Share News

Rohit and Kohli Strained Ties with Coach: ఏదో తేడాగా ఉందే..

ABN , Publish Date - Dec 02 , 2025 | 06:12 AM

కొన్నేళ్లుగా భారత క్రికెట్‌కు మూలస్తంభాలుగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నిలుస్తూ వచ్చారు. దశాబ్దకాలంగా ఎంతో మంది కోచ్‌లుగా వచ్చినా జట్టు ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్‌ ఆగమనంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాస్త దూకుడు స్వభావం కలిగిన గౌతీ తన కోసమే ప్రత్యేకంగా జట్టును రూపొందించుకోవాలనే అభిప్రాయంతో ఉన్నాడు....

Rohit and Kohli Strained Ties with Coach: ఏదో తేడాగా ఉందే..

  • రో-కో గీ గంభీర్‌!

  • క్షీణిస్తున్న సంబంధాలు

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా భారత క్రికెట్‌కు మూలస్తంభాలుగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నిలుస్తూ వచ్చారు. దశాబ్దకాలంగా ఎంతో మంది కోచ్‌లుగా వచ్చినా జట్టు ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్‌ ఆగమనంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాస్త దూకుడు స్వభావం కలిగిన గౌతీ తన కోసమే ప్రత్యేకంగా జట్టును రూపొందించుకోవాలనే అభిప్రాయంతో ఉన్నాడు. యువ ఆటగాళ్లు, ఆల్‌రౌండర్ల వైపే అతను ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దీనికి చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కూడా వంత పాడుతుండడంతో ఇప్పుడు టీమిండియాలో కోచ్‌దే హవా. దీంతో వెటరన్‌ స్టార్లు రోహిత్‌, విరాట్‌ల పరిస్థితి పొమ్మనలేక పొగబెట్టినట్టయ్యింది. అందుకే గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన వెంటనే ఈ ఇద్దరు దిగ్గజాలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ ఉన్నప్పటికీ భవిష్యత్‌ దృష్ట్యా శుభ్‌మన్‌ గిల్‌ వైపు గంభీర్‌ చూడడంతో కినుక వహించిన రోహిత్‌ ఆ ఫార్మాట్‌ నుంచి కూడా వైదొలిగాడు.

అభిమానులు ఈ షాక్‌ నుంచి తేరుకునే లోపే అనూహ్యంగా విరాట్‌ సైతం గుడ్‌బై చెప్పడంతో జట్టులో అసలేం జరుగుతోందనే సందేహం మొదలైంది. ఇప్పుడు రో-కో కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు. మరోవైపు 2027లో జరిగే వన్డే వరల్డ్‌క్‌పలో ఈ ఇద్దరికి చోటు కల్పించేందుకు గంభీర్‌ అంత ఆసక్తి ప్రదర్శించడం లేదు. వారు ఫామ్‌లో ఉంటేనే పరిశీలిస్తామని గతంలోనే గంభీర్‌ తేల్చి చెప్పాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీ్‌సకు జట్టులో చేరిన రో-కో గంభీర్‌తో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. అతడికి సమాధానంగా అన్నట్టు రాంచీలో జరిగిన తొలి వన్డేలో ఈ ద్వయం కసిదీరా చెలరేగి ‘ఇదుగో ఇదీ మా సత్తా’ అంటూ కోచ్‌కు బ్యాట్‌తో గట్టిగానే బదులిచ్చారు. రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కోచ్‌గా వచ్చినప్పుడు గంభీర్‌కు ఈ ఇద్దరితో సంబంధాలు మెరుగ్గానే ఉన్నా, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అటు ముంబైకే చెందిన చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌తో రోహిత్‌కు కూడా అంతగా సత్సంబంధాలు లేకపోవడం గమనార్హం.


ఎడమొహం పెడమొహంగా..

టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాక రో-కో ఆస్ట్రేలియా టూర్‌లోనే తొలిసారిగా కనిపించారు. అక్కడ జరిగిన మూడు వన్డేల్లో రోహిత్‌ అదరగొట్టగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ సున్నాకే అవుటైనా.. ఆఖరి మ్యాచ్‌లో రాణించాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం జట్టులో చేరిన వీరికి కోచ్‌తో సంభాషణలు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చని సమాచారం. ఈ ముగ్గురి చుట్టూ నెలకొన్న ప్రతిష్ఠంభన అటు బీసీసీఐని కూడా ఆందోళనపరుస్తోంది. ‘ఆసీస్‌ టూర్‌లో అగార్కర్‌-రోహిత్‌ అసలు మాట్లాడుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోహ్లీ-గంభీర్‌ ఒకరికొకరు పెద్దగా మాట్లాడుకున్నది లేదు. అంతేకాకుండా ఈ ఇద్దరి అభిమానులు సోషల్‌ మీడియాలో గంభీర్‌పై విరుచుకుపడుతున్న తీరు బీసీసీఐని కలవరపెడుతోంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. తొలి వన్డేలో గెలిచాక డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లిన కోహ్లీ.. అక్కడే ఉన్న కోచ్‌ను కనీసం చూడకుండానే మరో వైపునకు వెళ్లడం వీడియోలో కనిపించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Ishan Kishan World Record: ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డు.. తొలి ప్లేయర్‌గా

Women Cricketers: ఆ ముగ్గురు మహిళా క్రికెటర్లకు.. రైల్వే శాఖ బంపర్ ఆఫర్..

Updated Date - Dec 02 , 2025 | 06:39 AM