PM Modi Meets Womens Cricket Team: అమన్‌జోత్ క్యాచ్‌తో ట్రోఫీ కనిపించిందా
ABN , Publish Date - Nov 06 , 2025 | 05:07 AM
ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టును ప్రధాని మోదీ బుధవారం తన నివాసంలో కలుసుకున్నారు. టోర్నమెంట్‌లో జట్టు అద్భుతంగా..
విశ్వవిజేతలతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టును ప్రధాని మోదీ బుధవారం తన నివాసంలో కలుసుకున్నారు. టోర్నమెంట్‌లో జట్టు అద్భుతంగా పుంజుకొని విజేతగా నిలిచిన తీరును ఆయన కొనియాడారు. ఫైనల్లో అమన్‌జోత్ పట్టిన అద్భుత క్యాచ్‌తో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు వరల్డ్ కప్ ట్రోఫీ కనిపించి ఉంటుందని ఈ సందర్భంగా మోదీ నవ్వుతూ అన్నారు. 2017 వన్డే వరల్డ్ కప్ అనంతరం మోదీని కలిసిన క్షణాలను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గుర్తు చేసుకొంది. అప్పుడు కప్ లేకుండా ప్రధానిని కలిశామని, ఇప్పుడు ట్రోఫీతో భేటీ అవడం గర్వంగా ఉందని చెప్పింది. నిరంతరం వర్తమానంలో ఎలా ఉండగలుగుతారని ప్రధానిని హర్మన్ ప్రశ్నించింది. అది తన జీవితంలో ఒక భాగమైందని, క్రమంగా అలవాటుగా మారిందని ఆయన బదులిచ్చారు. ఫైనల్ అనంతరం బంతిని హర్మన్ తన జేబులో దాచుకోవడాన్ని గురించి మోదీ సరదాగా అడిగారు. ఆ బంతి తన వద్దకు రావడం అదృష్టమని హర్మన్ తెలిపింది.
దీప్తీశర్మ ‘జై శ్రీరామ్’ బయో గురించి ప్రస్తావన..
ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తీశర్మ.. ఇన్‌స్టాలో ‘జైశ్రీరామ్’ బయోతోపాటు హనుమాన్ టాటూ గురించి ఆమెను ప్రధాని అడిగారు. ఆ రెండు తనకు ఎంతో బలాన్ని ఇస్తాయని దీప్తీశర్మ తెలిపింది. ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని బాలికల్లో బాగా ప్రచారం చేయాలని ప్లేయర్లను కోరారు. పాఠశాలలను సందర్శించి బాలబాలికలు క్రీడలపట్ల ఆకర్షితులయ్యేలా స్ఫూర్తి నింపాలని సూచించారు.