Team India: సిరీస్ ఇక్కడే పట్టేస్తారా
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:18 AM
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు.
జోష్‌లో టీమిండియా
గెలుపే ధ్యేయంగా సఫారీలు
నేడు రెండో వన్డే
రాయ్‌పూర్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచీలో భారత్ బోణీ చేయగలిగింది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం కీలకమైన రెండో మ్యాచ్ జరుగనుంది. మరోసారి అందరి చూపు ఈ స్టార్ బ్యాటర్లపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. తమ ఆట మరెవరికో సమాధానమన్నట్టుగా చెలరేగుతున్న రో-కో తమ ధాటిని కొనసాగించాలనుకుంటున్నారు. ఆ ఊపులోనే సిరీస్‌ను కూడా టీమిండియా ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. అదే జరిగితే, టెస్టు సిరీస్ వైట్‌వాష్‌కు ఈ ఫలితంతో కాస్త ఉపశమనం లభిస్తుంది. సఫారీలు మాత్రం కసి మీదున్నారు. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో పట్టు వదలకూడదనే భావనలో వారు ఉన్నారు.
యువ బ్యాటర్లు రాణిస్తే..
ఆస్ట్రేలియా గడ్డపై శతకంతో మెరిసిన రోహిత్ ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీతో మెరి శాడు. ఈ నేపథ్యంలో అతను రాయ్‌పూర్‌లో మరింతగా చెలరేగి శతకం బాదాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక విరాట్ తొలి వన్డేలో తన సహజశైలికి భిన్నంగా ఎదురుదాడికి దిగి సరికొత్త ఆటను చూపాడు. సిక్సర్లకు దూరంగా ఉండే అతను రాంచీలో ఏకంగా ఏడు బంతులను బౌండరీ దాటించాడు. కోహ్లీ మరోసారి సఫారీ బౌలర్లపై అదే ధాటిని కొనసాగిస్తే జట్టు సిరీస్‌ను పట్టేయడం ఖాయం. 2027 వన్డే వరల్డ్‌క్‌పలో చోటు ఆశిస్తున్న రో-కోకు ప్రతీ మ్యాచ్ పరీక్ష లాంటిదే. ఇక, ఓపెనర్ జైస్వాల్‌తో పాటు మిడిల్డార్‌లో రుతురాజ్ తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. బ్యాటింగ్ స్థానాల్లో మార్పులు అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. నెంబర్-4లో రుతురాజ్, ఐదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ రాహుల్, జడేజా బ్యాటింగ్‌లో మెరవడం సానుకూలాంశం. బౌలింగ్‌లో స్పిన్నర్ కుల్దీప్ 4 వికెట్లు తీసినా పరుగులు మాత్రం ధారాళంగా ఇచ్చుకున్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: జైస్వాల్, రోహిత్, విరాట్, రుతురాజ్, సుందర్, రాహుల్ (కెప్టెన్), జడేజా, హర్షిత్, కుల్దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్.
దక్షిణాఫ్రికా: డికాక్, మార్‌క్రమ్, బవుమా (కెప్టెన్), బ్రీట్‌స్కే, డి జోర్జి, బ్రెవిస్, యాన్సెన్, బాష్, కేశవ్, బర్గర్, బార్ట్‌మన్.
పిచ్: రాయ్‌పూర్‌లో కేవలం ఒక్క అంతర్జాతీయ వన్డే మాత్రమే జరిగింది. రెండేళ్ల క్రితం కివీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత పేసర్లు చెలరేగి 108కే కట్టడి చేశారు. ఈసారి కూడా పేస్, స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. మంచు ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆ వరల్డ్ కప్‌లో రోహిత్ ఆడినప్పుడు నేను పాఠశాల విద్యార్థిని
వన్డే సిరీస్ కోసం రోహిత్, విరాట్ చేరడంతో భారత జట్టులో ఒక్కసారిగా బలం పెరిగింది. నిస్సందేహంగా ఆ ఇద్దరికీ అపార అనుభవంతో పాటు అద్భుత నైపుణ్యం ఉంది. కచ్చితంగా ఇది భారత్‌కు సానుకూలాంశమే. అయితే మాకు ఆ ఇద్దరితో ఆడిన అనుభవం ఉంది. వాస్తవానికి రోహిత్ 2007లో టీ20 వరల్డ్‌కప్ ఆడుతున్నప్పుడు నేనింకా పాఠశాలలో చదువుతున్నా.
- టెంబా బవుమా
జట్టులోకి కెప్టెన్ బవుమా
తొలి వన్డేలో 350 పరుగుల లక్ష్యం ముందున్నా సౌతాఫ్రికా బ్యాటర్లు అంత సులువుగా మ్యాచ్‌ను వదల్లేదు. 130/5 స్కోరుతో భారీ ఓటమి ఖాయమే అనుకున్న దశలో.. బ్రీట్‌స్కే, యాన్సెన్, బాష్‌ల అసాధారణ ఆట తీరుతో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగానే సాగింది. తేడా కేవలం 17 పరుగులే కావడం పర్యాటక జట్టులోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అందుకే సఫారీలు రెండో వన్డేలో గెలుపు తమదే అవ్వాలనుకుంటున్నారు. దీనికి తోడు కెప్టెన్ బవుమాతో పాటు స్పిన్నర్ కేశవ్ మహరాజ్ జట్టులో చేరారు. దీంతో ఓపెనర్ రికెల్టన్, సుబ్రయేన్ బెంచీకే పరిమితం కానున్నారు.