Share News

Kohli Shine as India Defeat South Africa: విరాట్‌ దంచేశాడు

ABN , Publish Date - Dec 01 , 2025 | 04:28 AM

దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల్లో వైట్‌వాష్‌ అయిన భారత్‌ వన్డే సిరీ్‌సలో పుంజుకుంది. రోహిత్‌, కోహ్లీ జోడీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో విజృంభించిన వేళ 17 పరుగులతో....

Kohli Shine as India Defeat South Africa: విరాట్‌ దంచేశాడు

  • సెంచరీతో విజృంభణ

  • రోహిత్‌, రాహుల్‌ అర్ధ శతకాలు

  • భారత్‌దే తొలి వన్డే

  • ఉత్కంఠ పోరులో సఫారీల ఓటమి

వయస్సు అనేది సంఖ్యే కానీ ఆటకు అడ్డు కాదని రోహిత్‌, కోహ్లీ జోడీ మరోసారి నిరూపించింది.. మొన్నటి ఆస్ట్రేలియా పర్యటనలో ఫామ్‌ చాటుకున్న ఈ దిగ్గజ జంట దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఆ జోరు కొనసాగించింది.. ముఖ్యంగా విరాట్‌ మాస్టర్‌ క్లాస్‌ బ్యాటింగ్‌తో సెంచరీతో విజృంభిస్తే.. రోహిత్‌ అర్ధ శతకంతో అదరగొట్టాడు. మొత్తంగా రో-కో ద్వయం ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగించిన ఈ పోరులో భారత్‌ గెలుపొందింది..మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో 1-0తో ముందంజలో నిలిచింది.

రాంచీ: దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల్లో వైట్‌వాష్‌ అయిన భారత్‌ వన్డే సిరీ్‌సలో పుంజుకుంది. రోహిత్‌, కోహ్లీ జోడీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో విజృంభించిన వేళ 17 పరుగులతో సఫారీలను ఓడించింది. ఆదివారం ఉత్కంఠగా జరిగిన తొలి వన్డేలో మొదట భారత్‌ 50 ఓవర్లలో 349/8 స్కోరు చేసింది. కోహ్లీ (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 135) సెంచరీతో చెలరేగగా, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60), రోహిత్‌ (51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) అర్ధ శతకాలతో మెరిశారు. బార్ట్‌మన్‌, బర్గర్‌, బాష్‌, యాన్సెన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 రన్స్‌కు ఆలౌటైంది. .బ్రీట్‌స్కే (80 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 72), యాన్సెన్‌ (39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70), బాష్‌ (51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) అర్థ శతకాలతో పోరాడారు. కుల్దీప్‌ 4, హర్షిత్‌ 3, అర్ష్‌దీప్‌ 2 వికెట్లు తీశారు. కోహ్లీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


టాప్‌ విఫలమైనా.: భారీ ఛేదనలో హర్షిత్‌ ధాటికి దక్షిణాఫ్రికా 11/3తో తీవ్ర ఇక్కట్లలో పడింది. అయితే మిడిల్‌, లోయర్‌ మిడిలార్డర్‌ ఆటగాళ్లు పట్టు వీడకుండా పోరాడి భారత్‌లో గుబులు రేపారు. జోర్జీ (39), బ్రేవిస్‌ (37), యాన్సెన్‌లతో కలిసి బ్రీట్‌స్కే మూడు అర్ధ శతక భాగస్వామ్యాలతో సఫారీలను పోటీలోకి తెచ్చాడు. కానీ మూడు బంతుల తేడాతో యాన్సెన్‌, బ్రీట్స్‌స్కేను అవుట్‌ చేసిన కుల్దీప్‌ భారత్‌కు కీలక బ్రేక్‌ ఇచ్చాడు. కానీ బాష్‌, సుబ్రేయన్‌, బర్గర్‌ ఒత్తిడి లేకుండా ఆడి మ్యాచ్‌ను చివరి ఓవర్‌ వరకూ తీసుకొచ్చి ఉత్కంఠ రేపారు.

రో-కో షో: భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌, విరాట్‌ కోహ్లీ తమదైన శైలిలో నిర్మించారు. జైస్వాల్‌ త్వరగా నిష్క్రమించినా..ఇన్నింగ్స్‌ చక్కదిద్దే భారాన్ని రో-కో తమ భుజాలపై వేసుకున్నారు. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా సారథి మార్‌క్రమ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అయితే ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో జైస్వాల్‌ (18)ని బర్గర్‌ క్యాచవుట్‌ చేశాడు. దాంతో ఫ్యాన్స్‌ హర్షధ్వానాల నడుమ క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఎదుర్కొన్న మొదటి బంతిని ఫోర్‌ బాది వారిలో జోష్‌లో నింపాడు. మరోవైపు వ్యక్తిగత స్కోరు ఒక పరుగు వద్ద లైఫ్‌ పొందిన రోహిత్‌ యాన్సెన్‌ బౌలింగ్‌లో 4,4తో బ్యాటుకు పని చెప్పడంతో ఏడో ఓవర్లోనే జట్టు స్కోరు 50 దాటింది. ఆపై కోహ్లీ కూడా బర్గర్‌ బౌలింగ్‌లో 6,4తో కదం తొక్కడంతో స్టేడియం హోరెత్తింది. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకొని ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడడంతో స్కోరుబోర్డు రేసు గుర్రంలా పరిగెత్తింది. 14వ ఓవర్లోనే జట్టు స్కోరు సెంచరీ దాటగా..బాష్‌ బౌలింగ్‌లో చూడచక్కటైన సిక్సర్‌తో విరాట్‌ ఫిఫ్టీ మార్క్‌ చేరాడు. తర్వాత రోహిత్‌ కూడా 60వ అర్ధ శతకం పూరించినా..కొద్దిసేపటికే యాన్సెన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో 136 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (8), సుందర్‌ (13) త్వరగా నిష్క్రమించగా.. కేఎల్‌ రాహుల్‌ జతగా జట్టు ఇన్నింగ్స్‌ను పునర్‌ నిర్మించే బాధ్యతను కోహ్లీ చేపట్టాడు. యాన్సెన్‌ బౌలింగ్‌ బౌండరీతో సెంచరీ పూరించిన విరాట్‌..స్టేడియం మొత్తం చప్పట్లతో హోరెత్తగా గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు. తదుపరి సుబ్రాయన్‌ బౌలింగ్‌లో కోహ్లీ 4,6,6,4తో రెచ్చిపోయాడు. అదే ఊపులో బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో 2 ఫోర్లు కొట్టిన విరాట్‌..బర్గర్‌ బౌలింగ్‌లో భారీషాట్‌ కొట్టే యత్నంలో క్యాచవుటయ్యాడు. రాహుల్‌తో కలిసి ఐదో వికెట్‌కు విరాట్‌ 76 రన్స్‌ జోడించాడు. కోహ్లీ పెవిలియన్‌ చేరాక బ్యాట్‌ ఝళిపించిన రాహుల్‌ అర్ధ శతకం పూర్తి చేశాడు. జడేజా (20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32) వేగంగా ఆడడంతో..ఈ జోడీ ఆరో వికెట్‌కు 36 బంతుల్లోనే 65 రన్స్‌ జోడించింది.


3.jpg

రోహిత్‌ సిక్సర్ల రికార్డ్‌

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలలో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు 349 సిక్సర్లతో ఉన్న హిట్‌మ్యాన్‌ ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాది షాహిద్‌ అఫ్రీది (351 సిక్సర్లు) రికార్డును తిరగ రాశాడు. అయితే రోహిత్‌ కేవలం 277 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్‌ అందుకోగా, అఫ్రీది 398 మ్యాచ్‌ల్లో ఆ రికార్డు సాధించాడు.

సచిన్‌ను వెనక్కు నెట్టి..

  • వన్డేలలో 52వ శతకం సాధించిన విరాట్‌..ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ

  • క్రమంలో టెస్ట్‌ల్లో సచిన్‌ చేసిన 51 సెంచరీల రికార్డును కోహ్లీ తిరగరాశాడు. ఇక..మూడు ఫార్మాట్లలో కలిపి కోహ్లీ మొత్తం 83( టెస్ట్‌ల్లో 30, వన్డేల్లో 52, టీ20ల్లో ఒకటి) సెంచరీలుసాధించాడు. సచిన్‌ వంద శతకాల (టెస్ట్‌లు-51, వన్డేలు 49)తో ముందున్నాడు. అలాగే దక్షిణాఫ్రికాపై వన్డేలలో అత్యధిక సెంచరీలు (5) చేసిన టెండూల్కర్‌ రికార్డునూ కోహ్లీ (6) బద్దలుగొట్టాడు.

  • 7000విరాట్‌ కొట్టిన ఈ శతకం..క్రికెట్‌ చరిత్రలో ఏడు వేల సెంచరీ కావడం విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి:

Gayatri Gopichand and Treesa Jolly: గాయత్రి జోడీదే డబుల్స్‌ ట్రోఫీ

Aiden Markram: మా ఓటమికి అదే కారణం: సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్

Updated Date - Dec 01 , 2025 | 09:04 AM