Battle of Karregutta Hills: చరిత్రలో అతి పెద్ద ఆపరేషన్.. 1000 మంది మావోయిస్టుల కోసం 24 వేల మంది జవాన్స్..
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:16 PM
Battle of Karregutta Hills: ఈ కాల్పుల్లో ఏప్రిల్ 24వ తేదీన ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారు. వారి బాడీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముగ్గురి కంటే ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని తెలుస్తోంది.

మార్చి 31, 2026లోగా దేశంలో మావోయిజాన్ని లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా బలంగా అడుగులు ముందుకు సాగుతున్నాయి. మావోయిస్టుల పతనమే లక్ష్యంగా జవాన్లు అరణ్యంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తెలంగాణ- ఛత్తీష్‌ఘర్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 24 వేల మంది జవాన్లు కర్రెగుట్టను చుట్టుముట్టారు. 800 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తం జవాన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. గుట్టలో తలదాచుకున్న 1000 మంది మావోయిస్టుల కోసం జవాన్లు వెతుకుతున్నారు.
లోంగిపోవాలని.. లేకపోతే ముప్పు తప్పదని గుట్టలో దాక్కున్న మావోయిస్టులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. జవాన్లు కర్రెగుట్టలోని పలు మావోయిస్టుల స్థావరాలను కనిపెట్టారు. గత వారం రోజుల నుంచి మావోయిస్టులు, జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఏప్రిల్ 24వ తేదీన ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారు. వారి బాడీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముగ్గురి కంటే ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని తెలుస్తోంది. భద్రతా దళాలు అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించి ముందుకు సాగుతున్నారు. మావోయిస్టులు, నక్సల్స్ ఉచ్చుల నుంచి తప్పించుకుని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ( DKSZC), తెలంగాణ స్టేట్ కమిటి(TSC), ది పీపుల్స్ లిబరేషన్ గోరిల్లా ఆర్మీ (PLGA), బెటాలియన్ నెంబర్ వన్‌తో పాటు మిగిలిన మావోయిస్టుల గ్రూపుల్ని తుదముట్టించడమే లక్ష్యంగా ఈ సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. 800 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఏరియా మొత్తం మావోయిస్టు ఫ్రీ జోన్ అయ్యే వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగనుంది. ఈ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఐఈడీ పేలుళ్లు సంభవించటంతో వారికి గాయాలు అయ్యాయి. డీ హైడ్రేషన్ కారణంగా మరో ఆరుగురు జవాన్లు ఆస్పత్రి పాలయ్యారు. మావోయిస్టు కదలికలను గుర్తించేందుకు డ్రోన్లు సైతం రంగంలోకి దిగాయి.
ఇవి కూడా చదవండి
Restaurant Fire: రెస్టారెంట్లో భారీ అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి..
The Family Man: ఫ్యామిలీ మ్యాన్ నటుడి అనుమానాస్పద మృతి