WhatsApp: అలర్ట్.. ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో రేపటి నుంచి వాట్సాప్ బంద్
ABN , Publish Date - May 31 , 2025 | 12:26 PM
రేపటి నుంచి కొన్ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌లల్లో వాట్సాప్ నిలిచిపోతుంది. మరి ఆ ఫోన్‌లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 1 నుంచి వాట్సాప్ కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో పని చేయదు. ఈ మేరకు మెటా ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి మేలోనే వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్లలో నిలిచిపోవాల్సి ఉన్నా వినియోగదారులకు తగినంత సమయం ఇచ్చేందుకు సంస్థ నెల పాటు అదనపు గడువు ఇచ్చింది. వినియోగదారుల భద్రత కోసం మెటా ఈ నిర్ణయం తీసుకుంది.
మెటా ప్రకటన ప్రకారం, జూన్ 1 నుంచి ఐఓఎస్ 15 లేదా అంతకు మునుపటి ఓఎస్ వర్షన్‌లు ఉన్న ఐఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు. ఇక ఆండ్రాయిడ్ 5.0, దాని పూర్వపు వర్షన్‌లో కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. అంటే.. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 6s, ఐఫోన్ 6s ప్లస్, ఐఫోన్ ఎస్‌ఈ (1వ తరం), శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4, శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3, సోనీ ఎక్స్‌పీరియా జెడ్1, ఎల్‌జీ జీ2 హువావే అసెండ్ పీ6, మోటో G (1వ తరం), మోటరోలా రేజర్ హెచ్‌డీ, మోటో E (2014) ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.
ఇప్పటికే యాపిల్.. పాత ఓఎస్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్టును నిలిపివేసింది. దీంతో, ఈ ఓఎస్‌లు ఉన్న ఫోన్‌లకు సైబర్ దాడుల ముప్పు పెరిగింది. క్రమం తప్పకుండా సెక్యూరిటీ అప్‌డేట్స్ అందని పక్షంలో వినియగదారులకు సైబర్ ముప్పు అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం కలుగుతుంది. దీంతో, వినియోగదారులు పాత ఫోన్లను వదిలించుకుని అప్‌డేటెడ్ వర్షన్లకు మళ్లాలని వాట్సాప్ సూచిస్తోంది.
మరి పాత ఫోన్‌లను పారేయాల్సిందేనా? అంతే తొందరపాటు వద్దని నిపుణులు చెబుతున్నారు. మొదట ఫోన్ అప్‌డేటెడ్‌గా ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పటికీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తున్నట్టైతే ఐఓఎస్ 15.1, యాండ్రాయిడ్ 5.1 ఓఎస్‌లకు అప్‌డేట్ అయ్యాక వాట్సాప్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. ఇక కొత్త ఫోన్‌ను మారకతప్పదనుకుంటే ముందుగా వాట్సాప్ చాట్ హిస్టరీని గూగుల్ అకౌంట్‌లో అప్‌డేట్ చేసుకోవాలి. కొత్త ఫోన్ తీసుకున్నాక వాట్సాప్‌లో చాట్ హిస్టరీని అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. ఈ ఏడాదే విడుదల కానుందా
విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే..
Read Latest and Technology News