India Versus South Africa: యాన్సెన్ వేట మన బ్యాట్లు బోల్తా
ABN , Publish Date - Nov 25 , 2025 | 03:16 AM
బ్యాటర్ల నిర్లక్ష్యంతో సొంతగడ్డపై భారత్‌కు మరో ఘోర పరాభవం తప్పేట్టు లేదు. మార్కో యాన్సెన్ (6/48) షార్ట్ బాల్స్ వ్యూహానికి మనోళ్లు బెంబేలెత్తారు. దీంతో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకొన్న పర్యాటక దక్షిణాఫ్రికా...
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 201 ఆలౌట్
రాణించిన జైస్వాల్, సుందర్
314 రన్స్ ఆధిక్యంలో దక్షిణాఫ్రికా
సుదర్శన్ నిర్లక్ష్యం.. విచక్షణలేని జురెల్.. బాధ్యతలేని పంత్.. వెరసి బ్యాటింగ్‌లో మరోసారి కుప్పకూలిన టీమిండియా.. సొంతగడ్డపై మరో వైట్‌వా్‌షకు చేరువైంది. బ్యాట్‌తో అదరగొట్టిన యాన్సెన్.. బౌలింగ్‌లోనూ చెలరేగి షార్ట్ బాల్స్‌తో భారత మిడిలార్డర్ వెన్నువిరిచాడు. దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసిన చోట.. ఘనత వహించిన మన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. టెయిలెండర్ కుల్దీప్ చూపిన పట్టుదలను కూడా ప్రదర్శించలేక పోయారు. దీంతో సొంతగడ్డపైనే ఫాలో-ఆన్‌లో పడిన ఘోర దుస్థితి..! ప్రత్యర్థి కెప్టెన్ వద్దనుకొన్నాడు కాబట్టి ఆ అవమానం తప్పింది. అయితే, భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలవడమే అద్భుతం అనుకొన్న సఫారీలకు.. అరుదైన క్లీన్‌స్వీ్‌ప ఊరిస్తోంది..!!
గువాహటి: బ్యాటర్ల నిర్లక్ష్యంతో సొంతగడ్డపై భారత్‌కు మరో ఘోర పరాభవం తప్పేట్టు లేదు. మార్కో యాన్సెన్ (6/48) షార్ట్ బాల్స్ వ్యూహానికి మనోళ్లు బెంబేలెత్తారు. దీంతో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకొన్న పర్యాటక దక్షిణాఫ్రికా రెండో టెస్ట్‌లో పట్టుబిగించింది. మరో రెండు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో ఏదో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా క్లీన్‌స్వీ్‌పను తప్పించుకోవడం కష్టమే..! ఆటకు రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 9/0తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 201 పరుగులకు కుప్పకూలింది. జైస్వాల్ (58), వాషింగ్టన్ సుందర్ (48) మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. సైమన్ హార్మర్ మూడు వికెట్లు పడగొట్టాడు. మార్‌క్రమ్ ఏకంగా ఐదు క్యాచ్‌లు పట్టి భారత పతనంలో కీలక భూమిక పోషించాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు 489కి భారత్ 288 పరుగులు వెనుకబడింది. అయితే, ప్రత్యర్థిని ఫాలో-ఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 26/0 స్కోరు చేసింది. సోమవారం ఆట ఆఖరుకు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (13), మార్‌క్రమ్ (12) క్రీజులో ఉన్నారు. మొత్తంగా సఫారీలు 314 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. సుమారు ఇంకో 40-50 ఓవర్లు ఆడి 500 రన్స్‌కు దగ్గర్లో లక్ష్యాన్ని టీమిండియా ముందుంచే అవకాశం ఉంది.
