India Faces a Major Challenge as South Africa: సఫారీలతో సవాల్
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:49 AM
భారత పర్యటనకు వచ్చే ఏ జట్టయినా ఇక్కడి పిచ్‌లపై స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతుంటుంది. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికా రూపంలో భారత జట్టుకే కఠిన పరీక్ష ఎదురుకానుంది...
తొలి టెస్టు బరిలో భారత్
కోల్‌కతా: భారత పర్యటనకు వచ్చే ఏ జట్టయినా ఇక్కడి పిచ్‌లపై స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతుంటుంది. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికా రూపంలో భారత జట్టుకే కఠిన పరీక్ష ఎదురుకానుంది. రెండు టెస్టుల సిరీ్‌సలో భాగంగా శుక్రవారం ఇరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు ఆరంభమవుతోంది. ఈ ఏడాది మొదట్లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీ్‌సను టీమిండియా 0-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. అందుకు కారణం.. ఆ జట్టులోని స్పిన్నర్లు ఎజాజ్ పటేల్, శాంట్నర్, ఫిలిప్స్. ఇక దక్షిణాఫ్రికా జట్టు సహజంగా పదునైన పేసర్లతో బలంగా ఉంటుందనే అభిప్రాయం ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లతో ఈ టీమ్ కూడా ప్రత్యర్థి జట్లను బెదరగొడుతోంది. ఆ బలంతోనే ఈ టూర్‌కు ముందు పాక్‌తో సిరీ్‌సను 1-1తో సమం చేసుకోగలిగింది. ఇందులో పాక్ కోల్పోయిన 39 వికెట్లలో స్పిన్ త్రయం కేశవ్ మహరాజ్, సైమన్ హార్మర్, ముత్తుస్వామి కలిపి 35 పడగొట్టడం విశేషం. అదే పాక్ స్పిన్నర్లు తమ సొంతగడ్డపైనే ఆడినా 21 వికెట్లు మాత్రమే తీశారు. అందుకే తాజా సిరీ్‌సను భారత ఉపఖండ జట్టుతోనే ఆడబోతున్నట్టుగా ఉందని టీమిండియా సహాయక కోచ్ టెన్ డష్కాటే అభిప్రాయపడ్డాడు. అయితే టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాకు భారత్‌లో మెరుగైన రికార్డు లేకపోవడం మనకు కాస్త సానుకూలాంశం. ఆ జట్టిక్కడ టెస్టు గెలిచి 15 ఏళ్లు కావడం గమనార్హం. అంతేకాకుండా చివరగా ఆడిన ఏడు టెస్టుల్లో ఆరింటిని కోల్పోయింది. అయినప్పటికీ ఈసారి వరల్డ్ టెస్టు చాంపియన్ హోదాలో ఉన్న సఫారీలను గిల్ సేన ఎలా ఎదుర్కొంటుందో వేచిచూడాల్సిందే.
బ్రెవిస్ స్థానంలో బవుమా
పాక్‌తో సిరీ్‌సను 1-1తో సమం చేసుకుని భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌ల్లో సమతూకంగా కనిపిస్తున్న ఈ జట్టు ఎలాగైనా భారత్‌ను ఓడించాలన్న పట్టుదలతో ఉంది. గాయంతో పాక్ పర్యటనకు దూరమైన కెప్టెన్ బవుమా ఇటీవలే భారత్ ‘ఎ’పై బరిలోకి దిగి ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. దీంతో డివాల్డ్ బ్రెవిస్ స్థానంలో తను ఆడనున్నాడు. మార్‌క్రమ్, రికెల్టన్, స్టబ్స్‌లతో టాపార్డర్ భారత పేసర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఐపీఎల్ ద్వారా వీరికి ఇక్కడి పిచ్‌లపై అవగాహన ఉంది. మిడిలార్డర్‌లో జోర్జి, బవుమా, వెరీన్ కీలకం కానున్నారు. యాన్సెన్, రబాడ పేస్ బాధ్యతలు తీసుకోనుండగా.. కేశవ్, హార్మర్, ముత్తుస్వామి స్పిన్‌తో ఇబ్బందిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
కుల్దీప్ ఆడేనా?
భారత్ ‘ఎ’ తరఫున శతకాల మోత మోగించిన కీపర్ ధ్రువ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడడం ఖాయమే. కీపర్‌గా పంత్ కొనసాగనున్నాడు. ఓపెనర్లుగా రాహుల్, జైస్వాల్‌లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్‌గా సాయి సుదర్శన్ ఆ తర్వాత కెప్టెన్ గిల్‌లతో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే బ్యాటింగ్ డెప్త్ కోసం ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ను ఆడించాలా? లేక స్పిన్నర్ కుల్దీ్‌పతో వెళ్లాలా? అనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. ఇటీవలి కాలంలో ఈడెన్ పిచ్ కాస్త పేసర్లకు సహకరిస్తుండడంతో మూడో పేసర్‌ను కూడా ఆడిస్తే ఎలా ఉంటుందన్న యోచనలోనూ ఉన్నారు. ఏదిఏమైనా శుక్రవారం ఉదయం పిచ్‌ను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని కెప్టెన్ గిల్ చెబుతున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్ తుది జట్టులో ఉండనుండగా.. కుల్దీప్ స్థానమే సందేహంలో ఉంది. భారత్ ఆడిన చివరి టెస్టులోనైతే ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. ఒకవేళ ముగ్గురు పేసర్లు అనుకుంటే బుమ్రా, సిరాజ్‌కు జతగా ఆకాశ్ దీప్‌ను ఆడించవచ్చు.