Share News

India Versus South Africa 2nd Test: మనదే కాస్త పైచేయి

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:45 AM

ఈడెన్‌ గార్డెన్స్‌ మాదిరి కాకుండా సిరీస్‌ నిర్ణాయక రెండో టెస్టులో అటు బ్యాటు.. ఇటు బంతి సమతూకంతో నిలిచింది. దీంతో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఈ రెండో టెస్టు తొలి రోజున ఇరువురి ఆధిపత్యం...

India Versus South Africa 2nd Test: మనదే కాస్త పైచేయి

రాణించిన భారత బౌలర్లు

కుల్దీప్‌నకు మూడు వికెట్లు

రెండో టెస్టు

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 247/6

గువాహటి: ఈడెన్‌ గార్డెన్స్‌ మాదిరి కాకుండా సిరీస్‌ నిర్ణాయక రెండో టెస్టులో అటు బ్యాటు.. ఇటు బంతి సమతూకంతో నిలిచింది. దీంతో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఈ రెండో టెస్టు తొలి రోజున ఇరువురి ఆధిపత్యం కనిపించింది. కానీ ఆఖరి సెషన్‌లో చకచకా వికెట్లు తీసిన భారత బౌలర్లు కాస్త పైచేయి ప్రదర్శించారు. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/48)తో పాటు ఇతర బౌలర్లు కూడా ప్రత్యర్థిని దెబ్బ కొట్ట్టారు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 247/6 స్కోరుతో నిలిచింది. వెలుతురులేమితో మరో ఎనిమిది ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను ముగించారు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (49), కెప్టెన్‌ బవుమా (41), మార్‌క్రమ్‌ (38), రికెల్టన్‌ (35) రాణించారు. ముత్తుస్వామి (25), వెరీన్‌ (1) క్రీజులో ఉన్నారు.

శుభారంభంతో..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీల ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు మార్‌క్రమ్‌, రికెల్టన్‌ ఆత్మవిశ్వాసంతో ఆరంభించారు. ఈడెన్‌తో పోలిస్తే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో వీరికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. వాస్తవానికి మార్‌క్రమ్‌ నాలుగు పరుగుల వద్దే వెనుదిరగాల్సింది. బుమ్రా ఓవర్‌లో అతడిచ్చిన సులువైన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో రాహుల్‌ వదిలేశాడు. అటు రికెల్టన్‌ అడపాదడపా బౌండరీలతో ఆధిపత్యం చాటుకున్నాడు. కాస్త కుదురుకున్నాక మార్‌క్రమ్‌ సైతం నితీశ్‌ ఓవర్‌లో రెండు ఫోర్లతో వేగం పెంచాడు. అయితే విసిగిస్తున్న ఈ జోడీకి చెక్‌ పెడుతూ.. 27వ ఓవర్‌లో మార్‌క్రమ్‌ను బుమ్రా బౌల్డ్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే స్కోరుపై ఆటగాళ్లు టీ బ్రేక్‌కు వెళ్లారు. ఇక రెండోసెషన్‌ ఆరంభ ఓవర్‌లోనే మరో ఓపెనర్‌ రికెల్టన్‌ను స్పిన్నర్‌ కుల్దీప్‌ అవుట్‌ చేశాడు. ఈ దశలో స్టబ్స్‌, బవుమా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో సఫారీలు 156/2 పటిష్ట స్కోరుతో లంచ్‌ సెషన్‌కు వెళ్లారు.


బౌలర్ల జోరు: రెండు సెషన్ల పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్లు మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నా.. చివరి సెషన్‌లో స్పిన్నర్లు పట్టు బిగించారు. ఆరంభంలోనే బవుమాను జడేజా అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే ప్రమాదకర స్టబ్స్‌ను కుల్దీప్‌ దెబ్బతీయడంతో పరుగు తేడాతో అతడు అర్ధసెంచరీని కోల్పోయాడు. ఇక సిరాజ్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించిన ముల్డర్‌ (13)ను కూడా కుల్దీప్‌ వెనక్కి పంపాడు. ఈ దశలో 13 ఓవర్ల పాటు జోర్జి, ముత్తుస్వామి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ముఖ్యంగా జోర్జి భారీ షాట్లతో బౌండరీలు సాధిస్తూ ఒత్తిడి పెంచాడు. కానీ ఆట ఆఖరి ఓవర్‌లో సిరాజ్‌ అతడిని పెవిలియన్‌కు చేర్చగా.. ఆరో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

స్కోరుబోర్డు

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌:

మార్‌క్రమ్‌ (బి) బుమ్రా 38, రికెల్టన్‌ (సి) పంత్‌ (బి) కుల్దీప్‌ 35, స్టబ్స్‌ (సి) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 49, బవుమా (సి) జైస్వాల్‌ (బి) జడేజా 41, డి జోర్జి (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 28, ముల్డర్‌ (సి) జైస్వాల్‌ (బి) కుల్దీప్‌ 13, ముత్తుస్వామి (బ్యాటింగ్‌) 25, వెరీన్‌ (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం: 81.5 ఓవర్లలో 247/6. వికెట్ల పతనం: 1-82, 2-82, 3-166, 4-187, 5-201, 6-246. బౌలింగ్‌: బుమ్రా 17-6-38-1, సిరాజ్‌ 17.5-3-59-1, నితీశ్‌ 4-0-21-0, సుందర్‌ 14-3-36-0, కుల్దీప్‌ 17-3-48-3, జడేజా 12-1-30-1.

1

ఓ ఇన్నింగ్స్‌లో టాప్‌-4 బ్యాటర్లు 35+ పరుగులు సాధించినా ఒక్కరూ అర్ధసెంచరీ చేయలేకపోవడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి.

2

కెప్టెన్‌గా బవుమా 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత వేగం (20వ ఇన్నింగ్స్‌)గా ఈ ఫీట్‌ సాధించిన రెండో దక్షిణాఫ్రికా సారథిగా డుడ్లే నర్స్‌ సరసన బవుమా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం

ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Nov 23 , 2025 | 06:45 AM