Amazon Open Letter: ఏఐతో ముప్పు.. అమెజాన్ సీఈఓకు ఉద్యోగుల బహిరంగ లేఖ
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:12 PM
అమెజాన్‌లో ఏఐ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంపై సంస్థ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంస్థ సీఈఓకు బహిరంగ లేఖ రాశారు. ఏఐతో ప్రజాస్వామ్యానికే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐని విస్తృత వినియోగంలోకి తెస్తున్న అమెజాన్‌పై సంస్థ ఉద్యోగులు మండిపడుతున్నారు. కంపెనీ వెంటనే తన తీరును మార్చుకోవాలంటూ సీఈఓ ఆండీ జెస్సీకి బహిరంగ లేఖ రాశారు. అమెజాన్‌కు చెందిన వెయ్యికిపైగా ఉద్యోగులు ఈ లేఖపై సంతకం చేశారు (Amazon Employees' Open Letter to CEO).
ఏఐ వినియోగం విషయంలో కంపెనీ కాస్త దూకుడు తగ్గించాలని ఉద్యోగులు తమ లేఖలో అభిప్రాయపడ్డారు. ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోందని అన్నారు. ఎంతో మంది ఉద్యోగాలకు కూడా ముప్పు పొంచి ఉందని తెలిపారు. చివరకు ఏఐతో ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెజాన్ ఎంప్లాయీస్ ఫర్ క్లైమెట్ జస్టీస్ పేరిట ఉద్యోగులు ఈ లేఖ రాశారు. ఏఐ సాధనాల వినియోగం, డాటా సెంటర్ల ఏర్పాటుకు 150 బిలియన్ డాలర్ల వెచ్చించేందుకు అమెజాన్ సంస్థ సిద్ధమైన నేపథ్యంలో ఉద్యోగుల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది (AI Impact).
లాభాలు, సృజనాత్మకత వెంట అమెజాన్ తీస్తున్న పరుగుల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య ధోరణులు పెరుగుతున్నాయని అన్నారు. పోటీలో పైచేయి సాధించే క్రమంలో నైతికత, భద్రతల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అన్నారు. అమెజాన్ ఏఐ కార్యకలాపాల కారణంగా కర్బన ఉద్గారాల విడుదల 2019 నాటితో పోలిస్తే 35 శాతం పెరిగిందని అన్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ఉద్యోగులపై పనిభారం పెరిగిందని అన్నారు. డెడ్‌లైన్స్ ఎక్కువడం, ఆటోమేషన్‌తో జరుగుతున్న అసమర్థ కార్యకాలాపాలు ఉద్యోగంపై భారం పెంచుతున్నాయని అన్నారు. ఏఐ దుర్వినియోగమయ్యే అంశంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
అమెజాన్ ముందు ఉద్యోగులు పలు డిమాండ్స్‌ను పెట్టారు. పర్యావరణహిత ఇంధనాలతో నడిచే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ వినియోగానికి సంబంధించి నైతికతను కాపాడేందుకు ఉద్యోగుల సలహాలు తీసుకోవాలని సూచించారు. హింసాత్మక కార్యకలాపాలకు ఏఐ వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతమున్న ఈ జాబ్స్‌కు ఏఐతో ముప్పు.. ఎమ్ఐటీ అధ్యయనంలో వెల్లడి
మా టీమ్‌కు రెస్టు కావాలి.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్
Read Latest and Technology News