Share News

Vaibhav Suryavanshi: పిల్లాడు పిడుగల్లే..

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:10 AM

ఇంకా పాలబుగ్గల పసివాడే.. అయితేనేం అంతర్జాతీయస్థాయి బౌలర్లను చెడుగుడు ఆడేశాడు 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ. కలా.. నిజమా? అనే రీతిన సాగిన ఈ చిచ్చర పిడుగు బ్యాటింగ్‌ విన్యాసాలను కళ్లారా తిలకించాల్సిందే....

Vaibhav Suryavanshi: పిల్లాడు  పిడుగల్లే..

నేటి మ్యాచ్‌

ఢిల్లీ X కోల్‌కతా

వేదిక : ఢిల్లీ, రా.7.30 నుంచి

వైభవ్‌ సూర్యవంశీ 38 బంతుల్లో7 ఫోర్లు,

11 సిక్సర్లతో 101 పరుగులు

35 బంతుల్లో శతకంతో సూర్యవంశీ విధ్వంసం

పిన్నవయసులో టీ20 సెంచరీ

ఐపీఎల్‌లో గేల్‌ తర్వాత వైభవే..

8 వికెట్ల తేడాతో గుజరాత్‌ చిత్తు

రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ రేసులోనే..!


జైపూర్‌: ఇంకా పాలబుగ్గల పసివాడే.. అయితేనేం అంతర్జాతీయస్థాయి బౌలర్లను చెడుగుడు ఆడేశాడు 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ. కలా.. నిజమా? అనే రీతిన సాగిన ఈ చిచ్చర పిడుగు బ్యాటింగ్‌ విన్యాసాలను కళ్లారా తిలకించాల్సిందే. గుజరాత్‌ బౌలర్లు ఇషాంత్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌, రషీద్‌, సుందర్‌, కరీం జనత్‌ ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 రన్స్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఔరా.. అనిపించాడు. టీ 20 ఫార్మాట్‌లో 14 ఏళ్ల 32 రోజుల పిన్నవయసులో సెంచరీ సాధించిన ఆటగాడయ్యాడు. అలాగే ఐపీఎల్‌లో గేల్‌ (30) తర్వాత తక్కువ (35) బంతుల్లో శతక బాదిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచిన వైభవ్‌ ఆటలో బౌండరీల రూపంలోనే 94 పరుగులు రావడం మరో విశేషం. అతడి ధాటికి వరుసగా ఐదు ఓటముల తర్వాత రాజస్థాన్‌ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆర్‌ఆర్‌ అధికారికంగా ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించేది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. గిల్‌ (84), బట్లర్‌ (50 నాటౌట్‌), సాయి సుదర్శన్‌ (39) రాణించారు. తీక్షణకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 15.5 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసి గెలిచింది. జైస్వాల్‌ (40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 నాటౌట్‌), పరాగ్‌ (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 నాటౌట్‌) వేగంగా ఆడారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా వైభవ్‌ నిలిచాడు.


ఆది నుంచీ బాదుడే..: ఈ పిచ్‌పై 210 పరుగుల ఛేదన కష్టమే అనుకున్న చోట.. రాజస్థాన్‌ స్కోరు ఆరంభం నుంచే రాకెట్‌ వేగంతో పోటీపడింది. ఓపెనర్లు వైభవ్‌, జైస్వాల్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ముఖ్యంగా వైభవ్‌ నాలుగో ఓవర్‌ నుంచి సాగించిన విధ్వంసం 12వ ఓవర్‌ వరకు నిరంతరాయంగా సాగింది. ఈ దశలో గుజరాత్‌ బౌలర్లు అతడికి బంతి వేసేందుకే జంకాల్సి వచ్చింది. ముందుగా ఇషాంత్‌ను లక్ష్యంగా చేసుకున్న తను 6,6,4,6,4తో 28 పరుగులు రాబట్టాడు. దీంతో జీటీ శిబిరం షాక్‌కు గురైంది. ఆ వెంటనే స్పిన్నర్‌ సుందర్‌ను దించగా అతడినీ వదలకుండా 4,6,6,4తో 21 రన్స్‌ రాబట్టడమే కాకుండా 17 బంతుల్లోనే ఫిఫ్టీని కూడా పూర్తి చేశాడు. అటు పవర్‌ప్లేలో ఆర్‌ఆర్‌ 87 పరుగులతో నిలిచింది. ఐపీఎల్‌లో ఈ జట్టుకిదే అత్యధికం. ఎనిమిదో ఓవర్‌లోనే స్కోరు వంద దాటేసింది. ఇక తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన పేసర్‌ కరీమ్‌కు వైభవ్‌ పీడకలే మిగిల్చాడు. అతడి మొదటి ఓవర్‌లోనే ఏ బంతినీ వదలకుండా 6,4,6,4,4,6తో 30 పరుగులు రాబట్టడంతో స్టేడియం హోరెత్తిపోయింది. అప్పటికి 94 పరుగులతో ఉన్న వైభవ్‌ రషీద్‌ ఓవర్‌లో భారీ సిక్సర్‌తోనే సెంచరీ పూర్తి చేయడం అబ్బురపరిచింది. చివరికి 12వ ఓవర్‌లో పేసర్‌ ప్రసిద్ధ్‌ అవుట్‌ చేయడంతో వైభవ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. అయితే అప్పటికే తొలి వికెట్‌కు 166 పరుగులు జత చేరడం విశేషం. ఆ తర్వాత రాణా (4) వికెట్‌ పడినా జైస్వాల్‌కు జత కలిసిన పరాగ్‌ సైతం వేగం కనబర్చాడు. దీంతో మరో 25 బంతులుండగానే ఈ భారీ ఛేదన పూర్తయ్యింది.


