Krunal Pandya on Virat Kolhi: విరాట్‌పై క్రునాల్ పాండ్య ప్రశంసలు.. బ్యాటింగ్‌లో అండగా నిలిచాడంటూ కితాబు
ABN , Publish Date - Apr 28 , 2025 | 10:55 AM
ఇన్నింగ్స్‌లో మొదట తాను తడబడ్డా ఆ తరువాత పుంజుకోవడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడని క్రునాల్ పాండ్య పేర్కొన్నారు. తనను వెన్ను తట్టి ప్రోత్సహించాడని తెలిపాడు

ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్య అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. డీసీపై బ్యాట్ ఝళిపించిన కృనాల్ 47 బంతుల్లో 73 పరుగులు చేసి విరాట్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అటు మిడిల్ ఓవర్స్‌లో డీసీ బ్యాటర్స్‌కు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి పరుగులను అడ్డుకున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి డీసీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్‌పై హర్షం వ్యక్తం చేసిన పాండ్య.. తాను ఏం చేయాలనే దానిపై మొదటి నుంచీ స్పష్టత ఉందని చెప్పుకొచ్చాడు. అయితే, బ్యాటింగ్ ఈ స్కోరు సాధించడానికి విరాట్ సహకారమే కారణమి కూడా చెప్పాడు.
‘‘మంచి ఫలితాలు వస్తే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. తెర వెనక అంత శ్రమ పడ్డాక దాని ఫలితం మ్యాచ్‌లో కనిపిస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది. అయితే, మ్యాచ్‌లో నా పాత్ర ఏంటనేదానిపై మొదటి నుంచీ స్పష్టత ఉంది. మొదట్లో వికెట్లు త్వరగా కోల్పోతే ఆ తరువాత వచ్చి స్థిరమైన పార్ట్‌నర్ షిప్ ఏర్పరచాలనే లక్ష్యంతో వచ్చా. జట్టులో భారీ స్కోర్లు రాబట్టగలిగే డేవిడ్, జితేశ్, షెపర్డ్ ఉన్నారు. ఏ బౌలింగ్‌ను అయినా వారు ఎదుర్కోగలరు. తొలి 20 బంతుల్లో నేను కాస్త తడబడ్డా. అయితే, మరో ఎండ్‌లో విరాట్ ఉన్నప్పుడు పని చాలా సులువైపోతుంది. మొదట్లో నేను ఇబ్బంది పడుతుంటే విరాట్ ప్రోత్సహించాడు. ఆ తరువాత ఫార్మ్ చేతిలోకొచ్చింది. కాబట్టి, నా పర్‌ఫార్మెన్స్‌కు క్రెడిట్ చాలా వరకూ విరాట్‌కే దక్కుతుంది’’ అని చెప్పాడు.
‘‘ఓ బౌలర్‌గా ప్రత్యర్థులతో పోలిస్తే ఒక అడుగు ముందే ఉండాలని అనుకుంటా. బౌలింగ్ మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు చేశా. బ్యాట్స్‌మన్ బలాబలాలను నాకు అనుకూలంగా మార్చుకుని బౌలింగ్ చేస్తాను. బౌన్సర్లు, యార్కర్‌లు అన్నీ ట్రై చేస్తున్నా. గతంలోనూ బౌలింగ్ చేశా. తదుపరి బంతి ఎలా ఉంటుందా అని తికమక పెట్టేలా చేసేందుకు ప్రయత్నిస్తుంటా’’ అని అంటారు.
ఇక డీసీతో జరిగిన మ్యాచ్‌లో మొదట్లో తడబడ్డా ఒత్తిడికి లొంగిపోకుండా బెంగళూరు విజయాన్ని అందుకుంది. 163 పరుగుల లక్ష్య ఛేదనలో క్రునాల్, విరాట్‌ల భాగస్వామ్యం కీలకంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?.. కారణం ఏంటో తెలిస్తే
IPL 2025 KKR vs PBKS: వర్షం కారణంగా మ్యాచ్ రద్ధు.. ఇరు జట్లకు చెరో పాయింట్
ఆసియా బాక్సింగ్‌లో 43 పతకాలు ఖాయం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..