Share News

Heart Attack: వేతనాలు రాక మనోవేదన.. గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:11 AM

మూడు నెలలుగా వేతనాలు అందక మనోవేదనకు గురైన ఉపాధి హామీ పథకం ఏపీవో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగింది.

Heart Attack: వేతనాలు రాక మనోవేదన.. గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి

  • జనగామ జిల్లా పాలకుర్తిలో ఘటన

పాలకుర్తి, జూలై 7(ఆంధ్రజ్యోతి) : మూడు నెలలుగా వేతనాలు అందక మనోవేదనకు గురైన ఉపాధి హామీ పథకం ఏపీవో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగింది. పాలకుర్తికి చెందిన కమ్మగాని శ్రీనివాస్‌(45) దేవరుప్పుల మండల ఏపీవోగా రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అప్పటి నుంచి మనోవేదనకు గురయ్యారు. సోమవారం రోజులాగే జనగామ రోడ్డులో వాకింగ్‌కు వెళ్లిన ఆయనకు గుండెపోటు రావడంతో కుప్పకూలాడు.


స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని ఈజీఎస్‌ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు అంత్యక్రియలకు తీసుకెళ్లమని పట్టుబట్టారు. డీఆర్‌డీవో పీడీ వసంత వారికి నచ్చజెప్పి, శ్రీనివాస్‌ కుటుంబానికి ఆర్థికసాయం అందచేశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీవోల సంఘం అధ్యక్షుడు మోహన్‌రావు తదితరులు శ్రీనివాస్‌ మృతదేహానికి నివాళులర్పించారు.

Updated Date - Jul 08 , 2025 | 05:11 AM