Olympics Cricket Schedule: ఒలింపిక్స్‌లో క్రికెట్.. షెడ్యూల్ ఇదే
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:52 PM
లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. 2028 జులై 12 నుంచి ఈ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: లాస్ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కూడా చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రీడా సంరంభంలో భాగంగా 2028 జులై 12 నుంచి క్రికెట్ మ్యాచులు మొదలు కానున్నాయి. గ్రూప్ దశలో ప్రతి టీమ్ రెండు టీ20 మ్యాచులు ఆడనుంది. జులై 20, 29 తేదీల్లో మెడల్ మ్యాచులను ఏర్పాటు చేశారు. జులై 14, 21 తేదీల్లో మాత్రం క్రీడాకారులకు విశ్రాంతిని ఇచ్చేందుకు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించరు. రోజుకు రెండు గ్రూప్ దశ మ్యాచులు జరిగేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.00 గంటలకు మొదటి మ్యాచ్, సాయంత్రం 6.30 గంటలకు రెండో మ్యాచ్ నిర్వహిస్తారు. కాలిఫోర్నియాలోని పోమోనా నగరంలోగల ఫెయిర్‌గ్రౌండ్స్ స్టేడియంలో ఈ మ్యాచులు జరగనున్నాయి (Olympics 2028 cricket schedule).
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు టీమ్స్ చొప్పున తలపడనున్నాయి. ఒక్కో జట్టు కోసం 15 మంది సభ్యుల స్క్వాడ్‌ను ఎంపిక చేస్తారు. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ దృష్ట్యా నిర్వాహకులు ఈ క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చారు. అమెరికాలో కూడా క్రికెట్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అప్పట్లో మూడు వేదికల్లో మ్యాచులను నిర్వహించారు. ఇక 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్ బాల్, బేస్‌బాల్, లక్రాస్, స్క్వాష్ క్రీడలకు చోటు దక్కింది.
ప్యారిస్ వేదికగా 1900లో జరిగిన ఒలింపిక్స్‌లో చివరిసారిగా క్రికెట్ మ్యాచులు జరిగాయి. అప్పట్లో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్‌లు మాత్రమే తలపడగా యూకేను విజయం వరించింది. టెస్ట్, వన్డేల్లాంటి దీర్ఘ ఫార్మాట్‌ల నిర్వహణకు తగినంత సమయం లేక ఒలింపిక్స్‌లో క్రికెట్ స్థానం కోల్పోవడానికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతారు. స్టేడియాలు, ఇతర మౌలిక వసతుల లేమి కూడా ఈ పరిస్థితికి మరో కారణం. ఇక క్రికెట్ కేవలం దక్షిణాసియా దేశాలకే పరిమితమైన క్రీడ అన్న భావన కూడా ప్రతిబంధకంగా మారింది. ఒలింపిక్స్ కమిటీలో క్రికెట్ ఆడే దేశాలకు మొదట్లో ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం కూడా ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒలింపిక్స్‌లో నిత్యం సత్తా చాటే అమెరికా, చైనా ల్లాంటి దేశాల్లో క్రికెట్‌కు ఆదరణ తక్కువే. అయితే, టీ20 ఫార్మాట్ రాకతో పరిస్థితి మారింది.
ఈ నేపథ్యంలో 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కూడా చోటు కల్పిస్తూ ఒలింపిక్స్ కమిటీ ముంబైలో జరిగిన 141వ సమావేశాల్లో నిర్ణయించింది.
ఇవీ చదవండి:
లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి