Humpy Tie Break Win: విజేత హంపి
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:45 AM
తెలుగు గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పుణెలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీ విజేతగా నిలిచింది. చివరి రౌండ్‌లో బల్గేరియా జీఎం పై గెలిచి టై బ్రేకర్ ఆధారంగా టైటిల్ దక్కించుకుంది

‘ఫిడే’ మహిళల గ్రాండ్ ప్రీ చెస్
పుణె: భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నమెంట్ పుణె అంచె చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఆఖరి రౌండ్‌లో బల్గేరియా జీఎం నుర్గ్యుల్ సలిమోవాపై హంపి విజయం సాధించింది. తెల్లపావులతో ఆడిన తెలుగు గ్రాండ్‌మాస్టర్ హంపి 84 సుదీర్ఘ ఎత్తుల తర్వాత సలిమోవాను ఓడించింది. ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ హంపి మొత్తం తొమ్మిది రౌండ్ల ద్వారా ఏడు పాయింట్లు సాధించింది. హంపితోపాటు టైటిల్ రేసులో నిలిచిన చైనా గ్రాండ్‌మాస్టర్ ఝు జినెర్ కూడా చివరి గేమ్‌లో గెలుపొందింది. ఏడు పాయింట్లతో హంపితో సమంగా జినెర్ నిలిచింది. కానీ మెరుగైన టై బ్రేకర్ స్కోరు ఆధారంగా భారత గ్రాండ్‌మాస్టర్ టైటిల్ దక్కించుకుంది. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మంగోలియా జీఎం ముంగుంతూల్‌తో పాయింట్ పంచుకుంది. 4.5 పాయింట్లతో హారిక నాలుగో స్థానంలో నిలిచింది. రష్యన్ జీఎం అలీనాతో చివరి రౌండ్‌ను డ్రా చేసుకున్న దివ్య దేశ్‌ముఖ్ (5.5) మూడో స్థానం సాధించింది. జీఎం వైశాలి (4) ఆరో స్థానంలో నిలిచింది.