India Versus South Africa 2025: రోజంతా నిలుస్తారా
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:55 AM
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఓటమి తప్పేలా లేదు. ఇక జట్టు పోరాటమంతా డ్రా కోసమే. భారత బ్యాటర్లు బేలగా మారిన పిచ్‌పై నాలుగో రోజున దక్షిణాఫ్రికా మాత్రం అదరగొట్టింది. ప్రత్యర్థిని...
డ్రానందమైనా.. దక్కాలి!
భారత్ లక్ష్యం 549
ప్రస్తుతం 27/2
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 260/5 డిక్లేర్
రెండో టెస్టులో భారత్ విజయం ఇక అసాధ్యమే. 549 పరుగుల భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన పంత్ సేన 30 రన్స్ అయినా చేయకముందే ఓపెనర్లను కోల్పోయింది. ఇక బుధవారం ఆఖరి రోజున 8 వికెట్ల సహాయంతో చేయాల్సిన పరుగులు 522. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఆటతీరు చూస్తుంటే ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కాదు కదా.. కనీసం రోజంతా నిలిచి డ్రా చేసుకున్నా గొప్పే అనేలా ఉంది పరిస్థితి. మరోవైపు పాతికేళ్ల తర్వాత భారత గడ్డపై క్లీన్‌స్వీ్‌ప కోసం సఫారీలు ఉవ్విళ్లూరుతున్నారు.
గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఓటమి తప్పేలా లేదు. ఇక జట్టు పోరాటమంతా డ్రా కోసమే. భారత బ్యాటర్లు బేలగా మారిన పిచ్‌పై నాలుగో రోజున దక్షిణాఫ్రికా మాత్రం అదరగొట్టింది. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా బరిలోకి దిగిన సఫారీలు తమ రెండో ఇన్నింగ్స్‌ను 260/5 స్కోరు వద్ద డిక్లేర్ చేశారు. దీంతో ఆ జట్టుకు 548 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. స్టబ్స్ (94) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. డి జోర్జి (49), రికెల్టన్ (35), ముల్డర్ (35 నాటౌట్) మార్‌క్రమ్ (29) రాణించారు. స్పిన్నర్ జడేజాకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 549 పరుగుల ఛేదనలో భారత్ మంగళవారం ఆట ముగిసే సమయానికి 15.5 ఓవర్లలో 27/2 స్కోరుతో నిలిచింది. జైస్వాల్ (13), రాహుల్ (6) నిరాశపర్చారు. క్రీజులో ఉన్న కుల్దీప్ (4 బ్యాటింగ్), సుదర్శన్ (2 బ్యాటింగ్) పరుగులు తీసేందుకు చెమటోడ్చుతున్నారు. విజయం కోసం భారత్ మరో 522 పరుగు లు చేయాల్సి ఉండగా, ఆఖరి రోజును అజేయంగా ముగించి డ్రా చేసుకోగలుగుతారా? అనేది వేచిచూడాల్సిందే.
తొలి సెషన్‌లో మూడు వికెట్లు
26/0 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నిం గ్స్ ఆరంభించిన సఫారీలను భారత బౌలర్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. తొలి సెషన్‌లో మూడు వికెట్లు కోల్పోయినా 107 పరుగులు రాబట్టి తమ ఆధిక్యాన్ని 395 పరుగులకు చేర్చారు. ఓపెనర్లు రికెల్టన్, మార్‌క్రమ్ తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ ఇద్దరినీ జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. కాసేపటికే కెప్టెన్ బవుమా (3)ను మరో స్పిన్నర్ సుందర్ అవుట్ చేశాడు. కానీ స్టబ్స్, డి జోర్జి మాత్రం రిస్కీ షాట్లకు వెళ్లకుండా సెషన్‌ను ముగించారు.
స్టబ్స్-డిజోర్జి శతక భాగస్వామ్యం: ఇక విరామం తర్వాత భారత బౌలర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. స్టబ్స్-డి జోర్జి జోడీ స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొంటూ స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో ఆకట్టుకున్నారు. స్టబ్స్‌కు జోర్జి తోడు కావడంతో మూడో వికెట్‌కు 101 పరుగుల భారీ భాగస్వామ్యం లభించింది. అయితే జోర్జిని 59వ ఓవర్‌లో జడేజా ఎల్బీ చేశాడు. ఈ సెషన్‌లో లభించిన ఏకైక వికెట్ ఇదే. కాసేపటికే స్టబ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆధిక్యం కూడా 500కు చేరింది. మరోవైపు అప్పటికే అలిసిపోయినట్టు కనిపించిన భారత ఫీల్డర్లు.. ప్రత్యర్థి డిక్లేర్ చేస్తుందేమోనని ఎదురుచూశారు. కానీ కెప్టెన్ బవుమా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆటగాళ్లంతా లంచ్ బ్రేక్‌కు వెళ్లారు.
