India defeated South Africa: అవలీలగా ఆడేశారు
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:20 AM
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సలో టీమిండియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో....
బౌలర్ల విజృంభణ.. అభిషేక్ జోరు
మూడో టీ20లో దక్షిణాఫ్రికా చిత్తు
ధర్మశాల: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సలో టీమిండియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో బౌలర్లు విశేషంగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సిరీ్‌సలో 2-1తో ముందంజ వేసింది. నాలుగో టీ20 బుధవారం లఖ్‌నవూలో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మార్‌క్రమ్ (46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) అర్ధసెంచరీ సాధించగా.. ఫెరీరా (20), నోకియా (12) రెండంకెల స్కోర్లు సాధించిన మరో ఇద్దరు ఆటగాళ్లు. ఆ తర్వాత ఛేదనలో భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి నెగ్గింది. అభిషేక్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35), గిల్ (28), తిలక్ (25 నాటౌట్) రాణించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అర్ష్‌దీప్ (2/13) నిలిచాడు. మరోవైపు పేసర్ బుమ్రా వ్యక్తిగత కారణాలరీత్యా ముంబైకి వెళ్లగా, స్పిన్నర్ అక్షర్ అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. వీరి స్థానాల్లో హర్షిత్, కుల్దీప్ భారత జట్టులోకి వచ్చారు.
ఓపెనర్ల జోరు: స్వల్ప ఛేదన.. పైగా మంచు ప్రభావం. దీంతో భారత ఓపెనర్లు కసిదీరా బంతిని బాదేస్తూ చకచకా లక్ష్యాన్ని కరిగించారు. మధ్య ఓవర్లలో సఫారీ బౌలర్లు ప్రభావం చూపినా ఫలితం లేకపోయింది. తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన అభిషేక్ తన ఉద్దేశాన్ని చాటగా.. అటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన గిల్ సైతం ధాటిని కనబర్చాడు. అయితే ఖాతా తెరువకముందే అతడిని అంపైర్ ఎల్బీగా ప్రకటించగా.. రివ్యూ కోరి బతికిపోయాడు. యాన్సెన్ వేసిన బంతి ముందుగా బ్యాట్‌కు టచ్ అయినట్టు తేలింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటూ ఆ తర్వాత బౌండరీలతో చెలరేగాడు. అటు అభిషేక్ ప్రతీ బంతిని బాదడమే లక్ష్యంగా దూసుకెళ్లాడు. అయితే ఆరో ఓవర్‌లో అతడి క్యాచ్‌ను కవర్స్ నుంచి వెనక్కి పరిగెడుతూ మార్‌క్రమ్ అద్భుతంగా పట్టేశాడు. దీంతో తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వచ్చీ రావడంతోనే తిలక్ రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 68/1 స్కోరుతో నిలిచింది. అయితే ఆ తర్వాత సఫారీ బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు నెమ్మదించాయి. షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడిన గిల్‌ను 12వ ఓవర్‌లో యాన్సెన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక కెప్టెన్ సూర్య (12) రెండు వరుస ఫోర్లతో ఊపు చూపినా మరో భారీ షాట్‌కు వెళ్లి బార్ట్‌మన్‌కు దొరికిపోయాడు. అప్పటికి 32 బంతుల్లో 9 రన్స్ కావాల్సి ఉండడంతో దూబే (10 నాటౌట్) 6,4తో మరో 25 బంతులుండగానే భారత్ మ్యాచ్‌ను ముగించింది.
వికెట్లు టపటపా: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు తొలి ఓవర్ నుంచే కష్టాలు ఆరంభమయ్యాయి. కొత్త బంతితో ఇరువైపులా స్వింగ్‌ను రాబట్టిన పేసర్లు అర్ష్‌దీప్, హర్షిత్ అదరగొట్టారు. అటు స్పిన్నర్లు సైతం విశేషంగా రాణించడంతో 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే కెప్టెన్ మార్‌క్రమ్ ఒక్కడే నిలబడి కాస్త పరువు కాపాడాడు. కానీ మరో ఎండ్‌లో సఫారీ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఓపెనర్ హెన్‌డ్రిక్స్ (0)ను తొలి ఓవర్‌లోనే పేసర్ అర్ష్‌దీప్ అవుట్ చేశాడు. ఇక హర్షిత్ తన వరుస ఓవర్లలో మరో ఓపెనర్ డికాక్ (1), బ్రెవిస్ (2)ను అవుట్ చేయడంతో 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు మార్‌క్రమ్ ఓపిగ్గా క్రీజులో నిలిచి బౌలర్లను ఎదుర్కొంటున్నా అతడికి సహకారమే కరువైంది. నాలుగో వికెట్‌కు 23 పరుగులు జత చేశాక స్టబ్స్ (9) వెనుదిరిగాడు. ఆ తర్వాత బాష్ (4) కూడా నిరాశపర్చగా.. ఫెరీరా కాసేపు మార్‌క్రమ్‌కు అండగా నిలిచాడు. ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో ఆకట్టుకున్న తనను వరుణ్ బౌల్డ్ చేయడంతో ఆరో వికెట్‌కు 25 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తన తర్వాతి ఓవర్‌లోనే యాన్సెన్ (2)ను కూడా వరుణ్ బౌల్డ్ చేశాడు. చివర్లో జోరు పెంచిన మార్‌క్రమ్ 4,6,6తో 18వ ఓవర్‌లో 19 పరుగులతో జట్టు స్కోరును వంద దాటించాడు. అలాగే 41 బంతుల్లో తన ఫిఫ్టీని కూడా పూర్తి చేశాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే మార్‌క్రమ్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేయడంతో ఆ కాస్త జోష్ కూడా ముగిసినట్టయ్యింది. చివరి ఓవర్‌లో స్పిన్నర్ కుల్దీప్ రెండు వికెట్లతో ప్రత్యర్థిని ఆలౌట్ చేశాడు.
పురుషుల టీ20ల్లో 1000+ రన్స్‌తో పాటు 100 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా హార్దిక్ పాండ్యా. ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్. ఇక భారత్ నుంచి అర్ష్‌దీప్, బుమ్రా ఇప్పటికే వంద వికెట్లు తీసిన వారిలో ఉన్నారు.
1 పురుషుల టీ20ల్లో 1000+ రన్స్‌తో పాటు 100 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా హార్దిక్ పాండ్యా. ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్. ఇక భారత్ నుంచి అర్ష్‌దీప్, బుమ్రా ఇప్పటికే వంద వికెట్లు తీసిన వారిలో ఉన్నారు.
2 తక్కువ ఇన్నింగ్స్ (32)లోనే 50 టీ20 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా వరుణ్. కుల్దీప్ (30) టాప్‌లో ఉన్నాడు.