WhatsApp to Arattai Messaging: కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్.. ఇక నేరుగా అరట్టై అకౌంట్‌కు మెసేజ్ చేసేయొచ్చు!
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:30 PM
ఇతర మేసేజింగ్ యాప్‌లకు నేరుగా సందేశాలు పంపించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఐరోపాలో పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మేసేజింగ్ యాప్స్ విషయంలో కూడా యూపీఐ తరువాత క్రాస్ ప్లాట్‌ఫామ్ సౌలభ్యం దక్కుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ యూజర్లు నేరుగా అరట్టై యూజర్లకు మెసేజ్ చేయొచ్చా? అంటే కుదరదనే చెబుతాము. కానీ ఇకపై పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. ఇతర ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వినియోగదారులకు వాట్సాప్ యూజర్లు నేరుగా సందేశాలు పంపించేలా సంస్థ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది (WhatsApp Cross App Messaging).
WaBetaInfo సైట్ కథనాల ప్రకారం, వాట్సాప్ ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను ఐరోపాలో టెస్టు చేస్తోంది. అక్కడి బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఒక మెసేజింగ్ యాప్ యూజర్.. ఇతర యాప్ యూజర్లకు నేరుగా సందేశాలు పంపించొచ్చు. యాప్ మార్చాల్సిన అవసరమే ఉండదు. అంటే.. వాట్సాప్ అకౌంట్ నుంచి నేరుగా అరట్టై అకౌంట్‌కు సందేశం పంపే అవకాశం చిక్కుతుందన్న మాట (Messaging Protocol Standardization).
వాస్తవానికి, ఇలాంటి ఫీచర్ ప్రవేశపెట్టాలని అరట్టై మాతృసంస్థ జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఇటీవలే ప్రతిపాదించారు. యూపీఐ తరహాలోనే ఇన్‌స్టంట్ మెసేజింగ్‌కు సంబంధించి ఉమ్మడి ప్రొటోకాల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూపీఐ, ఈమెయిల్స్ వలెనే ఎవరు ఎవరికైనా మేసేజ్ చేసే అవకాశం ఉండాలని అన్నారు. ప్రస్తుత ఇన్‌స్టంట్ మెసేజ్ యాప్స్ లాగా పరిమితులు ఉండకూడదని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. గుత్తాధిపత్య ధోరణులు తగవని హితవు పలికారు. యూపీఐ ప్రామాణిక ప్రొటోకాల్‌పై కృషి చేసిన శరద్ శర్మతో ఈ అంశంపై చర్చలు కూడా ప్రారంభించినట్టు చెప్పారు (Monopoly).
ఐరోపాలో కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాల కారణంగానే వాట్సాప్.. ఈ ఇంటర్ ఆపరబులిటీ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిందని టెక్ రంగ నిపుణులు చెబుతున్నారు. బడా టెక్ సంస్థల గుత్తాధిపత్య ధోరణులకు చెక్ పెట్టేందుకు ఐరోపా సమాఖ్యలో డిజిటల్ మార్కెట్ యాక్ట్‌ను (Digital Market Act) ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం, వాట్సాప్ లాంటి మెసేజింగ్ వేదికలు.. ఇతర యాప్‌లకు నేరుగా మేసేజ్ చేసే ఫీచర్‌ను వినియోగదారులకు అందించాలి. అయితే, ఈ సౌలభ్యం ప్రస్తుతం బర్డీచాట్ అనే ఒకే ఒక థర్డ్ పార్టీ యాప్‌కు మాత్రమే పరిమితమైంది. ఈ ఫీచర్ తమ వినియోగదారులకు కావాలనుకునే యాప్స్.. వాట్సాప్‌కు రిక్వస్ట్ పెట్టాల్సి ఉంటుందట. అంతేకాకుండా వాట్సాప్ తరహాలో మేసేజీలకు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం కూడా కల్పించాలి. ఇక ఈ ఫీచర్‌ను ఇతర దేశాలకు విస్తరించడంపై వాట్సాప్ ఇంతవరకూ ఎలాంటి కామెంట్ చేయలేదు.
ఇవి కూడా చదవండి
ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే
సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధం విధించాలి: ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ డిమాండ్
Read Latest and Technology News