శతకానికి ఆరు పరుగుల దూరంలో..: 508 పరుగుల ఆధిక్యం ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా డిక్లేర్ చేయకుండా ఆఖరి సెషన్‌ను ఆరంభించడం ఆశ్చర్యపరిచింది. మరోవైపు వేగంగా ఆడే క్రమంలో నితీశ్, జడేజా ఓవర్లను లక్ష్యంగా చేసుకుని స్టబ్స్ బౌండరీలు సాధించాడు. ఇంకో ఎండ్‌లో ముల్డర్ సైతం బౌలర్లను విసిగించాడు. అయితే 79వ ఓవర్‌లో సిక్సర్‌తో 90 రన్స్ దాటిన స్టబ్స్‌ను జడేజా బౌల్డ్ చేయడంతో శతకానికి 6 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. ఆ వెంటనే సఫారీల ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489;
భారత్ తొలి ఇన్నింగ్స్: 201;
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సిరాజ్ (బి) జడేజా 35, మార్‌క్రమ్ (బి) జడేజా 29, స్టబ్స్ (బి) జడేజా 94, బవుమా (సి) నితీశ్ (బి) సుందర్ 3, డి జోర్జి (ఎల్బీ) జడేజా 49, ముల్డర్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 78.3 ఓవర్లలో 260/5 డిక్లేర్; వికెట్ల పతనం: 1-59, 2-74, 3-77, 4-178, 5-260; బౌలింగ్: బుమ్రా 6-0-22-0, సిరాజ్ 5-1-19-0, జడేజా 28.3-3-62-4, కుల్దీప్ 12-0-48-0, సుందర్ 22-2-67-1, జైస్వాల్ 1-0-9-0, నితీశ్ 4-0-24-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 13, రాహుల్ (బి) హార్మర్ 6, సాయి సుదర్శన్ (బ్యాటింగ్) 2, కుల్దీప్ (బ్యాటింగ్) 4, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 15.5 ఓవర్లలో 27/2. వికెట్ల పతనం: 1-17, 2-21; బౌలింగ్: యాన్సెన్ 5-2-14-1, ముల్డర్ 4-1-6-0, హార్మర్ 3.5-2-1-1, కేశవ్ 3-1-5-0.
డిక్లరేషన్ ఎందుకంత ఆలస్యం?
దక్షిణాఫ్రికా ముందే డిక్లేర్ చేస్తుందని అంతా భావించారు. కానీ భారత ఫీల్డర్లను వీలైనంతవరకూ మైదానంలోనే ఉంచి వారు అలసిపోయేలా చేయాలన్న వ్యూహంతోనే సఫారీలు ఆలస్యంగా డిక్లేర్ చేశారట. భారత ఓపెనర్లిద్దరూ అవుటవడం చూస్తే బవుమా చేసింది కరెక్టేనని ఒప్పుకోవాలి. పైగా పిచ్ ఇంకా బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరిస్తుండడం కూడా ఆలస్యానికి ఓ కారణం. ఎలాగూ దక్షిణాఫ్రికా తొలి టెస్టులో గెలిచింది కాబట్టి, వారికి రెండో టెస్టును డ్రా చేసుకున్నా చాలు.
1
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో ఎక్కువ వికెట్లు (46) తీసిన బౌలర్‌గా అశ్విన్‌తో సమంగా నిలిచిన జడేజా. ఓవరాల్‌గా ఈ టీమ్‌పై 50+ వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్.
2
స్వదేశంలో భారత్‌కు 500+ పరుగుల లక్ష్యం ఎదురుకావడం ఇది రెండోసారి. 2004లో ఆసీస్ 543 పరుగుల టార్గెట్ విధించగా.. భారత్ 342 రన్స్ తేడాతో ఓడింది.
ఇవి కూడా చదవండి:
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!