Messi Wraps Up India Tour: ఆఖరి రోజు మెస్సీ ఇలా..
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:17 AM
గోట్ టూర్లో భాగంగా మెస్సీ ఇప్పటికే కోల్‌కతా, హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేశాడు. ఇక ఆఖరి, మూడోరోజైన సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో.....
నేడు ఢిల్లీలో ప్రధాని మోదీ, సీజేఐ, ఆర్మీచీ్ఫలతో భేటీ
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈవెంట్‌కు హాజరు
న్యూఢిల్లీ: గోట్ టూర్లో భాగంగా మెస్సీ ఇప్పటికే కోల్‌కతా, హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేశాడు. ఇక ఆఖరి, మూడోరోజైన సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో అభిమానులను అలరించి తన పర్యటనకు ముగింపు పలకనున్నాడు. మరి.. చివరిరోజు మెస్సీ ఏం చేయనున్నాడు..? ఎవరిని కలవనున్నాడు..? అంటే.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్లో ఇప్పుడు కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు మరికొందరు అత్యంత ప్రముఖులతో మెస్సీ భేటీ కానున్నాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
ఉదయం 10.45 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టనున్న మెస్సీ.. ముందుగా నగరంలోని ఓ హోటల్లో 50 నిమిషాల పాటు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటాడు. అనంతరం ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీతో 20 నిమిషాలు సమావేశం కానున్నాడు.
మోదీతో భేటీ అనంతరం ఎంపీ, జాతీయ ఫుట్‌బాల్ సంఘం మాజీ చీఫ్ ప్రఫుల్ పటేల్ నివాసానికి మెస్సీ వెళ్లనున్నాడు. భారత్‌లో అర్జెంటీనా రాయబారి మరియానో అగస్టిన్ కాసినోతో పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ రాహుల్ నవీన్‌లాంటి అత్యంత ప్రముఖులను అక్కడ కలుసుకుంటాడు.
మధ్యాహ్నం 3.30కు ఫిరోజ్ షా కోట్లా (అరుణ్ జైట్లీ స్టేడియం) స్టేడియానికి చేరుకోనున్న మెస్సీ.. కొందరు క్రికెట్, సినీ సెలెబ్రిటీలతో కలిసి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతాడు. మధ్యాహ్నం 3.55 నుంచి సాయంత్రం 4.15 గంటల దాకా 22 మంది చిన్నారులతో కలిసి ఫుట్‌బాల్ క్లినిక్‌లో పాల్గొంటాడు.