Ind Vs Aus 5th T20: నేడే ఆస్ట్రేలియాతో చివరి టీ20.. విజయానికి అడుగు దూరంలో భారత్
ABN , Publish Date - Nov 08 , 2025 | 08:35 AM
నేడు ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే టీ20 టోర్నీ భారత్ సొంతమవుతుంది. గాబా స్టేడియం పిచ్ పేసర్లకు అనుకూలం కావడంతో టీమిండియా పేసర్లపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో వన్డే టోర్నీలో విఫలమైన భారత్ టీ20 మ్యాచ్‌ల్లో మాత్రం మంచి పోరాటపటిమను కనబరుస్తోంది. మొత్తం ఐదు టీ20 మ్యాచుల్లో ఒకటి వర్షం కారణంగా రద్దు అయ్యింది. మిగతా మూడు మ్యాచుల్లో రెండింటిని భారత్ తన ఖాతాలో వేసుకుంది. నేడు బ్రిస్బేన్‌లో జరగనున్న చివరి మ్యాచ్‌లో కూడా గెలిస్తే టోర్నీ భారత్ కైవసం అవుతుంది. వన్డే టోర్నీలో పరాజయాన్ని టీమిండియా టీ20 విజయంతో భర్తీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో నేటి మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ టోర్నీలో విజయం టీమిండియాకు గొప్ప బూస్ట్ ఇస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు (Ind Vs Aus Fifth T20).
నిలకడ లేమితో భారత బ్యాటర్లు సతమతం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అభిమానులు బౌలర్లపై ఆశలు పెట్టుకున్నారు. స్పిన్‌తో పాటూ పేస్ బౌలింగ్‌లో టీమిండియా రాణిస్తుండటంతో నేటి మ్యాచ్‌పై అంచనాలు పెరిగాయి. బ్రిస్బేన్‌లో పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు జట్టుకు కీలకం కానున్నారు. బుమ్రా జోరుపై ఎలాంటి సందేహం లేదు. ఇక అర్ష్‌దీప్ ఇప్పటికే ఫామ్‌లో ఉండటం టీమిండియాకు సానుకూల అంశం. నాలుగో టీ20లో స్పిన్నర్లు రాణించిన విషయం తెలిసిందే.
అయితే, బ్యాటర్ల ఫామ్ సరిగా లేకపోవడం టీమిండియా అభిమానులను కలవరపెడుతోంది. ప్రధాన బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌లు ఇప్పటివరకూ భారీ స్కోర్లు చేసింది లేదు. దీంతో, అభిమానులు ఈ మ్యా్చ్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకూ టీ20ల్లో ఈ ఇద్దరూ కనీసం అర్ధసెంచరీ కూడా చేయని విషయం తెలిసిందే.
ఇక నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే బ్యాటర్లు విజృంభించక తప్పదు. ట్రావిస్ హెడ్ లేని లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత కెప్టెన్ మిచెల్ మార్ష్, స్టాయినిస్, టిమ్ డేవిడ్‌పై ఉంది. హేజిల్‌వుడ్ అందుబాటులో లేకపోవడంతో ఆస్ట్రేలియా బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. దీంతో, జట్టును విజయతీరాలకు చేర్చాల్సిన భారం బ్యాటర్లపై మరింత పెరిగింది. నేటి మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గాబా స్టేడియంలో మధ్యాహ్నం 1.45కు ప్రారంభమవుతుంది.
ఇవి కూడా చదవండి
Hockey India: హాకీ ఇండియా సెంచరీ
2029 Womens World Cup: వచ్చేసారి పది జట్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి