Hyderabad Students Eat Junk Food: వారానికి మూడుసార్లు జంక్‌ఫుడ్
ABN , Publish Date - Nov 09 , 2025 | 03:00 AM
రోడ్ల పక్కన పానీపూరీ బండ్ల దగ్గర.. చాట్‌బండార్ల దగ్గర.. ఖరీదైన బహుళజాతి కంపెనీ ఫాస్ట్‌ఫుడ్ చెయిన్లలో.. ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపించేది యువతీయువకులే....
19-25 ఏళ్ల వయస్సున్న విద్యార్థుల్లో 46% మంది తీరు ఇదే..
జంక్‌ఫుడ్ తినేవారిలో అమ్మాయిలే ఎక్కువ
ఆరోగ్యానికి హానికరమని తెలిసినా తింటున్నారు
ఫాస్ట్‌ఫుడ్‌పై వారానికి రూ.300లకు పైగా ఖర్చు
హైదరాబాద్ విద్యార్థులపై అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రోడ్ల పక్కన పానీపూరీ బండ్ల దగ్గర.. చాట్‌బండార్ల దగ్గర.. ఖరీదైన బహుళజాతి కంపెనీ ఫాస్ట్‌ఫుడ్ చెయిన్లలో.. ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపించేది యువతీయువకులే! పానీపూరీ, దహిపూరీ, సమోసా చాట్, వడాపావ్, పావ్‌భాజి, బర్గర్, పిజ్జా వంటివి తింటూ.. శీతలపానీయాలు తాగుతూ కాలక్షేపం చేస్తుంటారు!! ఇలా జంక్‌ఫుడ్ తినడానికి హైదరాబాద్‌లోని కాలేజీ విద్యార్ధులు బాగా అలవాటుపడిపోయారని ఈఎ్‌సఐసీ మెడికల్ కాలేజీలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం చేసిన అధ్యయనంలో తేలింది. ఈ స్టడీలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది.. వారంలో కనీసం మూడుసార్లయినా ఈ తరహా తిండి తింటున్నట్టు తెలిపారు. జంక్‌ఫుడ్ తింటున్న వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ స్టడీలో భాగంగా హైదరాబాద్‌లోని 409 మంది విద్యార్థులను ప్రశ్నించారు. వారంతా 18-25 ఏళ్ల వయసువారే. వారిలో 67ు మంది అమ్మాయిలు కాగా.. 33ు మంది అబ్బాయిలున్నారు. వారంతా.. ఇంజనీరింగ్, వైద్యవిద్య, దాని అనుబంధ విద్యలు చదువుతున్నవారే. స్టడీలో భాగంగా వారికి ఒక ప్రశ్నావళి ఇచ్చారు. కొంత సమయమిచ్చి, వారి అభిప్రాయాన్ని సేకరించారు. అందులో వారానికి ఎన్నిసార్లు బయట జంక్‌పుడ్ తింటున్నారు? ఎక్కడ తింటున్నారు? ఏమేమి తింటున్నారు? ఎవరితో కలసి తింటున్నారు? ఏ సమయంలో తింటారు? లాంటి ప్రశ్నలడిగి, సమాచారాన్ని సేకరించారు. సేకరించిన డేటాను విశ్లేషించారు. కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే జంక్ ఫుడ్ తరచుగా తినడం వల్ల ఊబకాయంతోపాటు అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే ముప్పు ఎక్కువ. ఆరోగ్యంపై జంక్ ఫుడ్ చూపే ఈ దుష్ప్రభావాల గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ.. మహిళా విద్యార్ధులు ఆ తరహా ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారని అధ్యయనంలో తేలింది.
ఆందోళన కలిగించేలా..
ఈ అధ్యయనంలో వెల్లడైన కీలక అంశాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. అవేంటంటే..
స్టడీలో పాల్గొన్న వారిలో దాదాపు 190 మంది (46.4ు) విద్యార్థులు వారానికి 3 రోజుల కంటే ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నారు. ఇలా తింటున్న వారిలో మహిళా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు.
ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నామని చెప్పినవారు 134 మంది (33ు) కాగా.. స్వీట్లు తింటామని 36 మంది (9ు), ఉప్పుతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతామని 30 మంది (7ు), శీతల పానీయాలంటే ఇష్టమని 20 మంది (5ు), బహుళ ఆహార పదార్థాలు (మల్టీపుల్ ఫుడ్ ఐటెమ్స్) తింటామని 189 మంది (46ు) తెలిపారు.
