Share News

NRI: పెట్టుబడులపై విషప్రచారం జగన్ కుటిలత్వానికి ప్రతీక: టీడీపీ ఎన్నారై కన్వీనర్‌ కోమటి జయరాం

ABN , Publish Date - Apr 26 , 2025 | 10:36 PM

ఉర్సా సంస్థ అమెరికాలో స్థిరపడిన తెలుగువారి ఆధ్వర్యంలో నడిచేదని కోమటి జయరాం తెలిపారు. స్వదేశంలో యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కార్యకలాపాలు విస్తరించాలనుకున్నప్పుడు.. ఎన్నో రాష్ట్రాలు ఆహ్వానించినప్పటికీ తెలుగు రాష్ట్రాల మీద మమకారంతో..

NRI: పెట్టుబడులపై విషప్రచారం జగన్ కుటిలత్వానికి ప్రతీక: టీడీపీ ఎన్నారై కన్వీనర్‌ కోమటి జయరాం
Komati Jayaram

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అనే సామెత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని టీడీపీ ఎన్నారై కన్వీనర్‌ కోమటి జయరాం పేర్కొన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను గానీ, పెట్టుబడులు పెట్టి ఉపాధులు కల్పించగల సంస్థను కానీ రాష్ట్రానికి తీసుకురావడం చేతకాలేదన్నారు. విశాల దృక్పథంతో వందల మందికి ఉపాధి కల్పించే సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు మోకాలడ్డడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న సంస్థలపై తప్పుడు ప్రచారాలతో దుర్మార్గపు ప్రచారానికి దిగజారడం దారుణమని కోమటి జయరాం పేర్కొన్నారు. దోచుకున్నదంతా దాచుకోవడానికి షెల్ కంపెనీలను సృష్టించి.. ఆ ముసుగులో లక్షల కోట్లు వెనకేయడం బాగా అలవాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి నిర్దిష్టమైన కార్యచరణ, స్పష్టమైన కార్యకలాపాలతో ముందుకు వస్తున్న సంస్థల మీద ప్రజల్లో అనుమానాలు పుట్టించడానికి కుటిల యత్నాలు చేస్తున్నారని విమర్శించారు.


మంత్రి లోకేష్ పిలుపుతో

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల అమెరికా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని పిలుపునిచ్చారని కోమటి జయరాం గుర్తు చేశారు. మంత్రి లోకేష్ పిలుపుతో అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన తెలుగు వాళ్లలో కొందరు ఓ కంపెనీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తుంటే అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో వైసిపి అసత్య ప్రచారం చేస్తుందని కోమటి జయరాం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇష్టం లేకనే వైసిపి ఈ విధమైన కుట్రలకు పాల్పడుతుందన్నారు.

తెలుగువారి సంస్థ ఉర్సా

ఉర్సా సంస్థ అమెరికాలో స్థిరపడిన తెలుగువారి ఆధ్వర్యంలో నడిచేదని కోమటి జయరాం తెలిపారు. స్వదేశంలో యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కార్యకలాపాలు విస్తరించాలనుకున్నప్పుడు.. ఎన్నో రాష్ట్రాలు ఆహ్వానించినప్పటికీ తెలుగు రాష్ట్రాల మీద మమకారంతో తెలంగాణలోని రేవంత్ సర్కారుతోను, ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్స్ నెలకొల్పేందుకు ఉర్సా కంపెనీ ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఏపీలో విశాఖలో కూడా అలాంటి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరిందని, అయితే, ఏపీకి సంస్థలు రావడం, యువతకు ఉపాధి ఏర్పడడం అంటే కన్నుకుట్టే జగన్మోహన్ రెడ్డి.. కుటిల ప్రచారం చేస్తున్నారన్నారు.


అసలు వాస్తవం ఇదే

రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా.. సిమెంటు ఫ్యాక్టరీలు, పత్రికలు, మీడియా సంస్థలు నెలకొల్పే కుట్ర తెలివితేటలు లేని తమవంటి నిజాయితీగల సంస్థ మీద జగన్మోహన్ రెడ్డి విషం కక్కడం, జగన్‌ సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం సాగించడం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహమని ఇప్పటికే ఉర్సా సంస్థ ప్రతినిధులు తెలిపారు. వాస్తవానికి ఉర్సా సంస్థ రూ.5728 కోట్ల పెట్టుబడితో విశాఖలో ఏఐ డేటా సెంటరును ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. అమెరికాలో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా సేవలందిస్తున్న ట్రాక్ రికార్డుతో వారు తమ సేవలను సొంత తెలుగు ప్రాంతానికి విస్తరిస్తున్నారు. కేవలం మంచి కంపెనీలు రాష్ట్రానికి రాకూడదు, ఇక్కడి యువతకు మెరుగైన ఉపాధులు అందరాదనే కుటిలత్వమే జగన్ తోను, ఆయన నీలిదళాలతోను ఇలాంటి పనులు చేయిస్తున్నాయని ఉర్సా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా సంస్థలపై ఉర్సా సంస్థ పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతోంది. సొంత డబ్బు ఒక్క పైసా కూడా పెట్టకుండా ఇతర సంస్థలను, కంపెనీలను బెదిరించి ప్రలోభ పెట్టి వారినుంచి తప్పుడు మార్గాల్లో నిధులు పుచ్చుకుని సొంత కంపెనీలు ప్రారంభించే జగన్మోహన్ రెడ్డికి.. నిజాయితీగా పనిచేసే.. యువత భవిత కోసం, రాష్ట్రం కోసం నిజాయితీగా సేవలందించే సంస్థలన్నీ తప్పుడు సంస్థలుగా కనిపించడంలో వింతేమీ లేదని ఉర్సా సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Telugu Latest News Click Here

Updated Date - Apr 27 , 2025 | 08:26 AM