Share News

India Wins T20 Series: ఆఖరిది వరుణుడి ఖాతాలోకి

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:35 AM

ఐదు టీ20ల సిరీ్‌సలో చివరి మ్యాచ్‌.. హ్యాట్రిక్‌ విజయంతో సిరీ్‌సను పట్టేయాలని భారత్‌ బరిలోకి దిగితే.. ఎలాగైనా సమం చేయాలనే కసితో ఆస్ట్రేలియా పోటీ పడింది. దీంతో ప్రఖ్యాత గాబా మైదానంలో...

India Wins T20 Series: ఆఖరిది వరుణుడి ఖాతాలోకి

  • ఆసీస్‌తో ఐదో టీ20 రద్దు

  • 2-1తో భారత్‌దే సిరీస్‌

బ్రిస్బేన్‌: ఐదు టీ20ల సిరీ్‌సలో చివరి మ్యాచ్‌.. హ్యాట్రిక్‌ విజయంతో సిరీ్‌సను పట్టేయాలని భారత్‌ బరిలోకి దిగితే.. ఎలాగైనా సమం చేయాలనే కసితో ఆస్ట్రేలియా పోటీ పడింది. దీంతో ప్రఖ్యాత గాబా మైదానంలో ఎవరిది ఆధిపత్యమో తెలుసుకునేందుకు అభిమానులు కూడా ఎనలేని ఆసక్తి ప్రదర్శించారు. కానీ ఆట ఆరంభమై ఐదు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే ఫ్యాన్స్‌ ఉత్సాహంపై వరుణుడు నీళ్లుజల్లాడు. సిరీ్‌సలో తొలి మ్యాచ్‌ తరహాలోనే శనివారం జరిగిన ఐదో టీ20 కూడా వర్షంతో రద్దయ్యింది. కేవలం 29 బంతుల ఆటే సాధ్యమైంది. అయితే ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉండడంతో భారత్‌ ఐదు టీ20ల సిరీ్‌సను కైవసం చేసుకుంది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఫార్మాట్‌లో టీమిండియా తన అజేయ ఆటతీరును కొనసాగించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ ధాటిగా సాగింది. ఓపెనర్లు గిల్‌ (16 బంతుల్లో 6 ఫోర్లతో 29 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (13 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌తో 23 నాటౌట్‌) ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. తొలి ఓవర్‌లో చెరో ఫోర్‌ బాదగా.. అభిషేక్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ వదిలేశాడు. ఇక మూడో ఓవర్‌లో గిల్‌ 4 ఫోర్లతో చెలరేగి 16 రన్స్‌ అందించాడు. తర్వాతి ఓవర్‌లోనే అభిషేక్‌ ఫైన్‌ లెగ్‌లో ఇచ్చిన మరో క్యాచ్‌ను డ్వార్షుస్‌ వదిలేశాడు. అయితే భారత్‌ 4.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 52 పరుగులతో నిలిచిన దశలో.. తీవ్రమైన ఉరుములు, మెరుపులు రావడంతో ఆటగాళ్లంతా మైదానం వీడారు. ఆ తర్వాత చిరుజల్లులు మొదలై భారీ వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. దాదాపు రెండున్నర గంటలు వేచిచూసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆసీ్‌సలో సమయం రాత్రి 9 కావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా అభిషేక్‌ నిలిచాడు.

00-Sports.jpg


స్కోరుబోర్డు

భారత్‌: అభిషేక్‌ (నాటౌట్‌) 23, గిల్‌ (నాటౌట్‌) 29; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 4.5 ఓవర్లలో 52/0. బౌలింగ్‌: డ్వార్షుస్‌ 2-0-27-0, బార్ట్‌లెట్‌ 1.5-0-13-0, ఎలిస్‌ 1-0-12-0.

1

తక్కువ బంతుల్లోనే (528) టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా అభిషేక్‌. సూర్యకుమార్‌ (573)ను అధిగమించాడు.

2

తక్కువ ఇన్నింగ్స్‌ (28)లో టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా అభిషేక్‌. విరాట్‌ (27) ముందున్నాడు.

Updated Date - Nov 09 , 2025 | 06:35 AM