Share News

Trisha : నమ్మకాన్ని నిలబెట్టా!

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:42 AM

వరల్డ్‌కప్‌ విజయంతో దేశం మొత్తం ఇప్పుడు ఈ తెలుగమ్మాయి పేరు మార్మోగుతోంది. ఆ మెగా టోర్నీలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో పాటు జట్టుకు అవసరమైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టి నమ్మదగ్గ ఆల్‌రౌండర్‌గా ముద్ర వేసుకుంది. ప్లాస్టిక్‌ బ్యాట్‌, టెన్నిస్‌ బాల్‌తో మొదలైన తన క్రికెట్‌ ప్రయాణం ఇప్పుడు జాతీయ జట్టులో కీలక సభ్యురాలి స్థాయికి ఎదిగింది.

Trisha : నమ్మకాన్ని నిలబెట్టా!

అండర్‌-19 వరల్డ్‌కప్‌ స్టార్‌ త్రిష

గొంగడి త్రిషా రెడ్డి.. ఐసీసీ అండర్‌-19

వరల్డ్‌కప్‌ విజయంతో దేశం మొత్తం ఇప్పుడు ఈ తెలుగమ్మాయి పేరు మార్మోగుతోంది. ఆ మెగా టోర్నీలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో పాటు జట్టుకు అవసరమైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టి నమ్మదగ్గ ఆల్‌రౌండర్‌గా ముద్ర వేసుకుంది. ప్లాస్టిక్‌ బ్యాట్‌, టెన్నిస్‌ బాల్‌తో మొదలైన తన క్రికెట్‌ ప్రయాణం ఇప్పుడు జాతీయ జట్టులో కీలక సభ్యురాలి స్థాయికి ఎదిగింది. ఏడాది కిందటే మొదలైన మిషన్‌ వరల్డ్‌క్‌పను విజయవంతంగా ఎలా అమలు చేశారు? ఇందులో త్రిష పాత్ర ఏమిటి? తదితర అంశాలపై ఆంధ్రజ్యోతితో త్రిష పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

ఈ వరల్డ్‌కప్‌ మిషన్‌ను బీసీసీఐ నిరుడే ప్రారంభించింది. మెగా టోర్నీ ప్రాబబుల్స్‌ను కుదించాక మిగిలిన బృందంలోని ప్రతి ఒక్క క్రికెటర్‌తో సెలెక్టర్లు, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ విడివిడిగా మాట్లాడి మా నుంచి జట్టు ఏం ఆశిస్తోందో వివరంగా చెప్పారు. కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. వాటిని అందుకోవడానికి అనుసరించాల్సిన ప్రణాళికలను ముందుంచారు. వారి మాటలు విన్నాక ఈ ఏడాది కాలం నా జీవితంలో ఎంత ముఖ్యమైనదో అర్థమైంది. ఆ లక్ష్యాలను చేరుకునేందుకు మానసికంగా, శారీరకంగా, ఆట పరంగా నన్ను నేను మలుచుకున్నా. ఈ ప్రయాణంలో నాకు ఏ పనీ కష్టంగా అనిపించలేదు. సుదీర్ఘ కాలం టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలనేది నా ఆశయం. దీన్ని చేరుకోవాలంటే ఒక బలమైన పునాది వేసుకోవాలి. అందుకు ఈ వరల్డ్‌కప్‌ను సరైన వేదికగా భావించా. 2023 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో నేను సభ్యురాలినే అయినా నాకు అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈసారి వరల్డ్‌కప్‌ మొదలయ్యే ముందు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి నాకు ఈ విషయంలో ఒక స్పష్టమైన హామీ లభించింది. వారి నుంచి పూర్తి మద్దతు, స్వేచ్ఛ లభించడంతో నా పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశం చిక్కింది. అవకాశాలు రానప్పుడు పడిన బాధ, పుట్టిన కసితో ఈ వరల్డ్‌క్‌పలో నేనేంటో రుజువు చేసుకోగలిగా. టీమ్‌ మేనేజ్‌మెంట్‌, జట్టు నాపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టినందుకు, నాకు అప్పగించిన బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తించినందుకు సంతోషంగా ఉంది.


టెన్నిస్‌ బాల్‌తో పవర్‌ హిట్టింగ్‌..

బాల్యంలో ప్లాస్టిక్‌ బ్యాట్‌, టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడేదాణ్ణి. ఆ తర్వాత హిట్టింగ్‌ను అవపోసన పట్టడానికి నా వ్యక్తిగత కోచ్‌ సూచన మేరకు టెన్నిస్‌ బాల్‌తో ఎక్కువ సాధన చేశా. ఇది పవర్‌ హిట్టింగ్‌కు బాగా ఉపయోగపడింది. బౌలింగ్‌ యాక్షన్‌లో చేసుకున్న కొద్దిపాటి మార్పులు కూడా ఈ టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసేందుకు ఉపయోగపడింది.

మిథాలీ, ధోనీ నుంచి నేర్చుకున్నా

ఒత్తిడిలో బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తా. హైదరాబాద్‌ జట్టుకు ఆడుతున్నప్పట్నుంచే ఇది అలవర్చుకున్నా. నా ఆరాధ్య క్రికెటర్‌ మిథాలీ రాజ్‌పై ఉన్న అభిమానంతో ఆమె ఆటను నిశితంగా గమనించేదాన్ని. మైదానంలో మిథాలీ దృక్పథం మిగిలిన క్రికెటర్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అలానే ప్రత్యర్థులకు తగ్గట్టు మైదానంలో చురుగ్గా వ్యూహాలను మార్చే నైపుణ్యాలను ధోనీని చూసి నేర్చుకున్నా. ఈ ఇద్దరు క్రికెటర్లలోని ఈ రెండు అంశాలు నాపై తెలియని ప్రభావం చూపాయి. సాధ్యమైనంత త్వరగా పిచ్‌పై ఒక అంచనా వస్తే తర్వాత ఎలాంటి బౌలర్‌నైనా సులభంగా ఎదుర్కోవచ్చు అనేది నా నమ్మకం. ఆ విధంగానే ఆడడంతో ఈ టోర్నీలో నాకు ఏ బౌలర్‌ నుంచీ పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.

ఆ ఇద్దరి త్యాగాల వల్లే..

నా క్రికెట్‌ ప్రయాణంలో నాన్న (రామిరెడ్డి) కష్టం ఎంత ఉందో, అమ్మ (మాధవి) శ్రమ కూడా అంతే దాగి ఉంది. వారిద్దరి పట్టుదల, త్యాగాలతోనే ఈ స్థాయికి రాగలిగా. ఒక అమ్మాయి క్రీడల్లో ఈ స్థాయికి చేరిందంటే అందులో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైనది. నా కుటుంబసభ్యుల సహకారం, ప్రోత్సాహంతో మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తా.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)


ఇవీ చదవండి:

కెరీర్‌లో కొట్టిన సిక్సులు.. ఒకే మ్యాచ్‌లో బాదేశాడు

ఒక్క ఇన్నింగ్స్‌తో 8 క్రేజీ రికార్డులు.. అభిషేక్ అన్నింటా అసాధ్యుడే

అతడి కోసమే ఈ ఊచకోత.. సీక్రెట్ బయటపెట్టిన అభిషేక్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 05:21 AM