజేపీని బద్‌నాం
చేయడానికి రేవంత్ కుట్ర: రాంచందర్‌రావు
రాహుల్ మెప్పు కోసమే స్థాయికి మించి రేవంత్ మాటలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
చొప్పదండి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉం డవని, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలంటూ ఎన్నడూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తేబోమని తెలిపారు. బీజేపీ క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, అధిష్ఠానం ఏది చెబితే అది శిరసావహించి పని చేస్తామన్నారు.
తనను మంత్రి పదవి నుంచి విముక్తి చేయాలంటూ అడిగానని వచ్చిన వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించి మాట్లాడుతూ.. బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుందన్నారు. పదవుల కోసం తాము ఎప్పుడూ పాకులాడబోమని అన్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నానని అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సను చూసి బీజేపీ కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నారేమో, బీజేపీలో సమష్టి నిర్ణయాలుంటాయని వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా తమపై ఉంటుందని బండి సంజయ్ అన్నారు.