Share News

U 19 India Crush Pakistan: పాక్‌ను చిత్తుచేశారు..

ABN , Publish Date - Dec 15 , 2025 | 03:11 AM

భారత బౌలర్లు దీపేష్‌ దేవేంద్రన్‌ (3/16), కనిష్క్‌ చౌహాన్‌ (3/33) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను యువ భారత్‌ మట్టికరిపించింది....

U 19 India Crush Pakistan: పాక్‌ను చిత్తుచేశారు..

  • యువ భారత్‌ ఘన విజయం

  • దీపేష్‌, కనిష్క్‌ విజృంభణ

దుబాయ్‌: భారత బౌలర్లు దీపేష్‌ దేవేంద్రన్‌ (3/16), కనిష్క్‌ చౌహాన్‌ (3/33) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను యువ భారత్‌ మట్టికరిపించింది. అండర్‌-19 ఆసియాకప్‌ గ్రూప్‌-ఎలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 90 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసి, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. భారత్‌, పాక్‌ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో కూడా పరస్పరం కరచాలనం చేసుకోలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. తొలుత భారత్‌ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్‌ జార్జ్‌ (85) అర్ధ శతకం నమోదు చేయగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కనిష్క్‌ (46) బ్యాట్‌తోనూ రాణించాడు. మహ్మద్‌ సయ్యమ్‌, అబ్దుల్‌ సుభాన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పాక్‌ 41.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. హుజైఫా ఎహ్‌సాన్‌ (70) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కిషన్‌ సింగ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

నిరాశపర్చిన వైభవ్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే గట్టిదెబ్బ తగింది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (5)ని సయ్యమ్‌ రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. అయితే, కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (38), ఆరోన్‌ రెండో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఆయుష్‌ను సయ్యమ్‌ అవుట్‌ చేయగా.. విహాన్‌ మల్షోత్రా (12), వేదాంత్‌ త్రివేది (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. కానీ, అభిజ్ఞాన్‌ కుందూ (22)తో కలసి ఆరోన్‌ ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. కుండూ, ఆరోన్‌ను సుభాన్‌ అవుట్‌ చేసినా.. ఖిలన్‌ (6), హనిల్‌ (12) అండతో కనిష్క్‌ టీమ్‌కు పోరాడగలిగే స్కోరును అందించాడు.

Updated Date - Dec 15 , 2025 | 03:11 AM