Share News

South Africa: చరిత్రకు చేరువలో..

ABN , Publish Date - Jun 14 , 2025 | 06:32 AM

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో దక్షిణాఫ్రికా అద్భుతంగా కోలుకుంది. రెండు రోజులపాటు బౌలర్లు ఆధిపత్యం చూపిన చోట.. ఆ జట్టు బ్యాటర్లు చరిత్రను సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

South Africa: చరిత్రకు చేరువలో..

  • దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ 213/2

  • మార్‌క్రమ్‌ అజేయ శతకం

  • ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 207 ఆలౌట్‌

  • రబాడకు నాలుగు వికెట్లు

  • విజయానికి 69 పరుగుల దూరంలో సఫారీలు

లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో దక్షిణాఫ్రికా అద్భుతంగా కోలుకుంది. రెండు రోజులపాటు బౌలర్లు ఆధిపత్యం చూపిన చోట.. ఆ జట్టు బ్యాటర్లు చరిత్రను సృష్టించేందుకు సిద్ధమయ్యారు. 282 పరుగుల కష్టసాధ్యమైన ఛేదన కోసం బరిలోకి దిగిన సఫారీలకు ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (159 బంతుల్లో 11 ఫోర్లతో 102 బ్యాటింగ్‌) అజేయ శతకం, కెప్టెన్‌ బవుమా (121 బంతుల్లో 5 ఫోర్లతో 65 బ్యాటింగ్‌) నిలకడైన ఆటతీరుతో అండగా నిలిచారు. దీంతో ఇన్నాళ్లూ తమకందకుండా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్‌కు ఆ జట్టు కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 213/2 స్కోరుతో ఉంది. క్రీజులో ఉన్న మార్‌క్రమ్‌, బవుమా మూడో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జత చేయగా.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శనివారం వీరి చరిత్రాత్మక విజయం ఖాయంలా కనిపిస్తోంది. స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్‌ (58 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీ సాధించాడు. రబాడకు నాలుగు, ఎన్‌గిడికి మూడు వికెట్లు దక్కాయి. మరోవైపు ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి ఆడారు.


స్టార్క్‌ అండగా పోరాటం: ఓవర్‌నైట్‌ స్కోరు 144/8తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ మరో 63 పరుగులు జోడించింది. లియోన్‌ (2)ను ఆరంభంలోనే రబాడ ఎల్బీ చేయగా.. ఆఖరి వికెట్‌కు హాజెల్‌వుడ్‌తో కలిసి స్టార్క్‌ అద్భుతంగా పోరాడాడు. ఇద్దరూ ఓపిగ్గా ఆడి సఫారీ బౌలర్లను విసిగించారు. ఈ జోడీ 22.2 ఓవర్లు ఆడగా.. ఈ క్రమంలో స్టార్క్‌ హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేశాడు. ఎట్టకేలకు 65వ ఓవర్‌లో హాజెల్‌వుడ్‌ను మార్‌క్రమ్‌ అవుట్‌ చేయడంతో పదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

శతక భాగస్వామ్యంతో..: రెండో సెషన్‌లో 282 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు పరిస్థితులు కూడా చక్కగా అనుకూలించాయి. తొలి రెండు రోజుల మాదిరి కాకుండా ఎండ కాయడంతో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. కొత్తబంతి చక్కగా స్వింగ్‌ అవుతున్నప్పటికీ బ్యాటర్లు దీటుగా ఎదుర్కొ న్నారు. ఓపెనర్‌ రికెల్టన్‌ (6) మూడో ఓవర్‌లో వెనుదిరిగినా మార్‌క్రమ్‌ జట్టుకు అండగా నిలిచాడు. ముల్డర్‌ (27)తో కలిసి రెండో వికెట్‌కు 61 రన్స్‌ జోడించాడు. అనంతరం అతడికి బవుమా జత కలవడంతో ఆసీస్‌ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. రిస్కీషాట్లకు వెళ్లకుండా జాగ్రత్తగా ఆడేస్తూ మార్‌క్రమ్‌ సెంచరీతో, బవుమా హాఫ్‌ సెంచరీలతో ఆఖరి సెషన్‌ను వికెట్‌ కోల్పోకుండా ముగించారు.


సంక్షిప్త స్కోర్లు

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 212 ఆలౌట్‌.

  • దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 138 ఆలౌట్‌.

  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 207 ఆలౌట్‌ (స్టార్క్‌ 58 నాటౌట్‌, క్యారీ 43, లబుషేన్‌ 22; ఎన్‌గిడి 3/38, రబాడ 4/59).

  • దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 213/2 (మార్‌క్రమ్‌ 102 బ్యాటింగ్‌, బవుమా 65 బ్యాటింగ్‌; స్టార్క్‌ 2/53).

  • టెస్టుల్లో 9, అంతకంటే దిగువ బ్యాటర్‌గా వచ్చి ఎక్కువ హాఫ్‌ సెంచరీ (9)లు సాధించిన బ్యాటర్‌గా స్టార్క్‌.

  • టెస్టు చరిత్రలో ఆఖరి వికెట్‌కు మూడుసార్లు 50+ పరుగుల భాగస్వామ్యం అందించిన రెండో జోడీగా స్టార్క్‌-హాజెల్‌వుడ్‌. గతంలో వాట్లింగ్‌-బౌల్ట్‌ (కివీస్‌) ఉన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 06:41 AM