World Cup Finals: మహిళల వరల్డ్ కప్ ఫైనల్స్.. వర్షం ఆటంకం కానుందా..?
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:24 PM
వర్షం కారణంగా నేటి ఫైనల్స్‌కు ఆటంకాలు ఏర్పడితే ఓవర్లను కుదించి ఫలితాన్ని తేల్చేందుకు రిఫరీ ప్రయత్నించనున్నారు. లేని పక్షంలో రేపు రిజర్వ్ డే నాడు మరోసారి ఇరు జట్లు తలపడక తప్పదు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా, భారత్ రెండు జట్లూ మంచి ఫామ్‌లో ఉండటంతో నేడు జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షంతో ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది (World Cup Final Rain Forecast).
అక్యూవెదర్ ప్రకారం, ముంబైలో ఈ రోజు వర్షం పడేందుకు 63 శాతం అవకాశం ఉంది. పెద్ద గాలివాన పడే అవకాశం 13 శాతంగా ఉంది. వర్షంతో పలు మార్లు మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు నిర్వాహకులు రిజర్వ్ డేను కూడా కేటాయించారు. వరల్డ్ కప్ ఫైనల్ కోసం సోమవారం రిజర్వ్ డేగా నిర్ణయించారు. నేడు ఆట కుదరక విజేత ఎవరో తేలని పక్షంలో జట్లు సోమవారం మరోసారి తలపడాల్సి ఉంటుంది.
అయితే, నేడు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని మ్యాచ్ రిఫరీకి కచ్చితమైన ఆదేశాలు అందినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అవసరమైతే వర్షానికి అనుగుణంగా ఓవర్లను కుదించి ఫైనల్స్ మ్యాచ్‌ను ముగించాలని ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. నేటి ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల ఆటను కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక రేపు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడితే ఇరు దేశాల ట్రోఫీని పంచుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
అమ్మాయిలకు ఆల్ ది బెస్ట్.. భారత్‌లో 'దంగల్' మూమెంట్
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..