Share News

Carlos Alcaraz French Open 2025: అల్కారజ్‌ వచ్చేశాడు

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:49 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కారజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్కారజ్‌ ప్రత్యర్థి..ఎనిమిదో సీడ్‌ లొరెంజో ముసేటి (ఇటలీ) తొడ గాయంతో మ్యాచ్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు.

Carlos Alcaraz French Open 2025: అల్కారజ్‌ వచ్చేశాడు

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు స్పెయిన్‌ స్టార్‌

పారిస్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కారజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్కారజ్‌ ప్రత్యర్థి..ఎనిమిదో సీడ్‌ లొరెంజో ముసేటి (ఇటలీ) తొడ గాయంతో మ్యాచ్‌ నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. అప్పటికి రెండో సీడ్‌, స్పెయిన్‌ స్టార్‌ అల్కారజ్‌ 4-6, 7-6 (3), 6-0, 6-2తో ముందంజలో నిలిచాడు. రొలాండ్‌ గారోస్‌ తుదిపోరులో చోటు ఖాయం చేసుకున్న దరిమిలా..ఓపెన్‌ ఎరాలో వరుసగా నాలుగేళ్లు ఏదేని గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన పిన్న వయసు ఆటగాడిగా 22 ఏళ్ల అల్కారజ్‌ రికార్డు సృష్టించాడు. ఈక్రమంలో మాట్స్‌ విలాండర్‌, జాన్‌ బోర్గ్‌, రఫెల్‌ నడాల్‌, బోరిస్‌ బెకర్‌ సరసన కార్లోస్‌ చేరాడు. అల్కారజ్‌తో సెమీఫైనల్లో తొలి సెట్‌ను ముసేటి గెలిచాడు. కానీ పుంజుకున్న అల్కారజ్‌ రెండో సెట్‌ను టై బ్రేకర్‌లో సొంతం చేసుకొని స్కోరును సమం చేశాడు. ఆపై విజృంభించి మూడో సెట్‌లో అలవోకగా నెగ్గాడు. నాలుగో సెట్‌లోనూ అల్కారజ్‌ ముందంజలో నిలవగా.. తొడ కండరాల గాయంతో విలవిల్లాడిన ముసేటి మ్యాచ్‌ను కొనసాగించ లేకపోయాడు. రెండున్నర గంటలు సాగిన ఈ పోరులో ముసేటి 2 ఏస్‌లు సంధించగా, అల్కారజ్‌ ఒకటికే పరిమితమయ్యాడు. అయితే ముసేటి మూడు డబుల్‌ ఫాల్ట్‌లు, అల్కారజ్‌ రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. అనవసర తప్పిదాలలో ముసేటి (33), అల్కారజ్‌ (32) దాదాపు సమంగా నిలిచారు.


‘డబుల్‌’ దిశగా సారా: ఇటలీ స్టార్‌ సారా ఎర్రాని ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ‘డబుల్‌’ సాధించే దిశగా దూసుకెళుతోంది. గురువారం మిక్స్‌డ్‌ డబుల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన సారా.. తన దేశానికే చెందిన ఆండ్రియా వవసోరితో కలిసి మహిళల డబుల్స్‌లోనూ ఫైనల్‌ చేరింది. సెమీఫైనల్లో మూడోసీడ్‌ సారా/ఆండ్రియా ద్వయం 6-0, 6-1తో రష్యాకు చెందిన నాలుగో సీడ్‌ జంట మిర్రా ఆండ్రీవా/ష్నిదెర్‌పై గెలిచింది. మరో సెమీస్‌లో అలెగ్జాండ్రా కూనిక్‌ (సెర్బియా)/అన్నా డానిలినా (రష్యా) జంట 6-7(7), 6-3, 7-5తో ఎకెరి (నార్వే)/హొజుమి (జపాన్‌) జోడీని ఓడించి సారా ద్వయంతో ఫైనల్‌ఫైట్‌కు సిద్ధమైంది.

Updated Date - Jun 07 , 2025 | 05:51 AM