ముంబై జైత్రయాత్ర
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:59 AM
జోరుమీదున్న ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయంతో ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్తోంది. ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58), సూర్యకుమార్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో...

వరుసగా ఐదో విజయం
సూర్య, రికెల్టన్ అర్ధ శతకాలు
54 పరుగులతో లఖ్‌నవూ చిత్తు
బుమ్రాకు 4 వికెట్లు
ముంబై: జోరుమీదున్న ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయంతో ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్తోంది. ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58), సూర్యకుమార్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతోపాటు బుమ్రా (4/22) నిప్పులు చెరగడంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 54 పరుగులతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 215/7 స్కోరు చేసింది. మయాంక్, అవేశ్ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో లఖ్‌నవూ ఓవర్లన్నీ ఆడి 161 పరుగులకు ఆలౌటైంది. ఆయుష్ బదోని (35), మిచెల్ మార్ష్ (34) ఫర్వాలేదనిపించారు. ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు దక్కించుకోగా.. ఆల్‌రౌండ్ షో చేసిన విల్ జాక్స్ (29, 2/18) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
పెవిలియన్‌కు క్యూ: ముంబై పేసర్లు బుమ్రా, బౌల్ట్ వికెట్ల వేటలో పోటీపడడంతో.. లఖ్‌నవూ బ్యాటింగ్ పేకమేడను తలపించింది. రెండో వికెట్‌కు పూరన్ (27)తో కలసి 42 రన్స్ జోడించిన మార్ష్.. బదోనితో నాలుగో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, పూరన్, కెప్టెన్ రిషభ్ పంత్ (4)ను జాక్స్ ఒకే ఓవర్‌లో అవుట్ చేసి ఝలక్ ఇచ్చాడు. కాగా, ఓపెనర్ మార్‌క్రమ్ (9)ను స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చిన బుమ్రా.. 16వ ఓవర్‌లో మిల్లర్ (24), సమద్ (2), బిష్ణోయ్ (13) వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. మార్ష్, బదోనితోపాటు దిగ్వేష్ (1)ను అవు ట్ చేసిన బౌల్ట్.. లఖ్‌నవూ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
చెలరేగిన సూర్య: రికెల్టన్, సూర్య అర్ధ శతకాలతో.. ముంబై భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శుభారంభం అందించారు. ఫోర్‌తో ఖాతా తెరిచిన ఓపెనర్ రికెల్టన్.. రెండో ఓవర్‌లో ప్రిన్స్ బౌలింగ్‌లో 6,4,4తో చెలరేగాడు. అయితే, గాయం నుంచి పునరాగమనం చేసిన పేసర్ మయాంక్ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన మరో ఓపెనర్ రోహిత్ (12).. అదే ఓవర్‌లో స్లో బంతికి బోల్తాపడ్డాడు. దీంతో తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్ (29) కూడా రికెల్టన్‌తో పోటీపడి మరీ షాట్లు ఆడారు. ఆరో ఓవర్‌లో రికెల్టన్ 6,4,6తో 19 పరుగులు రాబట్టడంతో.. పవర్‌ప్లేను ముంబై 66/1తో మెరుగ్గా ముగించింది. అయితే, ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న రికెల్టన్‌ను ప్రిన్స్ బౌల్డ్ చేసినా.. రెండో వికెట్‌కు 55 పరుగులు సమకూరాయి. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్య.. చిన్నచిన్న భాగస్వామ్యాలతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. జాక్స్‌ను ప్రిన్స్ బౌల్డ్ చేయగా.. తిలక్ వర్మ (6)ను బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా (5)ను మయాంక్ వెనక్కిపంపారు. మరోవైపు అవేశ్ బౌలింగ్‌లో సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్న సూర్య.. ఆ తర్వాతి బంతికి అవుటయ్యాడు. చివరి ఓవర్లలో నమన్ ధిర్ (25 నాటౌట్), బోష్ (20) వేగంగా ఆడడంతో.. ముంబై స్కోరు 200 మార్క్ దాటింది.
స్కోరుబోర్డు
ముంబై: రికెల్టన్ (సి) బదోని (బి) రాఠీ 58, రోహిత్ (సి) ప్రిన్స్ (బి) మయాంక్ 12, జాక్స్ (బి) ప్రిన్స్ 29, సూర్యకుమార్ (సి) మార్ష్ (బి) అవేశ్ 54, తిలక్ (సి) ప్రిన్స్ (బి) బిష్ణోయ్ 6, హార్దిక్ (బి) మయాంక్ 5, నమన్ (నాటౌట్) 25, బాష్ (సి) పూరన్ (బి) అవేశ్ 20, చాహర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 215/7; వికెట్ల పతనం: 1-33, 2-88, 3-116, 4-137, 5-157, 6-180, 7-208; బౌలింగ్: మయాంక్ 4-0-40-2, ప్రిన్స్ 4-0-44-1, దిగ్వేష్ రాఠీ 4-0-48-1, బిష్ణోయ్ 4-0-41-1, అవేశ్ ఖాన్ 4-0-42-2.
లఖ్‌నవూ: మార్ష్ (సి) తిలక్ (బి) బౌల్ట్ 34, మార్‌క్రమ్ (సి) నమన్ (బి) బుమ్రా 9, పూరన్ (సి) సూర్య (బి) జాక్స్ 27, పంత్ (సి) కర్ణ్ శర్మ (బి) జాక్స్ 4, ఆయుష్ (సి) జాక్స్ (బి) బౌల్ట్ 35, మిల్లర్ (సి) బాష్ (బి) బుమ్రా 24, సమద్ (బి) బుమ్రా 2, బిష్ణోయ్ (బి) బాష్ 13, అవేశ్ (బి) బుమ్రా 0, ప్రిన్స్ (నాటౌట్) 4, దిగ్వేష్ (బి) బౌల్ట్ 1; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 161 ఆలౌట్; వికెట్ల పతనం: 1-18, 2-60, 3-64, 4-110, 5-135, 6-141, 7-142, 8-142, 9-157; బౌలింగ్: బౌల్ట్ 4-0-20-3, చాహర్ 3-0-38-0, బుమ్రా 4-0-22-4, జాక్స్ 2-0-18-2, కర్ణ్ శర్మ 2-0-25-0, హార్దిక్ 1-0-10-0, బాష్ 4-0-26-1.
1
ఐపీఎల్‌లో వేగంగా 4వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్. 2,714 బంతుల్లో సూర్య ఈ ఫీట్ చేస్తే.. 2,658 బంతుల్లో సాధించిన గేల్, డివిల్లీర్స్ సంయుక్తంగా టాప్‌లో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..