Ind vs Pak: భారత్ vs పాకిస్తాన్.. గత రికార్డులు, పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉండబోతోంది..!
ABN , Publish Date - Feb 22 , 2025 | 09:25 PM
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక సమరానికి రంగం సిద్ధమవుతోంది. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ (Ind vs Pak) క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది (Champions Trophy).
ఆదివారం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం పూర్తి స్పష్టంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. మ్యాచ్ అంతటా ఎండ ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక, భారత్, పాక్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఐదు సార్లు తలపడ్డాయి. వాటిల్లో భారత్ 2 మ్యాచ్‌ల్లోనూ, పాకిస్తాన్ 3 మ్యాచ్‌ల్లోనూ గెలిచాయి. చివరిసారిగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్‌ను 180 పరుగుల తేడాతో ఓడించి పాకిస్తాన్ ట్రోఫీని గెలుచుకుంది.
ఇక, వన్డేల్లో భారత్, పాక్ జట్లు ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. వాటిల్లో భారత్ 57 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాకిస్తాన్ 73 సార్లు విజేతగా నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. వన్డే ప్రపంచకప్, టీ-20 ప్రపంచకప్‌లలో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్‌పై భారత్ రికార్డు అంత ఘనంగా లేదు. ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ కనుక ఓడిపోతే ఆ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..