టాప్ లేపిన బెంగళూరు
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:04 AM
తాజా సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అదరగొడుతోంది. మరీ ముఖ్యంగా ప్రత్యర్థుల సొంత మైదానాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటూ తొలి టైటిల్ కోసం దూసుకెళ్తోంది...

ఐపీఎల్‌లో నేడు
రాజస్థాన్ X గుజరాత్
వేదిక : జైపూర్, రా.7.30 నుంచి
ఆదుకున్న క్రునాల్, కోహ్లీ
ఢిల్లీపై ఆరు వికెట్లతో విజయం
న్యూఢిల్లీ: తాజా సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అదరగొడుతోంది. మరీ ముఖ్యంగా ప్రత్యర్థుల సొంత మైదానాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటూ తొలి టైటిల్ కోసం దూసుకెళ్తోంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 163 పరుగుల ఛేదనలో అనూహ్యంగా తడబాటుకు గురైనా ఆర్‌సీబీ ఒత్తిడికి లోనుకాలేదు. క్రునాల్ పాండ్యా (47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 నాటౌట్) సమయోచిత ఆటతీరుకు, ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 4 ఫోర్లతో 51) సహకారం అందించగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ నెగ్గింది. దీంతో 14 పాయింట్లతో పట్టికలో టాప్‌నకు చేరి ప్లేఆఫ్స్ ఆశలను మరింత మెరుగుపర్చుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. రాహుల్ (41), స్టబ్స్ (34), పోరెల్ (28) మాత్రమే రాణించారు. భువనేశ్వర్‌కు 3, హాజెల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 19 నాటౌట్) చివర్లో మెరిశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా క్రునాల్ నిలిచాడు.
శతక భాగస్వామ్యంతో..: ఆర్‌సీబీ ముందు ఓ మాదిరి ఛేదనే అనిపించినా.. డీసీ బౌలర్లు ఆదిలోనే ఝలక్ ఇచ్చారు. ఓవర్లు సాగుతున్న కొద్దీ లక్ష్యం కఠినంగా మారుతుండడంతో ఫలితంపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఓపెనర్ విరాట్‌కు తోడు క్రునాల్ అద్భుత ఆటతీరుతో శతక భాగస్వామ్యం నమోదు చేసి జట్టును గట్టెక్కించారు. చివర్లో టిమ్ డేవిడ్ (19 నాటౌట్) ధమాకా ఆటతీరుతో మురిపించాడు. ఓపెనర్ బెథెల్ (12), దేవ్‌దత్ (0)లను స్పిన్నర్ అక్షర్ మూడో ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేర్చి షాకిచ్చాడు. కాసేపటికే కెప్టెన్ రజత్ (6)ను కరుణ్ రనౌట్ చేయడంతో ఆర్‌సీబీ తీవ్ర ఒత్తిడిలో పడింది. అటు పవర్‌ప్లేలో కేవలం 35/3 స్కోరుకే పరిమితం కావడంతో ఛేదన కష్టమే అనిపించింది. కానీ ఈ ఇబ్బందికర పరిస్థితిలో విరాట్-క్రునాల్ జోడీ నిలబడింది. వికెట్‌ను కోల్పోకూడదనే లక్ష్యంతో వీరు ఆచితూడి ఆడారు. అటు సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతున్నా బెదరలేదు. 13వ ఓవర్‌లో క్రునాల్ రెండు సిక్సర్లతో కాస్త కదలిక వచ్చింది. అలాగే 38 బంతుల్లో అతడు కెరీర్‌లో రెండో ఫిఫ్టీని పూర్తి చేశాడు. అటు విరాట్ సైతం తన హ్యాట్రిక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 17వ ఓవర్‌లో క్రునాల్ 2 ఫోర్లతో 12 రన్స్ సమకూరాయి. ఇక తర్వాతి ఓవర్‌లోనే విరాట్ వెనుదిరగడంతో మూడో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం ముగిసినప్పటికే ఆర్‌సీబీ విజయం దరిదాపుల్లోకి వచ్చింది. 12 బంతుల్లో 17 రన్స్ కావాల్సిన వేళ టిమ్ డేవిడ్ 6,4,4,4తో 9 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
మెరుపుల్లేవ్..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్‌సీబీ బౌలర్లు గణనీయంగా కట్టడి చేశారు. అటు స్లో వికెట్ కావడంతో డీసీ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు తంటాలు పడ్డారు. దీనికి తోడు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో రిస్క్ తీసుకోలేక ఒత్తిడిలో పడింది. మధ్య ఓవర్లలో రాహుల్ క్రీజులో నిలిచినా భారీ షాట్లు ఆడలేకపోయాడు. అయితే చివరి మూడు ఓవర్లలో స్టబ్స్ వీరవిహారంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరందుకుంది. ఆరంభంలో ఓపెనర్ పోరెల్ మాత్రం ధాటిని కనబర్చాడు. తొలి బంతినే ఫోర్‌గా మల్చిన తను మూడో ఓవర్‌లో రెండు సిక్సర్లతో 17 రన్స్ రాబట్టాడు. కానీ అతడి దూకుడుకు నాలుగో ఓవర్‌లోనే బ్రేక్ పడింది. తర్వాతి ఓవర్‌లోనే కరుణ్ (4) కూడా వెనుదిరిగినా పవర్‌ప్లేలో జట్టు 52/2తో ఫర్వాలేదనిపించింది. అనంతరం డీసీ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. స్పిన్నర్లు సుయాష్, క్రునాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు రావడం గగనంగా మారింది. రాహుల్, డుప్లెసి మధ్య మూడో వికెట్‌కు 28 రన్స్ జత చేరాయి. అక్షర్ (15) ఉన్నంతసేపు వేగం కనబర్చాడు. 17వ ఓవర్‌లో రాహుల్, అశుతోష్ (2)ల వికెట్లను తీసి భువీ గట్టి దెబ్బ తీశాడు. అప్పటికి స్కోరు 120/6. ఈ దశలో 150 కూడా అతికష్టంగా మారింది. కానీ 18వ ఓవర్‌లో విప్రజ్ (12) సిక్సర్, స్టబ్స్ ఫోర్‌తో 17 రన్స్ సమకూరగా, 19వ ఓవర్‌లో స్టబ్స్ మరింత చెలరేగి 4,6,4తో 19 రన్స్ రాబట్టాడు. కానీ చివరి ఓవర్‌లో భువీ ఆరు పరుగులే ఇచ్చి స్టబ్స్ వికెట్ తీయగా.. విప్రజ్ రనౌటయ్యాడు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
బెంగళూరు 10 7 3 0 14 0.521
గుజరాత్ 8 6 2 0 12 1.104
ముంబై 10 6 4 0 12 0.889
ఢిల్లీ 9 6 3 0 12 0.482
పంజాబ్ 9 5 3 1 11 0.177
లఖ్‌నవూ 10 5 5 0 10 -0.325
కోల్‌కతా 9 3 5 1 7 0.212
హైదరాబాద్ 9 3 6 0 6 -1.103
రాజస్థాన్ 9 2 7 0 4 -0.625
చెన్నై 9 2 7 0 4 -1.302
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
1
ఐపీఎల్ సీజన్‌లో ఇతర వేదికలపై వరుసగా ఆరు విజయాలు సాధించిన ఏకైక జట్టుగా ఆర్‌సీబీ.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..