Share News

India vs South Africa: భారీ టార్గెట్ ఉఫ్.. దక్షిణాఫ్రికా రికార్డ్ ఛేజింగ్..

ABN , Publish Date - Dec 03 , 2025 | 10:09 PM

టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ (110)తో పాటు ఇతర బ్యాటర్లు కూడా సమయోచితంగా రాణించి భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 358 పరుగుల భారీ టార్గెట్‌ను సమష్టిగా ఊదేశారు.

India vs South Africa: భారీ టార్గెట్ ఉఫ్.. దక్షిణాఫ్రికా రికార్డ్ ఛేజింగ్..
South Africa vs India 2nd ODI

టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ (110)తో పాటు ఇతర బ్యాటర్లు కూడా సమయోచితంగా రాణించి భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 358 పరుగుల భారీ టార్గెట్‌ను సమష్టిగా ఊదేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


358 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఓపెనర్ క్వింటెన్ డికాక్ వెనుదిరిగాడు. అయితే మరో ఎండ్‌లోని మార్‌క్రమ్ మాత్రం దూకుడుగా ఆడాడు. 4 సిక్స్‌లు, 10 ఫోర్లతో సెంచరీ చేసి దక్షిణాఫ్రికా ఛేజింగ్‌కు బాటలు వేశాడు. కెప్టెన్ తెంబా బవుమా (46)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించారు. ఈ జంటను ప్రసిద్ధ్ కృష్ణ విడదీశాడు. బవుమాను అవుడ్ చేశాడు. కాసేపటికే మార్‌క్రమ్ కూడా వెనుదిరిగాడు (South Africa vs India 2nd ODI).


వెంట వెంటనే రెండు వికెట్లు పడిన తర్వాత కూడా దక్షిణాఫ్రికా తడబడలేదు (IND vs SA highlights). బ్రిట్జ్కే (68), బ్రావిస్ (34 బంతుల్లో 54) నాలుగో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దక్షిణాఫ్రికాను లక్ష్యానికి చేరువ చేశారు. చివర్లో బాష్ (26 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. సఫారీ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు.


చివరకు దక్షిణాఫ్రికా మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా, అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (105), విరాట్ కోహ్లీ (102) అద్భుత శతకాలు సాధించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (66 నాటౌట్) మరోసారి కీలక హాఫ్ సెంచరీ చేశాడు.


ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 03 , 2025 | 10:12 PM