Share News

India Eyes Comeback: సమమా.. సమర్పణమా?

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:37 AM

తొలి టెస్టులో చిత్తయిన భారత జట్టు.. ఇప్పుడు కెప్టెన్‌ గిల్‌ లేకుండానే సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. 0-1తో వెనుకబడిన టీమిండియా ఈ సిరీ్‌సను సమం చేయాలంటే నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఈ రెండో టెస్టులో గెలిచి తీరాల్సిందే....

India Eyes Comeback: సమమా.. సమర్పణమా?

  • కెప్టెన్‌ గిల్‌ దూరంసిరీ్‌సపై దక్షిణాఫ్రికా దృష్టి

  • నేటి నుంచి రెండో టెస్టు

గువాహటి: తొలి టెస్టులో చిత్తయిన భారత జట్టు.. ఇప్పుడు కెప్టెన్‌ గిల్‌ లేకుండానే సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. 0-1తో వెనుకబడిన టీమిండియా ఈ సిరీ్‌సను సమం చేయాలంటే నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఈ రెండో టెస్టులో గెలిచి తీరాల్సిందే. అందుకే కీపర్‌ రిషభ్‌ పంత్‌ నేతృత్వంలో బరిలోకి దిగబోతున్న టీమిండియా తీవ్ర ఒత్తిడిలోనే ఉంది. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ చాలా ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణించలేని పరిస్థితి నెలకొంది. మొదటి టెస్టులో టర్నింగ్‌ పిచ్‌పై సఫారీ స్పిన్నర్లు అదరగొట్టి ఆతిథ్య భారత్‌ను కంగుతినిపించారు. గువాహటిలోనూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న బవుమా సేన భారత గడ్డపై పాతికేళ్ల తర్వాత ఓ టెస్టు సిరీస్‌ను నెగ్గాలనే కసితో ఉంది. ఒకవేళ భారత్‌ ఈ టెస్టును కూడా కోల్పోతే కోచ్‌ గంభీర్‌పై విమర్శలు తప్పవు. ఇప్పటికే జట్టు భారత్‌లో ఆడిన చివరి ఆరు టెస్టుల్లో నాలుగింటిని ఓడిపోగా.. ఏడాదిలో రెండోసారి వైట్‌వా్‌షకు దగ్గరగా ఉంది.

కెప్టెన్‌ గిల్‌ దూరం కావడంతో అతడి స్థానంలో ఆడే ఆటగాడిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కళ్‌ మధ్య పోటీ నెలకొంది. జట్టు వర్గాల సమాచారం ప్రకారం సాయికే బెర్త్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది. తాత్కాలిక కెప్టెన్‌ పంత్‌ మాత్రం.. ఎవరాడేదీ బరిలోకి దిగే ఆటగాడికి తెలుసంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు. ఇక తొలి టెస్టులో భారత్‌ నుంచి ఒక్క అర్ధసెంచరీ కూడా నమోదుకాలేదు. ఓపెనర్‌ రాహుల్‌, సుందర్‌ మోస్తరుగా రాణించారు. జైస్వాల్‌, జురెల్‌, పంత్‌ బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. పిచ్‌ పరిస్థితిని బట్టి పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌కు చాన్స్‌ దక్కనుంది. అదే జరిగితే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ బెంచీకే పరిమితం కానున్నాడు. పేసర్లు బుమ్రా, సిరాజ్‌ ప్రభావం చూపగలుగుతున్నారు. జడేజా, కుల్దీప్‌ స్పిన్‌లో కీలకం కానున్నారు.


రబాడ అవుట్‌

గెలుపు జోరు మీదున్న సౌతాఫ్రికా సిరీ్‌సను చేజారనీయకూడదనే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా స్పిన్నర్‌ హార్మర్‌ భారత్‌కు ప్రమాదకరంగా మారాడు. ఈ టెస్టులోనూ జట్టు అతడిపైనే ఎక్కువగా ఆధారపడింది. ఇంకో స్పిన్నర్‌ కేశవ్‌ అతడికి అండగా ఉంటాడు. మరోవైపు గాయంతో బాధపడుతున్న ప్రధాన పేసర్‌ రబాడ ఈ మ్యాచ్‌కూ దూరం కానున్నాడు. అతడు లేని లోటును భర్తీ చేస్తూ మరో పేసర్‌ యాన్సెన్‌ ఆరంభంలోనే వికెట్లు తీస్తూ భారత్‌ను ఒత్తిడిలోకి నెడుతున్నాడు. ఇక ఆకట్టుకోలేకపోతున్న బాష్‌ స్థానంలో పేసర్‌ ఎన్‌గిడిని తీసుకోవచ్చు. అయితే సఫారీ బ్యాటర్లలో కెప్టెన్‌ బవుమా ఒక్కడే పోరాడుతున్నాడు. టాపార్డర్‌ అండగా నిలవాల్సి ఉంది. మిడిలార్డర్‌లో జోర్జి, స్టబ్స్‌ నిలకడగా ఆడితే భారీ స్కోరు ఖాయం.

టెస్టు చరిత్రలో తొలిసారి..

148 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో మొదటిసారి లంచ్‌ కంటే ముందే ఇక్కడ టీ విరామం తీసుకోనున్నారు. అంటే ఉదయం 11 గంటల నుంచి 11.20 వరకూ టీ, తర్వాత మధ్యాహ్నం 1.20 నుంచి 2 గంటలవరకూ భోజన విరామం ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలు త్వరగా అవుతాయి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు.


జట్టును వీడిన శుభ్‌మన్‌

మెడ నొప్పితో బాధపడుతున్న కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ శుక్రవారం నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలమయ్యాడు. దీంతో రెండో టెస్టుకు దూరమైన తను జట్టును వీడి ముంబైకి చేరుకున్నాడు. అక్కడే కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత మరోసారి వైద్యులను సంప్రదించనున్నాడు. మరోవైపు ఈనెల 30 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది. అప్పటివరకు అతను కోలుకుంటాడా? లేదా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: జైస్వాల్‌, రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సాయి సుదర్శన్‌, జురెల్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), జడేజా, నితీశ్‌/అక్షర్‌, కుల్దీప్‌, బుమ్రా, సిరాజ్‌. దక్షిణాఫ్రికా: రికెల్టన్‌, మార్‌క్రమ్‌, ముల్డర్‌, బవుమా (కెప్టెన్‌), జోర్జి, స్టబ్స్‌, వెరీన్‌, యాన్సెన్‌, ఎన్‌గిడి, హార్మర్‌, కేశవ్‌ మహారాజ్‌.

పిచ్‌, వాతావరణం

రెండో టెస్టు పిచ్‌ ఎలా స్పందిస్తుందనే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ఈ మైదానంలో ఇదే మొట్టమొదటి టెస్టు కాగా.. పిచ్‌ను ఎర్ర మట్టితో రూపొందించారు. కాస్త పచ్చిక కనిపిస్తుండడంతో దాన్ని కత్తిరిస్తారా? లేదా? తెలియాల్సి ఉంది. ఒకవేళ కట్‌ చేస్తే ఆరంభంలో బౌన్స్‌కు అవకాశమిచ్చినా.. ఆ తర్వాత స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇక ఈశాన్య భారతంలో సూర్యాస్తమయం త్వరగా ఉంటుంది కాబట్టి మ్యాచ్‌ అర్ధగంట ముందే..అంటే 9 గంటలకే ఆరంభం కానుంది. భారత క్రికెట్‌ చరిత్రలో ఈ కొత్త స్టేడియం 30వ టెస్టు వేదికగా నిలవబోతోంది.

Updated Date - Nov 22 , 2025 | 08:00 AM