India Verses South Africa Test: స్పిన్నర్ల తడాఖా
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:36 AM
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లను వణికిస్తోంది. తొలిరోజు పేసర్లకు అనూహ్య బౌన్స్ లభించగా.. రెండోరోజైన శనివారం స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది. దీంతో ఒక్కరోజే ఇరుజట్ల నుంచి ఏకంగా 15 వికెట్లు నేలకూలాయి...
భారత్ తొలి ఇన్నింగ్స్ 189
హార్మర్‌కు నాలుగు వికెట్లు
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 93/7
తిప్పేసిన జడేజా, కుల్దీప్
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లను వణికిస్తోంది. తొలిరోజు పేసర్లకు అనూహ్య బౌన్స్ లభించగా.. రెండోరోజైన శనివారం స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది. దీంతో ఒక్కరోజే ఇరుజట్ల నుంచి ఏకంగా 15 వికెట్లు నేలకూలాయి. అటు మ్యాచ్ ఫలితం కూడా మూడోరోజే తేలడం ఖాయమైపోయింది. భారత బ్యాటింగ్ ఆర్డర్ విఫలమైనా.. వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (4/29) సుడులు తిరిగే బంతులతో సఫారీ బ్యాటర్ల వెన్ను విరిచాడు. దీంతో ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బవుమా (29), బాష్ (1) ఉన్నారు. స్పిన్నర్లు కుల్దీ్‌పయాదవ్‌కు 2, అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం పర్యాటక జట్టు 63 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. వీలైనంత వేగంగా మిగిలిన 3 వికెట్లను భారత్ పడగొట్టాలి. లేదంటే ఈ పిచ్‌పై 150 పరుగుల లక్ష్యం కూడా కష్టంగానే మారనుంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ 189 రన్స్ వద్ద ముగియడంతో.. 30 పరుగుల ఆధిక్యం దక్కింది. రాహుల్ (39), సుందర్ (29), పంత్ (27), జడేజా (27) ఫర్వాలేదనిపించారు. స్పిన్నర్ సిమోన్ హార్మర్‌కు 4, పేసర్ యాన్సెన్‌కు 3 వికెట్లు దక్కాయి.
హార్మర్ ధాటికి కుదేల్: ఓవర్‌నైట్ స్కోరు 37/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను సఫారీ స్పిన్నర్లు కుదురుకోనీయలేదు. మిడిలార్డర్‌ను హార్మర్ దెబ్బతీశాడు. అయితే తొలిగంట ఆటలో యాన్సెన్ పేస్, కేశవ్ స్పిన్‌ను రాహుల్, సుందర్ దీటుగానే ఎదుర్కొన్నారు. కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత హార్మర్ వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. ముందుగా సుందర్‌ను హార్మర్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే గిల్ మెడ నొప్పితో మైదానం వీడాడు. అటు ఓపిగ్గా క్రీజులో నిలిచిన రాహుల్‌ను కేశవ్ పెవిలియన్ చేర్చాడు. ఇక పంత్ తనదైన శైలిలో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో స్కోరులో కదలిక తెచ్చాడు. కానీ లంచ్‌కు కాస్త ముందే పేసర్ బాష్ బౌన్సర్‌కు పంత్ క్యాచ్ అవుటయ్యాడు. 138/4 స్కోరుతో భారత్ రెండో సెషన్‌ను పటిష్టమైన స్థితిలోనే ఆరంభించింది. కానీ హార్మర్ ధాటికి 51 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. అయితే 30 పరుగుల తొలి ఇన్నింగ్స్ మాత్రం దక్కింది. కెప్టెన్ గిల్ తిరిగి బ్యాటింగ్‌కు దిగలేదు.