స్నేహితులతో కలిసి జంక్ ఫుడ్ ఎక్కువగా తింటామని 124 మంది (30ు) తెలిపారు. దీనినిబట్టి.. యువత ఆహారపుటలవాట్లపై సామాజిక ప్రభావం ఎక్కువగా ఉందని భావించవచ్చు.
సర్వేలో పాల్గొన్న వారిలో 391 మందికి (96శాతం) జంక్ ఫుడ్ వల్ల కలిగే హానికరమైన పర్యవసానాలపై పూర్థిస్థాయిలో అవగాహన ఉంది. తింటే అనారోగ్యం పాలవుతామని తెలిసీ వారు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆ స్టడీ పేర్కొంది.
సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది జంక్‌ఫుడ్ కోసం వారానికి కనీసం రూ.300 ఖర్చుపెడుతున్నారని వెల్లడైంది. మరో 25 శాతం మంది రూ.300-500 మధ్య ఖర్చుపెడుతుండగా, 7.8 శాతం మంది రూ.500-1000 మధ్య, మరో 6.8 శాతం మంది వెయ్యి రూపాయలకు మించి వ్యయం చేస్తున్నట్లు ఆ స్టడీ పేర్కొంది.
వారానికి కనీసం ఒకటి రెండు సార్లు ఏదో ఒక పండు తింటున్న వారు 54 శాతం మంది ఉండగా, మరో 24 శాతం మంది మూడు నాలుగు సార్లు, 12 శాతం మంది ఐదారుసార్లు తింటున్నట్లు తేలింది.
వారంలో కూరగాయలు 1-2 రోజులే తింటున్నవారు 11ు ఉండగా, 3-4సార్లు తినేవారు 31ు, ఐదారుసార్లు తినేవారు 33 శాతం, ఏడుసార్లకు మించి తినేవారు 25 శాతం మంది ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
ఎక్కడ తింటున్నారంటే...
జంక్‌ఫుడ్‌ను వినియోగించేవారిలో 41.8 శాతం మంది ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తినేస్తున్నారు. మరో 20 శాతం మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ దగ్గర.. ఇంకో 15 శాతం మంది రెస్టారెంట్లలో.. మరో 11 శాతం కాలేజీల్లో లాగించేస్తున్నారు. మిగతావాళ్లు ఇంటివద్దనే తింటున్నట్లు స్టడీలో తేలింది.
ఫ్రెండ్స్‌తో కలసి తినేవారు 31 శాతం మంది ఉండగా, ఒంటరిగా 5 శాతం మంది, తల్లిదండ్రులతో కలసి 10.3 శాతం మంది.. చదువుతూ ఒక శాతం, ట్రావెల్ చేస్తూ మరొక శాతం మంది జంక్‌ఫుడ్ లాగిస్తున్నారు. మరో 53.5 శాతం మంది.. ఫ్రెండ్స్, పేరెంట్స్, ఇతరులతో కలసి తింటున్నట్లు తెలిపారు.
స్టడీలో పాల్గొన్నవారిలో ఊబకాయంతో బాధపడుతున్నవారిలో 45ు మంది అబ్బాయిలు ఉండగా.. 55ు మంది అమ్మాయిలున్నారు. మహిళా విద్యార్థుల్లో జంక్‌ఫుడ్ వినియోగం అధికంగా ఉండటమే ఇందుకు కారణం.
జంక్‌ఫుడ్‌తో అనేక అనారోగ్య సమస్యలు
జంక్‌ఫుడ్‌లో ఉప్పు, ట్రాన్స్‌ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఎక్కువ రుచిగా ఉండడంతోపాటు.. ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా వెంటనే ఇంటికే వచ్చేస్తున్నాయి. అలాగే కాలేజీలు, స్కూల్స్‌లో మరింత అందుబాటులో ఉంటున్నాయి. జంక్‌ఫుడ్‌ను స్టోర్ చేయడం కూడా చాలా తేలిక. అందుకే జంక్‌ఫుడ్ వినియోగం బాగా పెరుగుతోంది. కానీ.. ఈ తరహా తిండిని ఎక్కువగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలొస్తాయి. ముఖ్యంగా ఊబకాయం రావడం ఖాయం. అలాగే బీపీ, షుగర్‌తో పాటు అమ్మాయిల్లో పీసీవోడీ లాంటి సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత మేరకు వీటికి దూరంగా ఉంటే మంచిది.
- డాక్టర్ ఎంవీ రావు, కన్సల్టెంట్ ఫిజిషియన్, యశోద ఆస్పత్రి, హైదరాబాద్