US: హెచ్-1బీ వీసా వివాదం.. అమెరికా కంపెనీపై జరిమానా
ABN , Publish Date - Jun 12 , 2025 | 06:33 PM
హెచ్-1బీ వీసా ఉద్యోగులకు అనుకూల విధానం అవలంబిస్తున్నదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కంపెనీ చివరకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్తతో రాజీ కుదుర్చుకుంది. సుమారు 71 వేల డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది.

ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసాదారులకు అనుకూలమైన విధానాలు అవలంబించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అమెరికా కంపెనీ జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌తో రాజీ కుదుర్చుకుంది. మొత్తం 71,916 డాలర్ల జరిమానా చెల్లించేందుకు కాలిఫోర్నియాలోని ఎపిక్ సొల్యూషన్స్ అంగీకరించింది.
అమెరికా ఉద్యోగులను కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జస్టిస్ డిపార్ట్మెంట్తో సెటిల్మెంట్ చేసుకున్న తొలి కంపెనీ ఎపిక్ సొల్యూషన్స్ కావడంతో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది. విదేశీ వర్కర్లకు ప్రాధాన్యమిస్తూ అమెరికన్లపై వివక్ష ప్రదర్శించే కంపెనీలను దారిలోకి తెచ్చేందుకు అమెరికా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ‘అమెరికా పౌరుల ప్రయోజనాలు రక్షించడానికే మా తొలి ప్రాధాన్యం’ అని అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఫర్ సివిల్ రైట్స్ పేర్కొన్నారు. ఇలా వివక్ష ప్రదర్శించే కంపెనీలను హెచ్చరించామని అన్నారు. ఇకపై ప్రభుత్వం ఈ కంపెనీలను చూసీచూడనట్టు ఉండడం జరగదని స్పష్టం చేశారు.
అమెరికా ప్రభుత్వంతో కుదుర్చుకున్న సెటిల్మెంట్ ప్రకారం ఎపిక్ సొల్యూషన్స్ 71,916 డాలర్లను సివిల్ పెనాల్టీ కింద అమెరికా ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఉద్యోగనియామకాలకు సంబంధించిన విధివిధానాలపై శిక్షణ తీసుకుంటుంది. ఈ విధానాల్లో మార్పులు కూడా చేయనుంది. అమెరికా వర్కర్లకు అవకాశాల్లేని విధంగా అక్రమ మార్గాల్లో ఉద్యోగనియామకాలు చేపట్టడానికి ముగింపు పలుకుతుంది.
ఇదిలా ఉంటే, లాస్ఏంజిలిస్ నగరంలో అక్రమ వలసదారులను బహిష్కరించేందుకు డొనాల్ట్ ట్రంప్ తీవ్ర చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నేషనల్ గార్డు దళాలను మోహరించారు. పలువురిని అరెస్టు కూడా చేశారు. అయితే, జాతీయ భద్రతా దళాలను దింపడంపై అక్కడ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారని, రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని నగర మేయర్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఇవి కూడా చదవండి
డిపోర్టు చేస్తుండగా తప్పించుకున్న భారతీయుడు.. టార్మాక్‌పై పరుగు
ఎయిర్‌పోర్టులో షాకింగ్ దృశ్యం.. ఎన్నారై విద్యార్థికి బేడీలు వేసి దారుణంగా..
Read Latest NRI News And Telugu News