ఆరంభం నిలకడగా..:
తొలి సెషన్‌లో భారత్ నిలకడగా స్కోరు చేసినా.. యాన్సెన్ దెబ్బకు ఒక్కసారిగా తడబడింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు జైస్వాల్, రాహుల్ (22) జట్టుకు శుభారంభాన్ని అందించారు. అయితే, స్పిన్నర్ కేశవ్ బౌలింగ్‌లో బౌన్స్ అయిన బంతిని ఆడే క్రమంలో రాహుల్ స్లిప్స్‌లో క్యాచిచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ, జైస్వాల్, సాయి సుదర్శన్ (15) రెండో వికెట్‌కు 30 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకొన్న జైస్వాల్.. హార్మర్ బౌలింగ్‌లో భారీషాట్ ఆడే క్రమంలో అవుటవడంతో టీమిండియా బ్యాటింగ్ కుదుపులకు లోనైంది. బ్యాటర్ల బాధ్యతారాహిత్యమైన షాట్ల కారణంగా కేవలం 27 పరుగుల తేడాతో.. అంటే 95/1 నుంచి 122/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. హార్మర్ బౌలింగ్‌లో పేలవ షాట్ ఆడిన సుదర్శన్ క్యాచవుట్ కాగా.. జురెల్ (0)ను డకౌట్ చేసిన యాన్సెన్ భారత్ పతనానికి నాందిపలికాడు. కెప్టెన్ రిషభ్ పంత్ (7), జడేజా (6) కొంతసేపు క్రీజులో నిలవడంతో టీ సమయానికి భారత్ 102/4తో నిలిచింది.
మిడిల్ ఢమాల్:
టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. ఎనిమిదో వికెట్‌కు 72 పరుగులు జోడించిన సుందర్, కుల్దీప్ (19) టీమ్ స్కోరును 200 మార్క్ దాటించారు. రెండో సెషన్ ఆరంభంలోనే యాన్సెన్‌పై ఎదురుదాడి చేద్దామనుకొన్న పంత్ చెత్తగా ఆడి వికెట్ పారేసుకొన్నాడు. ముందుకు వచ్చి ఆడే క్రమంలో మిస్ టైమ్ కావడంతో ఎడ్జ్ తీసుకొన్న బంతి కీపర్ చేతుల్లో పడింది. నితీశ్ (10), సీనియర్ బ్యాటర్ జడేజాను యాన్సెన్ షార్ట్ బాల్స్‌తో బోల్తా కొట్టించాడు. అయితే, సుందర్, కుల్దీప్ ఎదురు నిలవడంతో టీమిండియా 174/7తో లంచ్‌కు వెళ్లింది. మూడో సెషన్‌లో మరో 27 పరుగులు జోడించిన టీమిండియా మిగతా మూడు వికెట్లు చేజార్చుకొంది. ఫిఫ్టీకి చేరువలో ఉన్న సుందర్‌ను హార్మర్ క్యాచవుట్ చేయగా.. కుల్దీప్, బుమ్రా (5)ను వెనక్కిపంపిన యాన్సెన్ భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489 ఆలౌట్;
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 58, రాహుల్ (సి) మార్‌క్రమ్ (బి) కేశవ్ 22, సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) హార్మర్ 15, జురెల్ (సి) కేశవ్ (బి) యాన్సెన్ 0, పంత్ (సి) వెరిన్నే (బి) యాన్సెన్ 7, జడేజా (సి) మార్‌క్రమ్ (బి) యాన్సెన్ 6, నితీశ్ (సి) మార్‌క్రమ్ (బి) యాన్సెన్ 10, సుందర్ (సి) మార్‌క్రమ్ (బి) హార్మర్ 48, కుల్దీప్ (సి) మార్‌క్రమ్ (బి) యాన్సెన్ 19, బుమ్రా (సి) వెరిన్నే (బి) యాన్సెన్ 5, సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 83.5 ఓవర్లలో 201 ఆలౌట్; వికెట్ల పతనం: 1-65, 2-95, 3-96, 4-102, 5-105, 6-119, 7-122, 8-194, 9-194; బౌలింగ్: యాన్సెన్ 19.5-5-48-6, ముల్డర్ 10-5-14-0, కేశవ్ మహరాజ్ 15-1-39-1, హార్మర్ 27-6-64-3, మార్‌క్రమ్ 10-1-26-0, ముత్తుసామి 2-0-2-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్:
రికెల్టన్ (బ్యాటింగ్) 13, మార్‌క్రమ్ (బ్యాటింగ్) 12; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 8 ఓవర్లలో 26/0; బౌలింగ్: బుమ్రా 3-0-13-0, సిరాజ్ 3-1-8-0, జడేజా 1-0-2-0, కుల్దీప్ 1-0-2-0.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News