జడ్డూ మాయ: రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఏడో ఓవర్‌లోనే ఝలక్ తగిలింది. ఓపెనర్ రికెల్టన్ (11)ను కుల్దీప్ అవుట్ చేయడంతో ఆటగాళ్లు టీ బ్రేక్‌కు వెళ్లారు. ఇక ఆఖరి సెషన్‌లో పిచ్ బ్యాటింగ్‌కు మరింత కష్టంగా మారింది. వికెట్‌పై పగుళ్లు కూడా కనిపించడంతో జడేజా మాయాజాలానికి సఫారీలు విలవిల్లాడారు. ఆరంభంలోనే స్వీప్‌షాట్‌కు వెళ్లి ఓపెనర్ మార్‌క్రమ్ (4).. జడేజాకు దొరికిపోయాడు. దీనికితోడు 17వ ఓవర్‌లో ముల్డర్ (11), జోర్జి (2)లను కూడా అవుట్ చేసిన జడ్డూ.. కాసేపటికే స్టబ్స్ (5)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఆ జట్టు 60/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఓవైపు కెప్టెన్ బవుమా మాత్రం ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. మరో ఎండ్‌లో వెరీన్ (9)ను అక్షర్, యాన్సెన్ (13)ను కుల్దీప్ అవుట్ చేయడంతో బవుమాకు సహకారం అందలేదు. రెండో రోజు ఆట కూడా వెలుతురు లేమితో కాస్త ముందుగానే ముగించారు.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) యాన్సెన్ 12, రాహుల్ (సి) మార్‌క్రమ్ (బి) కేశవ్ 39, సుందర్ (సి) మార్‌క్రమ్ (బి) హార్మర్ 29, గిల్ (రిటైర్డ్ హర్ట్) 4, పంత్ (సి) వెరీన్ (బి) బాష్ 27, జడేజా (ఎల్బీ) హార్మర్ 27, జురెల్ (సి అండ్ బి) హార్మర్ 14, అక్షర్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 16, కుల్దీప్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1, సిరాజ్ (బి) యాన్సెన్ 1, బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 62.2 ఓవర్లలో 189 ఆలౌట్. వికెట్ల పతనం: 1-18, 2-75, 3-109, 4-132, 5-153, 6-171, 7-172, 8-187, 9-189. బౌలింగ్: యాన్సెన్ 15-4-35-3, ముల్డర్ 5-1-15-0, కేశవ్ 16-1-66-1, బాష్ 11-4-32-1, హార్మర్ 15.2-4-30-4. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (ఎల్బీ) కుల్దీప్ 11, మార్‌క్రమ్ (సి) జురెల్ (బి) జడేజా 4, ముల్డర్ (సి) పంత్ (బి) జడేజా 11, బవుమా (బ్యాటింగ్) 29, జోర్జి (సి) జురెల్ (బి) జడేజా 2, స్టబ్స్ (బి) జడేజా 5, వెరీన్ (బి) అక్షర్ 9, యాన్సెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 13, బాష్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 35 ఓవర్లలో 93/7. వికెట్ల పతనం: 1-18, 2-25, 3-38, 4-40, 5-60, 6-75, 7-91.. బౌలింగ్: బుమ్రా 6-1-14-0, అక్షర్ 11-0-30-1, కుల్దీప్ 5-1-12-2, జడేజా 13-3-29-4.
1
భారత్ తరఫున టెస్టుల్లో ఎక్కువ సిక్సర్లు (92) బాదిన బ్యాటర్‌గా పంత్. సెహ్వాగ్ (90)ను అధిగమించాడు.
1
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో 150 వికెట్లు, 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా జడేజా.
2
టెస్టుల్లో వేగంగా (88 టెస్టులు) 4 వేల రన్స్+300 వికెట్లు తీసిన రెండో ప్లేయర్‌గా జడేజా. ఇయాన్ బోథమ్ (72) ముందున్నాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆల్‌రౌండర్. ఇందులో స్వదేశంలో 2000+ రన్స్, 250+ వికెట్లు ఉండడం విశేషం.
ఇవి కూడా చదవండి:
ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి