IPL Player Releases: రాజస్థాన్‌కు జడేజా చెన్నైకి శాంసన్
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:29 AM
ఐపీఎల్‌లో ఊహించని సంచలనాలు చోటుచేసుకొన్నాయి. మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు అనూహ్య నిర్ణయాలతో అభిమానులను ఆశ్చర్యపరిచాయి. రాబోయే సీజన్ కోసం టాప్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను...
రస్సెల్‌ను వదులుకున్న కోల్‌కతా
లఖ్‌నవూకు షమిని అమ్మిన సన్‌రైజర్స్
మినీ వేలానికి 77 మంది క్రికెటర్లు
ముంబై: ఐపీఎల్‌లో ఊహించని సంచలనాలు చోటుచేసుకొన్నాయి. మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు అనూహ్య నిర్ణయాలతో అభిమానులను ఆశ్చర్యపరిచాయి. రాబోయే సీజన్ కోసం టాప్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ట్రేడింగ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు అమ్మేయడం.. బదులుగా ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనికి తోడు కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ప్రధాన ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ను వదిలేయడం గమనార్హం. ఇలా.. 10 ఫ్రాంచైజీలు మొత్తంగా 77 మంది ఆటగాళ్లను విడుదల చేసినట్టు ఐపీఎల్ శనివారం ప్రకటించింది. వీళ్లంతా వచ్చేనెల 16న అబుదాబిలో జరిగే మినీ వేలానికి అందుబాటులో ఉంటారు. గతేడాది జరిగిన మెగా వేలంలో ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను భారీ ధరకే రిటైన్, కొనుగోలు చేశాయి. అయితే, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని స్థిరమైన జట్టును తయారు చేసే ఆలోచనతోనే మినీ వేలంలో ఆ లోటుపాట్లను పూడ్చుకోవాలని ఫ్రాంచైజీలు చూస్తున్నాయి. కాగా, ట్రేడింగ్‌లో భాగంగా జడేజాకు చెన్నై చెల్లిస్తున్న రూ. 18 కోట్ల ఫీజు కంటే తక్కువగా... అంటే రూ. 14 కోట్లకు అతడిని రాజస్థాన్ దక్కించుకొంది. లీగ్ ఆరంభంలో రెండు సీజన్లు రాజస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించిన జడ్డూ కెరీర్ చివర్లో మరోసారి అక్కడికే చేరాడు. 12 ఏళ్లపాటు అతడు చెన్నై తరఫున ఆడాడు. ఇక.. శాంసన్‌కు ప్రస్తుతమున్న రూ. 18 కోట్లనే చెన్నై చెల్లించనుంది. సంజూను కెప్టెన్ ధోనీకి వారసుడిగా తీసుకొస్తున్నారనే ఊహాగానాలున్నాయి. పేసర్ మహ్మద్ షమిని సన్‌రైజర్స్ రూ. 10 కోట్లకు లఖ్‌నవూకు ట్రేడ్ చేసింది. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ను ముంబై ప్రస్తుత ఫీజు రూ. 30 లక్షలకు లఖ్‌నవూకు అమ్మేసింది.
ప్రక్షాళన దిశగా కోల్‌కతా: జట్టును పునర్‌నిర్మించాలనుకొంటున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ వెంకటేష్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు), రస్సెల్ (రూ. 12 కోట్లు)తోపాటు డికాక్, మొయిన్ అలీ, నోకియా, గుర్బాజ్‌ను విడుదల చేయగా.. పేసర్ మయాంక్ మార్కండేను ముంబైకి ట్రేడ్ చేసింది. దీంతో రూ. 64.3 కోట్ల భారీ మొత్తంతో కోల్‌కతా వేలానికి సిద్ధమైంది. అయితే, రహానె, నరైన్, వరుణ్, రింకూ.. ఇలా కోర్ టీమ్‌ను రిటైన్ చేసుకొన్న నైట్‌రైడర్స్‌లో 13 ఖాళీలు ఏర్పడ్డాయి. మరోవైపు బౌలింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలనుకొంటున్న చెన్నై.. ట్రేడింగ్‌లో శాంసన్‌ను తీసుకొన్నా కూడా రూ. 43.4 కోట్లతో వేలానికి వెళ్లనుంది. పేసర్ పతిరన, కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, దీపక్ హుడా, తెలుగు క్రికెటర్ రషీద్‌లను వదిలేసింది. జడేజాతోపాటు సామ్ కర్రాన్‌ను రూ. 2.4 కోట్లకు రాజస్థాన్‌కు అమ్మేసింది.
ఢిల్లీకి రాణా: ఆల్‌రౌండర్ నితీశ్ రాణాను ఢిల్లీ రూ. 4.2 కోట్లకు రాజస్థాన్ నుంచి ట్రేడింగ్‌లో దక్కించుకొంది. డుప్లెసి, ఫ్రేజర్ సహా ఆరుగురిని ఢిల్లీ విడుదల చేసింది. కీపర్ డోనోవాన్ ఫెరీరాను రూ. కోటికి రాజస్థాన్ రాయల్స్‌కు అమ్మేసింది. కరీమ్, కేజ్రోలియా, కొట్జీ, షనక్, మహిపాల్‌ను గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేయగా.. రూథర్‌ఫోర్డ్‌ను ముంబైకి అమ్మేసింది. షమి, జంపా, రాహుల్ చాహర్‌తో పాటు 8 మందిని సన్‌రైజర్స్ హైదరాబాద్.. స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, ఇన్‌గ్లి్‌స సహా ఐదుగురిని పంజాబ్ కింగ్స్.. హసరంగ, తీక్షణ, ఫరూఖీ సహా 8 మందిని రాజస్థాన్.. టోప్లే, కర్ణ్‌శర్మ, ఆంధ్ర పేసర్ పీఎస్‌ఎన్ రాజు సహా 9 మందిని ముంబై.. ఆకాశ్‌దీప్, బిష్ణోయ్, మిల్లర్‌లను లఖ్‌నవూ.. లివింగ్‌స్టోన్, ఎన్‌గిడి, మయాంక్ అగర్వాల్‌లను బెంగళూరు విడుదలజేశాయి.
ఫ్రాంచైజీల వద్ద మిగిలిన మొత్తం
కోల్‌కతా రూ. 64.30 కోట్లు
చెన్నై రూ. 43.40 కోట్లు
సన్‌రైజర్స్ రూ. 25.50 కోట్లు
లఖ్‌నవూ రూ. 22.95 కోట్లు
ఢిల్లీ రూ. 21.80 కోట్లు
బెంగళూరు రూ. 16.40 కోట్లు
రాజస్థాన్ రూ. 16.05 కోట్లు
గుజరాత్ రూ. 12.90 కోట్లు
పంజాబ్ రూ. 11.50 కోట్లు
ముంబై రూ. 2.75 కోట్లు
ఇవి కూడా చదవండి:
ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి