Bezos Wedding: అమెజాన్ అధినేత పెళ్లి ఆహ్వానపత్రిక వైరల్.. తిట్టిపోస్తున్న జనాలు
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:31 PM
జెఫ్ బెజోజ్, లారా శాంచెజ్ పెళ్లి ఆహ్వాన పత్రికపై జనాలు పెదవి విరుస్తున్నారు. డబ్బున్నంత మాత్రాన మంచి కళాభిరుచి అలవడదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్, మాజీ న్యూస్ యాంకర్ లారెన్ శాంచెజ్ త్వరలో వివాహ బంధంలో అడుగు పెట్టనున్నారు. అయితే, ఈ వివాహ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక డిజైన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్విటేషన్ కార్డు అస్సలు బాలేదంటూ జనాలు బెజోస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. డబ్బుతో పాటు కాస్తంత అభిరుచి, కళాపోషణ ఉండాలంటూ చురకలంటిస్తున్నారు.
బెజోస్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తెల్లటి బ్యాక్‌గ్రౌండ్‌పై పక్షులు, సీతాకోకచిలుకలు, తోకచుక్కలు వంటి వాటితో ఈ కార్డును డిజైన్ చేశారు. ఈ వేడుకలో ‘మీరు మా వెంట ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే, మాకు ఎలాంటి బహుమతులు తీసుకురావొద్దు’ అని ఆహ్వానపత్రికపై రాశారు. వెనిస్ నగర సాంస్కృతి వైభవం పరిరక్షణ కోసం అతిథుల తరపున డొనేషన్‌లను యునెస్కో వెనిస్ కార్యాలయానికి అందజేస్తున్నట్టు కూడా కార్డు మీది రాసి ఉంది. వనాల పరిరక్షణ కోసం డొనేషన్‌లు ఇస్తున్నట్టు రాశారు.
ఇన్విటేషన్‌లోని సందేశం జనాలను ఆకట్టుకున్నప్పటికీ దాని డిజైన్‌ను మాత్రం తట్టుకోలేక పోయారు. అంత అపరకుబేరుడు, అసలేమాత్రం కళాత్మకత లేని ఆహ్వాన పత్రికను ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. 11 ఏళ్ల బాలుడు మైక్రోసాఫ్ట్ పెయింట్‌లో దీన్ని డిజైన్ చేసినట్టు ఉందని సెటైర్లు పేల్చారు. అపార సంపద ఉంటే సరిపోదని, కాస్తంత అభిరుచి కూడా ఉండాలని చెప్పు కొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే, బెజోస్ పెళ్లి వేడుకపై జనాల్లో ఆసక్తి పతాకస్థాయికి చేరుకుంది. జూన్ 24 నుంచి 26 మధ్య వేడుక ఉంటుందని తొలుత వార్తలు వెలువడ్డాయి. ఈ వారం చివర్లో ఉండొచ్చని తాజాగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటలీ అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. దాదాపు మూడు రోజుల పాటు ఈ తంతు జరగనుంది.
ఇవి కూడా చదవండి:
ఇన్సూరెన్స్ డబ్బు కోసం రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు.. ఇదేం తెలివి బ్రో..
ఇటీవలే పెళ్లైన యువకుడికి భారీ షాక్.. భార్యను ఇంప్రెస్ చేద్దామనుకుంటే..