టాపార్డర్‌ షో: గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు గిల్‌, సాయి సుదర్శన్‌ మరోసారి మెరిశారు. ఇరువురి క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేయడం కూడా వీరికి కలిసివచ్చింది. అలాగే వన్‌డౌన్‌లో బట్లర్‌ బాదుడుకు స్కోరు 200 దాటేసింది. పవర్‌ప్లేలో గిల్‌-సాయిల అడపాదడపా బౌండరీలతో స్కోరు 53 పరుగులకు చేరింది. ఆ తర్వాత స్పిన్నర్‌ హసరంగ పరుగులను కట్టడి చేసినా యుధ్‌వీర్‌ ఓవర్‌లో గిల్‌ 4,6తో 13 రన్స్‌ అందించాడు. అలాగే 29 బంతుల్లోనే ఫిఫ్టీని కూడా పూర్తి చేశాడు. అయితే 11వ ఓవర్‌లో సుదర్శన్‌ను తీక్షణ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం గిల్‌కు జతగా బట్లర్‌ చేరడంతో స్కోరు రాకెట్‌ వేగంతో వెళ్లింది. పొదుపుగా బౌలింగ్‌ వేస్తున్న హసరంగను బట్లర్‌ బాదేశాడు. అతడి చివరి ఓవర్‌లో 6,6,4,6తో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. రెండో వికెట్‌కు 38 బంతుల్లోనే 74 పరుగులు జత చేరాక గిల్‌ను సైతం తీక్షణ పెవిలియన్‌కు చేర్చాడు. అటు బట్లర్‌ మాత్రం తన జోరును సాగిస్తూ 18వ ఓవర్‌లో 6,6,4తో 19 రన్స్‌ అందించాడు. సుందర్‌ (13), తెవాటియా (9) త్వరగానే అవుటైనా.. చివరి ఓవర్‌లో 13 రన్స్‌ రావడంతో స్కోరు 200 దాటింది. అలాగే బట్లర్‌ 26 బంతుల్లోనే సీజన్‌లో నాలుగో అర్ధసెంచరీని పూర్తి చేశాడు.


స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) పరాగ్‌ (బి) తీక్షణ 39; గిల్‌ (సి) పరాగ్‌ (బి) తీక్షణ 84; బట్లర్‌ (నాటౌట్‌) 50; సుందర్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) సందీప్‌ 13; తెవాటియా (ఎల్బీ) ఆర్చర్‌ 9; షారుక్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 209/4; వికెట్ల పతనం: 1-93, 2-167, 3-193, 4-202; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-49-1; తీక్షణ 4-0-35-2; యుధ్‌వీర్‌ 3-0-38-0; సందీప్‌ 4-0-33-1; పరాగ్‌ 1-0-14-0; హసరంగ 4-0-39-0.

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వీ జైస్వాల్‌ (నాటౌట్‌) 70, వైభవ్‌ సూర్యవంశీ (బి) ప్రసిద్ధ్‌ కృష్ణ 101, రాణా (ఎల్బీ) రషీద్‌ 4, పరాగ్‌ (నాటౌట్‌) 32, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం: 15.5 ఓవర్లలో 212/2, వికెట్లపతనం: 1-166, 2-171, బౌలింగ్‌: సిరాజ్‌ 2-0-24-0, ఇషాంత్‌ శర్మ 2-0-36-0, సుందర్‌ 1.5-0-34-0, ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-47-1, రషీద్‌ ఖాన్‌ 4-0-24-1, కరీమ్‌ జనత్‌ 1-0-30-0, సాయి కిషోర్‌ 1-0-16-0.


1

టీ20 ఫార్మాట్‌లో శతకం బాదిన అతి పిన్నవయస్కు (14 ఏళ్లు)డిగా వైభవ్‌. ఐపీఎల్‌లో తన తొలి ఓవర్‌లోనే అత్యధిక రన్స్‌ (30) సమర్పించుకున్న బౌలర్‌గా కరీం జనత్‌.

1

ఐపీఎల్‌లో 200+ ఛేదనను తక్కువ ఓవర్లలో (15.5)నే పూర్తి చేసిన జట్టుగా రాజస్థాన్‌

2

ఐపీఎల్‌లో రెండో వేగవంతమైన (35 బంతుల్లో) శతకాన్ని నమోదు చేసిన వైభవ్‌. గేల్‌ (30 బంతుల్లో) టాప్‌లో ఉన్నాడు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

బెంగళూరు 10 7 3 0 14 0.521

ముంబై 10 6 4 0 12 0.889

గుజరాత్‌ 9 6 3 0 12 0.748

ఢిల్లీ 9 6 3 0 12 0.482

పంజాబ్‌ 9 5 3 1 11 0.177

లఖ్‌నవూ 10 5 5 0 10 -0.325

కోల్‌కతా 9 3 5 1 7 0.212

రాజస్థాన్‌ 10 3 7 0 6 -0.349

హైదరాబాద్‌ 9 3 6 0 6 -1.103

చెన్నై 9 2 7 0 4 -1.302

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2025 | 06:33 AM